Share News

టీ20 డబ్ల్యూసీ ఫైనల్: భారత్ బ్యాటర్ల విధ్వంసం.. కివీస్ టార్గెట్ 256

ABN , Publish Date - Mar 08 , 2026 | 08:44 PM

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి మంచి ఓపెనింగ్ ఇచ్చారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి.. న్యూజిలాండ్ ముందు 256 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది.

టీ20 డబ్ల్యూసీ ఫైనల్: భారత్ బ్యాటర్ల విధ్వంసం.. కివీస్ టార్గెట్ 256

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి మంచి ఓపెనింగ్ ఇచ్చారు. అనంతరం ఇషాన్ కిషన్ సైతం అర్ధ సెంచరీతో అద్భుతంగా రాణించాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి.. న్యూజిలాండ్ ముందు 256 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది.


మ్యాచ్ విషయానికి వస్తే... టీ20 ప్రపంచ కప్‌2026 టోర్నీలో న్యూజిలాండ్‌తో ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అహ్మదాబాద్‌ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత ఓపెనర్లు సంజు, అభిషేక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో 50కి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్‌ జోడీగా భారత స్టార్లు నిలిచారు. మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపిన అభిషేక్‌.. రచిన్‌ రవీంద్ర బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. సంజూతో కలిసి అభిషేక్‌ తొలి వికెట్‌కు 43 బంతుల్లో 98 పరుగులు జోడించాడు. సూపర్ ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ కూడా 89 పరుగులు వద్ద జేమ్స్ నీషమ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.


ఇషాన్ కిషన్ సైతం అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఖాతా తెరవకుండానే జెమ్స్ నీషమ్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ బ్యాటర్లలో సంజు శాంసన్(89), ఇషాన్ కిషన్(54), అభిషేక్ శర్మ(52) అద్భుతంగా రాణించారు. చివర్లో శివం దూబె బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 8 బంతుల్లో 26 పరుగులు సాధించాడు. ఇక కివీస్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ 3 వికెట్లు సాధించి..భారత్ భారీ స్కోర్‌కు కళ్లెం వేశాడు. మ్యాట్‌ హెన్రీ, రచిన్ రవీంద్ర చెరో వికెట్ సాధించారు.

Updated Date - Mar 08 , 2026 | 09:03 PM