శ్రీచరణికి చోటు
ABN , Publish Date - May 03 , 2026 | 03:54 AM
నిరుటి వన్డే వరల్డ్ కప్‌లో అదరగొట్టిన తెలుగు స్పిన్నర్ శ్రీచరణికి తొలిసారి టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు లభించింది. అలాగే గత పొట్టి వరల్డ్ కప్‌లో సత్తా చాటిన మరో తెలుగు పేసర్ అరుంధతి రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
ముంబై: నిరుటి వన్డే వరల్డ్ కప్‌లో అదరగొట్టిన తెలుగు స్పిన్నర్ శ్రీచరణికి తొలిసారి టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు లభించింది. అలాగే గత పొట్టి వరల్డ్ కప్‌లో సత్తా చాటిన మరో తెలుగు పేసర్ అరుంధతి రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. వచ్చేనెల 12న ఇంగ్లండ్, వేల్స్ దేశాల్లో జరిగే మహిళల టీ20 ప్రపంచ కప్, అంతకంటే ముందు (ఈనెల 28 నుంచి) ఇంగ్లండ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్, ఏకైక టెస్ట్ (జూలై 10 నుంచి)కు భారత జట్లను శనివారం ప్రకటించారు. వికెట్ కీపర్, బ్యాటర్ యాస్తికా భాటియా, పేసర్ భారతీ ఫుల్‌మాలీ, అన్‌క్యా్‌ప్డ నందినీ శర్మకు ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించారు. స్పెషలిస్ట్ బ్యాటర్ హర్లీన్ డియోల్‌పై వేటు వేశారు. ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్, సీమర్ కష్వీ గౌతమ్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతీ మంధాన ఆమెకు డిప్యూటీగా వ్యవహరించనుంది. సీనియర్ పేసర్ పూజా వస్త్రాకర్‌కు చోటు లభించలేదు. దాంతో రేణుకా సింగ్ ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించనుంది. ఆమెకు తోడుగా అరుంధతి, క్రాంతి గౌడ్‌ను ఎంపిక చేశారు. గత టీ20 ప్రపంచ కప్ (2024)లో అరుంధతి మొత్తంగా 6.50 ఎకానమీతో 7 వికెట్లు తీసింది. ఇక, నిరుటి వన్డే వరల్డ్ కప్‌లో స్పిన్నర్ శ్రీచరణి మొత్తం 14 వికెట్లు పడగొట్టి భారత జట్టు విజేతగా నిలవవడంలో కీలక పాత్ర పోషించింది. దాంతో టీ20 వరల్డ్ కప్ జట్టులోనూ శ్రీచరణి స్థానం సంపాదించు కుంది. అలాగే ప్రపంచ కప్ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే ఏకైక టెస్ట్‌కు జట్టులో శ్రీచరణి చోటు దక్కించుకుంది. దరిమిలా 3 ఫార్మాట్లలో ఆడే చాన్సు ఆమెకు లభించింది. ప్రధాన జట్టంతా దాదాపు గత ఏడాది వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమే కావడం గమనార్హం. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో పాకిస్థాన్‌తో పోరు ద్వారా టీ20 ప్రపంచ కప్ సమరాన్ని టీమిండియా ఆరంభించనుంది. ఇక, గత మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రాణించిన మీడియం పేసర్ నందినీ శర్మకు తొలిసారి జాతీయ జట్టుకు ఆడేందుకు పిలుపు లభించింది. కాగా..ప్రతికను జూలై 10 నుంచి 13 వరకు ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగే ఏకైక టెస్ట్ జట్టుకు ఎంపిక చేశారు. హర్లీన్ డియోల్‌ను ఇంగ్లండ్‌లో తెల్లబంతుల టూర్‌కు భారత్ ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా నియమించారు.

ఇంగ్లండ్‌తో టీ20లు,
వరల్డ్ కప్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతీ మంధాన (వైస్-కెప్టెన్), రిచా ఘోష్ (కీపర్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్‌మాలీ, దీప్తీశర్మ, అరుంధతి రెడ్డి, శ్రీచరణి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, నందినీ శర్మ, రాధా యాదవ్.
ఇంగ్లండ్‌తో టెస్ట్‌కు: హర్మన్ (కెప్టెన్), మంధాన (వైస్-కెప్టెన్), షఫాలీ, జెమీమా, ప్రతిక రావల్, రిచా ఘోష్ (కీపర్), శ్రీచరణి, యాస్తికా భాటియా, నందినీ శర్మ, హర్లీన్ డియోల్, రేణుక సింగ్, క్రాంతి గౌడ్, సయాలీ సత్గరే, స్నేహ్ రాణా.