Share News

ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన స్పెయిన్

ABN , Publish Date - Aug 15 , 2026 | 04:14 PM

అంతర్జాతీయ క్రికెట్‌లో స్పెయిన్‌ పురుషుల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. దిగ్గజ జట్టు ఆస్ట్రేలియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.

ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన స్పెయిన్
Spain Cricket Team

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా జట్టు ఎంత బలమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక ఐసీసీ ట్రోఫీలను తన ఖాతాలో వేసుకుని.. క్రికెట్ ప్రపంచాన్ని ఆసీస్ శాసిస్తుంది. అంతేకాక ఆస్ట్రేలియా ఖాతాలో పలు చెక్కుచెదరని రికార్డులు ఉన్నాయి. వాటిని భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి బలమైన జట్లు కూడా టచ్ చేయలేకపోయాయి. అయితే తాజాగా ఆస్ట్రేలియాకు ఖాతాలో ఉన్న ఓ అరుదైన ప్రపంచ రికార్డు బద్దలైంది. అదికూడా స్పెయిన్ లాంటి చిన్న జట్టు ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచకప్‌ 2028 సబ్‌ రీజియనల్‌ యూరోప్‌ క్వాలిఫయర్‌- ‘సి’లో భాగంగా.. స్పెయిన్‌ ఫిన్‌లాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఫిన్‌లాండ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో వరుసగా అత్యధిక విజయాలు(21) సాధించిన జట్టుగా స్పెయిన్‌ చరిత్రకెక్కింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న గత వరల్డ్‌ రికార్డును బద్దలు కొట్టింది. కాగా రిక్కీ పాంటింగ్‌ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2003లో వరుసగా 20 విజయాలు నమోదు చేసింది.


మ్యాచ్ విషయానికి వస్తే... కెరవా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన స్పెయిన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. సొంతగడ్డపై మొదట బ్యాటింగ్‌కు దిగిన ఫిన్‌లాండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఓపెనర్‌ అరవింద్‌ మోహన్‌ ఒక్కటే అర్ధ శతకం(57)తో రాణించాడు. స్పెయిన్‌ బౌలర్లలో చార్లీ రుమిస్ట్రెమిజ్‌ మూడు వికెట్లు సాధించగా.. లోర్నే బర్న్స్‌ రెండు, యాసిర్‌ అలీ, ఆతిఫ్‌ మహమూద్‌ తలా ఒక వికెట్‌ తీశారు.


అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన స్పెయిన్‌ 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 135 పరుగులు సాధించింది. దీంతో ఫిన్‌లాండ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యాసిర్‌ అలీ 40, డేనియెల్‌ డాలే కాలే 49 పరుగులతో అజేయంగా నిలిచి.. స్పెయిన్‌ను విజయతీరాలకు చేర్చారు. కాగా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో స్పెయిన్‌కు వరుసగా ఇది 21వ విజయం కావడం విశేషం.


అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్లు

  • స్పెయిన్‌- 21* విజయాలు (ఫిబ్రవరి 2023 నుంచి ప్రస్తుతం కొనసాగుతోంది)

  • ఆస్ట్రేలియా- 20 విజయాలు (జనవరి 2003- మే 2003)

  • ఉగాండా- 17 విజయాలు (అక్టోబరు 2024- జూలై 2025)

  • ఆస్ట్రేలియా- 16 విజయాలు (నవంబరు 2000- ఫిబ్రవరి 2001)

  • ఆస్ట్రేలియా- 16 విజయాలు (అక్టోబరు 2006- జనవరి 2007).

Updated Date - Aug 15 , 2026 | 04:24 PM