సెమీస్‌కు సఫారీలు
ABN , Publish Date - Feb 27 , 2026 | 03:47 AM
టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా జోరు కొనసాగుతోంది. టోర్నమెంట్‌లో అజేయ రికార్డును కొనసాగిస్తూ ఆరో విజయం అందుకుంది.
మార్‌క్రమ్ హాఫ్ సెంచరీ
బెంబేలెత్తించిన బౌలర్లు
అహ్మదాబాద్: టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా జోరు కొనసాగుతోంది. టోర్నమెంట్‌లో అజేయ రికార్డును కొనసాగిస్తూ ఆరో విజయం అందుకుంది. తొలుత పేసర్లు, ఆపై బ్యాటర్లు అద్భుతంగా రాణించిన వేళ..మెగా టోర్నీలో మరో అజేయ జట్టు వెస్టిండీస్‌కు ఏకంగా తొమ్మిది వికెట్లతో షాకిచ్చింది. ఇంకో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకొని సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.. గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత కరీబియన్లు 20 ఓవర్లలో 176/8 స్కోరుకే పరిమితమయ్యారు. రొమారియో షెప్పర్డ్ (37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 నాటౌట్), జాసన్ హోల్డర్ (31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49) తప్ప అంతా విఫలమయ్యారు. ఎన్‌గిడి మూడు, రబాడ, బాష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో టాపార్డర్ శివాలెత్తడంతో సఫారీలు 16.1 ఓవర్లలో 177/1 స్కోరు చేసి సునాయాసంగా గెలుపొందారు. కెప్టెన్ మార్‌క్రమ్ (46 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్), డికాక్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47), ర్యాన్ రికెల్టన్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 నాటౌట్) దుమ్ము రేపారు. మార్‌క్రమ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
టాపార్డర్ ఫటాఫట్
ఛేదనలో దక్షిణాఫ్రికా టాపార్డర్ బ్యాటర్లు ధనాధన్ షాట్లతో చెలరేగారు. మార్‌క్రమ్, డికాక్ తొలి బంతి నుంచే విరుచుకు పడడంతో పవర్ ప్లేలో సఫారీలు 69/0తో తిరుగులేని స్థితిలో నిలిచారు. ప్రత్యర్థి పేసర్లు, స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకొని ఆడిన మార్‌క్రమ్, డికాక్ మొదటి వికెట్‌కు 48 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. ఈ దశలో డికాక్ నిష్క్రమించినా..వన్‌డౌన్ బ్యాటర్ రికెల్టన్ కూడా దూకుడు ప్రదర్శించడంతో విండీస్ బౌలర్లకు దిక్కుతోచలేదు. ఇక..సూపర్ ఫామ్‌లో ఉన్న మార్‌క్రమ్ టోర్నీలో మూడో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మార్‌క్రమ్, రికెల్టన్ రెండో వికెట్‌కు 50 బంతుల్లో అభేద్యంగా 82 పరుగులు జత చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
విండీస్ విలవిల
భారీ హిట్టర్లతో నిండిన వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి కుదేలైంది. దాంతో 11వ ఓవర్‌కు 83/7 స్కోరుతో కనీసం వంద పరుగులైనా చేయగలుగుతుందా..అనిపించింది. అయితే షెప్పర్డ్, హోల్డర్ అసమానంగా పోరాడి ఎనిమిదో వికెట్‌కు 89 పరుగులు (57 బంతులు) జోడించడంతో వెస్టిండీస్ పోటీ ఇచ్చే స్కోరు అందుకుంది. షెప్పర్డ్, హోల్డర్ భాగస్వామ్యం టీ20లలో ఎనిమిదో వికెట్‌కు రికార్డు కావడం విశేషం.