పరుగుల పండుగ
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:40 AM
ధనాధన్ క్రికెట్‌లో అత్యున్నత పోరు నేటి నుంచే.. ఈసారి ఐపీఎల్‌కన్నా ముందుగానే క్రికెట్ ప్రేమికులను టీ20 వరల్డ్‌కప్ అలరించబోతోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో సూర్యకుమార్ సేన డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఇక ఉత్కంఠ రేపే పోరాటాలు..
ధనాధన్ క్రికెట్‌లో అత్యున్నత పోరు నేటి నుంచే.. ఈసారి ఐపీఎల్‌కన్నా ముందుగానే క్రికెట్ ప్రేమికులను టీ20 వరల్డ్‌కప్ అలరించబోతోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో సూర్యకుమార్ సేన డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఇక ఉత్కంఠ రేపే పోరాటాలు.. తుఫాన్ ఇన్నింగ్స్‌లతో బ్యాటర్ల విన్యాసాలు.. వణికించే బంతులతో వికెట్ల వేటలో బౌలర్లు.. రెప్పపాటులో పట్టిన క్యాచ్‌లతో బ్యాటర్లకు షాక్ ఇచ్చే సూపర్ ఫీల్డర్లు.. ఇలా దాదాపు నెల రోజుల పాటు అందరికీ వినోదాన్ని పంచేందుకు విశ్వకప్ సిద్ధంగా ఉంది.
ముంబై: టోర్నీ ఆరంభానికి ముందే వివాదాలతో నలుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌నకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి మార్చి 8 వరకు టోర్నమెంట్ జరుగనుంది. 20 జట్లు పోటీపడుతున్న వేళ మొత్తంగా 55 మ్యాచ్‌లతో కొత్త చాంపియన్ ఎవరో తేలనుంది.. 20 జట్లు పోటీపడుతున్న వేళ మొత్తంగా 55 మ్యాచ్‌లతో కొత్త చాంపియన్ ఎవరో తేలనుంది. అలాగే ఆరంభ రోజైన శనివారం నుంచి గ్రూప్ దశలో ప్రతిరోజు మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి సూపర్ 8 నిర్వహిస్తారు. ఇక ఆతిథ్య భారత్ వరుసగా రెండో టైటిల్ కోసం అమెరికాతో తమ ప్రస్థానాన్ని ఆరంభించబోతోంది. ఈ మ్యాచ్‌కు స్థానిక వాంఖడే మైదానం వేదిక కానుంది. అయితే దీనికంటే ముందుగా ఉదయం 11 గంటలకు పాకిస్థాన్-నెదర్లాండ్స్ కొలంబోలో, మధ్యాహ్నం 3 గంటలకు కోల్‌కతాలో వెస్టిండీస్-స్కాట్లాండ్ మ్యాచ్‌లు జరుగుతాయి.
ఇదీ చరిత్ర..
టెస్టులు, వన్డేలతో కాస్త స్తబ్ధుగా మారిన క్రికెట్‌కు మరింత ఊపు తెచ్చేందుకు పొట్టి ఫార్మాట్‌ను రంగంలోకి తెచ్చారు. అలాగే దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆరంభమైన టీ20 వరల్డ్‌కప్‌తో ఈ ఆట దశ తిరిగింది. 2007 టోర్నీ ఆరంభ మ్యాచ్ మొదటి బంతినే సిక్సర్‌గా మలిచిన వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ ఏకంగా శతకంతోనూ అందరి దృష్టిని మరల్చాడు. అంతేకాదు యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో అబ్బురపరిచిన విన్యాసం కూడా అదే టోర్నీలో ఆవిష్కృతమైంది. ఇక దాయాది పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్‌ను ఎవరు మర్చిపోగలరు? పాక్‌పై భారత్ సాధించిన ఈ అపూర్వ విజయం ఆధునిక క్రికెట్‌కు సరికొత్త దిశను నిర్దేశించింది. రాబోయే టీ20 వరల్డ్‌కప్‌ల్లో జరుగబోయే నాటకీయ పరిణామాలకు కూడా నాంది పలికినట్టయింది. కానీ పాక్ జట్టు 2009లో టైటిల్ సాధించి తమ కలను నెరవేర్చుకోగలిగింది. 2010లో కెవిన్ పీటర్సన్ సూపర్ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ తొలిసారి విజేతగా నిలిచింది. 2012లో విండీస్, 2014లో శ్రీలంక తమ కప్ ముచ్చట తీర్చుకున్నాయి. అలాగే భారత్ తొలిసారి ఆతిథ్యమిచ్చిన 2016 టోర్నీ ఫైనల్ నభూతో అన్నట్టుగా సాగింది. అనంతరం ఐదేళ్ల విరామం తర్వాత 2021లో జరిగిన టోర్నీని ఆసీస్ తొలిసారి గెల్చుకుంది. ఏడాది తర్వాత ఇంగ్లండ్ రెండోసారి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. మరోవైపు 2024లో యూఎస్, కరీబియన్ దీవుల్లో జరిగిన మెగా టోర్నీ 20 జట్లతో సాగగా, దక్షిణాఫ్రికాతో ఫైనల్లో టీమిండియా గెలిచింది.
నాలుగు గ్రూప్‌లుగా
క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయాలనే ప్రణాళి కతో క్రితం సారి నుంచి జట్ల సంఖ్యను 20కి పెంచారు. ర్యాంకింగ్, ఆతిథ్య జట్ల హోదాలో 8 జట్లు ముందుగా అర్హత సాధించగా.. మిగతా టీమ్స్ క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా బెర్త్ దక్కించుకున్నాయి. ఇక బంగ్లాదేశ్‌పై వేటు వేసిన ఐసీసీ ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంది. మొత్తంగా 20 జట్లను ఐదేసి చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఆయా జట్లు తమ గ్రూప్‌లోని మిగతా నాలుగింటితో తలపడతాయి. ఇందులో టాప్-2గా నిలిచిన ఎనిమిది టీమ్స్‌ను మరో రెండు గ్రూప్‌లుగా విడదీసి సూపర్-8ను నిర్వహిస్తారు. ఇందులో మూడేసి మ్యాచ్‌లు జరిగాక, ఆపై సెమీస్, ఫైనల్ ఉంటాయి.
సంప్రదాయ, పాశ్చాత్య కలయికతో ఆరంభ వేడుకలు
టీ20 వరల్డ్‌కప్ ప్రారంభ వేడుకలు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్నాయి. భారత్-యూఎ్‌సఏ మ్యాచ్‌కు ముందు జరిగే ఈ కార్యక్రమం శాస్ర్తీయ సంగీతంతో పాటు పాప్ గీతాలపనతో మురిపించనుంది. ప్రఖ్యాత డ్రమ్స్ వాయిద్యకారుడు శివమణి, సితారిస్ట్ రిషభ్ రిఖిరామ్ శర్మ సందడి చేయనున్నారు. అనంతరం ర్యాపర్, సింగర్ బాద్షా, బాలీవుడ్ నటి నోరా ఫతే తమ ఆటపాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు.