శీతల్ ‘డబుల్’
ABN , Publish Date - Oct 23 , 2026 | 05:02 AM
ఆసియా పారా క్రీడల నాలుగో రోజు పోటీల్లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ బుడిగిన రవి కార్తీక్ మూడో పతకాన్ని సొంతం చేసుకొని, హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఎస్13 విభాగం 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో రవి కార్తీక్ 25.89 సెకన్లలో రేసును పూర్తి చేసి..
రెండు గంటల్లో రెండు స్వర్ణాలు
ఎదురులేని ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు
ఐదు స్వర్ణాలతో జోరు
పారా ఆర్చరీలో తన సత్తా ఏమిటో టీనేజ్ సంచలనం శీతల్ దేవి మరోసారి నిరూపించింది..రెండు గంటలలోపే రెండు స్వర్ణాలు సొంతం చేసుకొని అబ్బురపరిచింది. ఇక, భారత ట్రాక్, ఫీల్డ్ అథ్లెట్ల జోరు ఏమాత్రం తగ్గలేదు..నాలుగో రోజు మొత్తం ఐదు స్వర్ణాలు కొల్లగొట్టారు..పురుషుల హైజం్‌పలో మూడు పతకాలూ మనోళ్లకే దక్కాయి..గురువారం ఏకంగా 26 పతకాలు భారత ఖాతాలో చేరాయి..ఓవరాల్‌గా 88 (21-26-41) పతకాలతో పట్టికలో భారత్ నాలుగో స్థానానికి చేరింది.
రవి కార్తీక్ హ్యాట్రిక్
ఆసియా పారా క్రీడల నాలుగో రోజు పోటీల్లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ బుడిగిన రవి కార్తీక్ మూడో పతకాన్ని సొంతం చేసుకొని, హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఎస్13 విభాగం 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో రవి కార్తీక్ 25.89 సెకన్లలో రేసును పూర్తి చేసి, తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటికే రెండు రజతాలు సాధించిన ఈ ఏలూరు స్విమ్మర్ ఖాతాలో తాజాగా కాంస్యం చేరడంతో అతడి వ్యక్తిగత పతకాల సంఖ్య మూడుకు చేరింది. విశాఖపట్నం పారా అథ్లెట్ రవన్ని వలసనైని ఈ ఆసియా క్రీడల్లో రెండో పతకాన్ని కైవసం చేసుకుంది. టీ11 విభాగం 400 మీటర్ల పరుగును రవన్ని ఒక నిమిషం 3.64 సెకన్లలో పూర్తి చేసి, కాంస్యంతో మెరిసింది.
నగోయ (జపాన్): పారా ఆసియాడ్‌లో భారత క్రీడాకారులు దుమ్ము రేపుతున్నారు. గురువారం 7 స్వర్ణ, 5 రజత, 14 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో అదరగొట్టారు. ముఖ్యంగా రెండు చేతులూలేని ఆర్చర్ శీతల్ దేవి అంతర్జాతీయ స్థాయిలో తనకు తిరుగులేదని చాటింది. 19 ఏళ్ల శీతల్ తొలుత తోమన్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో తన పసిడి పతకాన్ని నిలబెట్టుకుంది. ఇండోనేసియా ద్వయం టొడోరా అయుదియా/కెన్ స్వగుమిలాంగ్‌తో జరిగిన ఫైనల్లో శీతల్/టోమన్ జోడీ 151-148తో గెలుపొంది స్వర్ణం సొంతం చేసుకుంది. అనంతరం వ్యక్తిగత విభాగం తుదిపోరులో నాలుగు పాయింట్లు వెనుకంజలో ఉన్నా..పట్టువదలని శీతల్ 142-139తో అలీమ్ నూర్ (సింగపూర్)ను చిత్తు చేసి రెండో పసిడి పతకం అందుకుంది. ఇక..మహిళల డబ్ల్యూ1 వ్యక్తిగత ఆర్చరీ ఫైనల్లో స్వాతి చౌధరి రజత పతకం నెగ్గింది.
పురుషుల హైజంప్‌లో క్లీన్ స్వీప్: మహిళల ఎఫ్54 డిస్క్‌స్‌త్రోలో సువర్ణ రాజ్ స్వర్ణంతో నాలుగో రోజు పోటీల్లో భారత్ పతక వేట మొదలైంది. 15.66మీ. దూరం డిస్క్‌ను విసిరిన 44 ఏళ్ల సువర్ణ విజేతగా నిలిచింది. పురుషుల హైజంప్ టీ63 ఈవెంట్‌లో మూడు పతకాలనూ మనోళ్లే చేజిక్కించుకున్నారు. శైలేష్ కుమార్ (1.89మీ.) పారా ఆసియా క్రీడల రికార్డుతో పసిడి పతకం నెగ్గగా, వరుణ్ భాటీ (1.84మీ.) రజతం, రాహుల్ సరోహా (1.81మీ.) కాంస్యం నెగ్గారు. మహిళల 400మీ. పరుగు ఫైనల్లో అంజనా బెన్ (59.97సె.) పసిడి సాధించగా, జయంతి బెహెరా (1ని.00.65సె.) రజతం సాధించింది. పురుషుల 400మీ. టీ47 రేసులో దిలీప్ గవిట్ (48.27సె.) స్వర్ణం గెలుపొందాడు. ఈ క్రీడల్లో అతడికిది రెండో పసిడి పతకం కావడం విశేషం. 100 మీ. స్ర్పింట్‌లో దిలీప్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. పురుషుల లాంగ్ జంప్‌లో ధర్మరాజ్ సొలైరాజ్ తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్నాడు. టీ44/62/64 ఫైనల్లో 7.15 మీ. పారా ఆసియా రికార్డు దూరం లంఘించిన ధర్మరాజ్ టైటిల్ దక్కించుకున్నాడు. మహిళల 400మీ. టీ12 విభాగం పరుగులో తేజల్‌బెన్ దమోర్ (57.60సె.) రజతం కైవసం చేసుకుంది.
స్విమ్మింగ్‌లో..: స్విమ్మింగ్ పురుషుల 400మీ. ఫ్రీస్టయిల్ ఎస్10 విభాగంలో కపిల్ కుమార్ (4:38.44) రజతం, పురుషుల 100మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ ఎస్‌బీ9 కేటగిరీలో స్వాతిక్ పాటిల్ (1ని.13.77సె.) కాంస్యం, పురుషుల 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ ఎస్7 విభాగంలో తేజస్ నందకుమార్ (1ని.18.58సె.) కాంస్యం అందుకున్నారు. ఈ పతకాలతో స్విమ్మింగ్‌లో భారత్ మెడల్స్ సంఖ్య 10కి చేరింది. టీటీ మిక్స్‌డ్ డబుల్స్ ఎక్స్‌డీ 7 విభాగంలో భవీనాబెన్ పటేల్/శుభమ్ వాధ్వాలో కాంస్య పతకం సాధించారు.