శీతల్, పాయల్ పసిడి ధమాకా
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:02 AM
ప్రపంచ పారా ఆర్చరీ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ శీతల్ దేవి రెండు స్వర్ణాలతో సత్తా చాటింది. పారా కాంపౌండ్ మహిళల టీమ్, మిక్స్‌డ్ ఈవెంట్లలో సహచరులతో కలిసి చాంపియన్‌గా నిలిచింది.
భారత్ ఖాతాలో ఆరు పతకాలు
ప్రపంచ పారా ఆర్చరీ ర్యాంకింగ్ సిరీస్
బ్యాంకాక్: ప్రపంచ పారా ఆర్చరీ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ శీతల్ దేవి రెండు స్వర్ణాలతో సత్తా చాటింది. పారా కాంపౌండ్ మహిళల టీమ్, మిక్స్‌డ్ ఈవెంట్లలో సహచరులతో కలిసి చాంపియన్‌గా నిలిచింది. ఓవరాల్‌గా శీతల్ సహా భారత ఆర్చర్లు శుక్రవారంనాటి పోటీల్లో నాలుగు పసిడి, రెండు కాంస్య పతకాలు సాధించడం విశేషం. కాంపౌండ్ మహిళల టీమ్ ఈవెంట్ ఫైనల్లో శీతల్/పాయల్ నాగ్ ద్వయం 150-147తో కజకిస్థాన్ జోడీని చిత్తుచేయగా, కాంపౌండ్ మిక్స్‌డ్ తుదిపోరులో శీతల్/తోమన్ కుమార్ జంట 153-146తో ఇండోనేసియా ద్వయంపై గెలిచింది. కాంపౌండ్ పురుషుల టీమ్ ఈవెంట్ ఆఖరి పోరులో తోమన్/శ్యామ్‌సుందర్ జంట 153-146తో చైనీస్ తైపీ జోడీని, రికర్వ్ పురుషుల టీమ్ ఫైనల్లో విజయ్/హర్విందర్ ద్వయం 6-2తో చైనీస్ తైపీ జంటను ఓడించి స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. పారా రికర్వ్ మహిళల టీమ్‌లో భావన/రాజశ్రీ రాథోడ్ జోడీ 6-0తో జపాన్ జంటపై, రికర్వ్ మిక్స్‌డ్‌లో భావన/విజయ్ ద్వయం 5-4తో స్లోవేనియా జోడీపై గెలిచి కాంస్యాలు దక్కించుకున్నారు. కాంపౌండ్ మహిళల టీమ్‌లో జంటగా స్వర్ణం గెలిచిన శీతల్, పాయల్.. వ్యక్తిగత విభా గం పసిడి కోసం శనివారం అమీతుమీ తేల్చుకోనున్నారు.