Share News

చెన్నై గెలిచె

ABN , Publish Date - Apr 12 , 2026 | 02:59 AM

హ్యాట్రిక్‌ ఓటముల నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుతంగా కోలుకుంది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 నాటౌట్‌) ఎట్టకేలకు బ్యాట్‌ ఝుళిపించాడు. సంజూ ఈ సీజన్‌లో...

చెన్నై గెలిచె

  • సంజూ అజేయ శతకం జూ 23 రన్స్‌తో ఢిల్లీ ఓటమి

  • ఒవర్టన్‌కు నాలుగు వికెట్లు జూ పోరాడిన స్టబ్స్‌

చెన్నై: హ్యాట్రిక్‌ ఓటముల నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుతంగా కోలుకుంది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 నాటౌట్‌) ఎట్టకేలకు బ్యాట్‌ ఝుళిపించాడు. సంజూ ఈ సీజన్‌లో తొలి సెంచరీ నమోదు చేయగా.. చెన్నై బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. దీంతో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 23 పరుగులతో గెలిచింది. తద్వారా పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఖాతా తెరిచింది. అలాగే చెపాక్‌లో వరుసగా ఆరు ఓటముల తర్వాత చెన్నైకిదే తొలి గెలుపు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఆయుష్‌ మాత్రే (36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 రిటైర్డ్‌ అవుట్‌) హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. సీఎస్‌కే బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఢిల్లీ తడబడింది. స్టబ్స్‌ (38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) ఒంటరి పోరాటం చేయగా.. ఆరంభంలో నిస్సాంక (24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41) ఫర్వాలేదనిపించాడు. పేసర్లు ఒవర్టన్‌కు 4, అన్షుల్‌ కంబోజ్‌కు 3 వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా శాంసన్‌ నిలిచాడు.

శాంసన్‌ అండగా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ ఆటే హైలైట్‌. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన అతను ఎట్టకేలకు సత్తా చాటాడు. తొలి బంతి నుంచే ఆత్మవిశ్వాసంగా కనిపించిన సంజూ ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ రుతురాజ్‌ (15) పేలవ ఫామ్‌ ఈసారీ కొనసాగింది. అయితే శాంసన్‌కు ఆయుష్‌ మాత్రే సహకరించడంతో చెన్నై స్కోరు నిలకడగా సాగింది. అయితే డెత్‌ ఓవర్లలో మరింత జోరుగా ఆడేందుకు హాఫ్‌ సెంచరీ తర్వాత మాత్రే రిటైర్డ్‌ అవుట్‌ అయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు ఈ జోడీ మధ్య 175 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత శాంసన్‌ 52 బంతుల్లోనే లీగ్‌లో తన నాలుగో సెంచరీ పూర్తి చేయగా.. చివర్లో శివమ్‌ దూబే (20) వేగం చూపడంతో స్కోరు 200 దాటింది.

Updated Date - Apr 12 , 2026 | 02:59 AM