ఫేవరెట్ల పయనం సాఫీగా..
ABN , Publish Date - Jan 23 , 2026 | 05:02 AM
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫేవరెట్లు, సీడెడ్ల పయనం సాఫీగా సాగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినర్, 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న నొవాక్ జొకోవిచ్, మహిళల్లో గతేడాది విజేత మాడిసన్ కీస్, రెండో సీడ్ ఇగా స్వియటెక్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు.
మూడో రౌండ్‌లో సినర్, జొకో, స్వియటెక్, కీస్
ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫేవరెట్లు, సీడెడ్ల పయనం సాఫీగా సాగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినర్, 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న నొవాక్ జొకోవిచ్, మహిళల్లో గతేడాది విజేత మాడిసన్ కీస్, రెండో సీడ్ ఇగా స్వియటెక్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల రౌండ్-2లో రెండో సీడ్ సినర్ 6-1, 6-4, 6-2తో డక్‌వర్త్‌పై గెలుపొందాడు. నాలుగో సీడ్ జొకోవిచ్ 6-3, 6-2, 6-2తో ఫ్రాన్సిస్కో మాస్ట్రెల్లీపై నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ ముసేటి 6-3, 6-3, 6-4తో సొనెగోని, బెన్ షెల్టన్ 6-3, 6-2, 6-2తో స్వీనీని, టేలర్ ఫ్రిట్జ్ 6-1, 6-4, 7-6 (4)తో కొప్రీవాని, కాస్పెర్ రూడ్ 6-3, 7-5, 6-4తో మునార్‌ని, ఖచనోవ్ 6-1, 6-4, 6-3తో అమెరికన్ తెలుగు ఆటగాడు బసవారెడ్డిని ఓడించి తదుపరి రౌండ్‌లోకి అడుగుపెట్టారు. మహిళల రెండో సీడ్ స్వియటెక్ 6-2, 6-3తో బౌజ్కోవాని, రిబకినా 7-5, 6-2తో గ్రచేవాపై, అనిసిమోవా 6-1, 6-4తో సినియకోవాపై, ఆరో సీడ్ పెగులా 6-0, 6-2తో కెస్లర్‌పై, తొమ్మిదో సీడ్ కీస్ 6-1, 7-5తో క్రుగెర్‌పై గెలుపొందారు.
బాలాజీ జోడీ బోణీ..భాంబ్రీ జంట ఓటమి..: పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ/నీల్ (ఆస్ట్రియా) జోడీ తొలి రౌండ్‌లో 7-6 (4), 3-6, 7-6 (8)తో థామ్సన్/హెర్బర్ట్ ద్వయంపై నెగ్గారు. మిక్స్‌డ్ డబుల్స్ మొదటి రౌండ్‌లో యుకీ భాంబ్రీ/నికోల్ మార్టినెజ్ (అమెరికా) జంట 4-6, 6-7 (3)తో పుట్జ్/జాంగ్ చేతిలో ఓటమి చవిచూసింది.