సారథి ముందుండి..
ABN , Publish Date - Apr 12 , 2026 | 02:59 AM
తొలుత బౌలింగ్‌లో మార్పులు, చేర్పులు..ఆపై అజేయ హాఫ్ సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ (33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 నాటౌట్) కెప్టెన్‌గా ముందుండి నడిపించిన వేళ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ...
చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
సన్‌రైజర్స్‌పై పంజాబ్ విజయం
అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ వృథా
ముల్లన్‌పూర్ (పంజాబ్): తొలుత బౌలింగ్‌లో మార్పులు, చేర్పులు..ఆపై అజేయ హాఫ్ సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ (33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 నాటౌట్) కెప్టెన్‌గా ముందుండి నడిపించిన వేళ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ మరో విజయం అందుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. తొలుత హైదరాబాద్ 20 ఓవర్లలో 219/6 స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 74) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. క్లాసెన్ (39), ట్రావిస్ హెడ్ (38) రాణించారు. శశాంక్ సింగ్, అర్ష్‌దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భారీ ఛేదనలో పంజాబ్ 18.5 ఓవర్లలోనే 223/4 స్కోరు చేసి నెగ్గింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్యా (20 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) మెరుపు హాఫ్ సెంచరీలు సాధించారు. ప్రియాన్ష్ 16 బంతుల్లోనే అర్ధ శతకం బాదేశాడు. నాలుగో స్థానంలో వచ్చిన సారథి శ్రేయాస్ దూకుడైన ఇన్నింగ్స్‌తో అలరించాడు. తుదికంటా క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. కూపర్ కనోలి 11, నేహల్ వధేరా 14 రన్స్ చేయగా, శశాంక్ (16 నాటౌట్) అజేయంగా నిలిచాడు. శివాంగ్ కుమార్ మూడు వికెట్లు తీశాడు. శ్రేయాస్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. పంజాబ్‌కిది వరుసగా మూడో గెలుపు కాగా.. సన్‌రైజర్స్‌కిది వరుసగా రెండో ఓటమి.
ఆరంభం అదిరినా: అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు అభిషేక్, హెడ్ అద్భుత శుభారంభాన్ని అందించారు. అభిషేక్, హెడ్ ధాటికి సన్‌రైజర్స్ 8 ఓవర్లలోనే 120 పరుగులు చేసింది. ముఖ్యంగా పంజాబ్ బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొమ్మిదో ఓవర్లో వీరిద్దరిని శశాంక్ వెంటవెంటనే అవుట్ చేశాడు. అనంతరం మిడిలార్డర్ తడబాటుకు లోనైంది. క్లాసెన్ దంచేసినా ఆఖర్లో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టం చేయడంతో జట్టు స్కోరు 219కి పరిమితమైంది. ఇషాన్ 27, అనికేత్ 18 పరుగులు చేశారు.