ఆర్‌సీబీ ధమాకా
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:00 AM
మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ నుంచి మరో నిరాశాజనక ప్రదర్శన. అటు బ్యాటర్ల రాణింపుతో భారీ స్కోరు సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు బౌలర్ల నుంచి కూడా అద్భుత సహకారం అందింది.
సాల్ట్, రజత్, విరాట్ అర్ధసెంచరీలు
ముంబైకి హ్యాట్రిక్ ఓటమి
ముంబై: మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ నుంచి మరో నిరాశాజనక ప్రదర్శన. అటు బ్యాటర్ల రాణింపుతో భారీ స్కోరు సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు బౌలర్ల నుంచి కూడా అద్భుత సహకారం అందింది. దీంతో వాంఖడే మైదానంలో ముంబైపై 18 పరుగులతో నెగ్గింది. ముంబైకిది వరుసగా మూడో ఓటమి. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిల్ సాల్ట్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78), కెప్టెన్ రజత్ పటీదార్ (20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 53), విరాట్ కోహ్లీ (38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 50), డేవిడ్ (16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 నాటౌట్) వేగంగా ఆడారు. ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 222/5 స్కోరుకే పరిమితమై ఓడింది. రూథర్‌ఫోర్డ్ (31 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్సర్లతో 71 నాటౌట్), హార్దిక్ (22 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 40), రికెల్టన్ (22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37) రాణించారు.
చివర్లో దాడికి దిగినా..: భారీ ఛేదనలో ముంబై ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్ ఎదురుదాడికి దిగినా ఫలితం లేకపోయింది. ఆరంభంలో ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ (19) బౌండరీలు బాదేస్తూ ఆశలు రేపారు. కానీ ఐదో ఓవర్‌లో రోహిత్ తొడకండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. వీరి మధ్య తొలి వికెట్‌కు 57 రన్స్ చేరాయి. అయితే సుయాష్ 8వ ఓవర్‌లో రికెల్టన్, తిలక్ (1) వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. ఈ దశలో హార్దిక్, సూర్య (33) ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ నాలుగో వికెట్‌కు 47 రన్స్ జోడించాక స్వల్ప వ్యవధిలోనే వీరు అవుటయ్యారు. అప్పటికే రన్‌రేట్ పెరగడంతో రూథర్‌ఫోర్డ్ చివర్లో 9 సిక్సర్లతో చెలరేగినా జట్టును గట్టెక్కించలేకపోయాడు.
ఆర్‌సీబీ ‘టాప్’షో: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సాల్ట్, విరాట్‌లతో పాటు రజత్ పటీదార్ అదరగొట్టారు. చివర్లో డేవిడ్ మెరుపులతో జట్టు భారీ స్కోరు సాధించింది. శాంట్నర్ ఓవర్‌లో సాల్ట్ 6,6,6,4తో 22 రన్స్ రాబట్టడంతో పవర్‌ప్లేలో జట్టు 71 రన్స్‌తో నిలిచింది. మార్కండే ఓవర్‌లోనూ 4,4,4,6తో 20 రన్స్ చేసిన సాల్ట్.. 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. దీంతో 9వ ఓవర్‌లోనే ఆర్‌సీబీ స్కోరు వంద దాటింది. అయితే ప్రమాదకరంగా మారిన సాల్ట్‌ను శార్దూల్ 11వ ఓవర్‌లో అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ రజత్ తానెదుర్కొన్న తొలి 4 బంతులను 4,6,6,6గా బాదడంతో స్కోరుబోర్డు ఎక్కడా ఆగలేదు. ఈ ఊపులో అతను 17 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. కాగా, కాస్త నెమ్మదిగా ఆడిన విరాట్ అర్ధసెంచరీ చేసి అదే స్కోరుపై వెనుదిరిగాడు. ఈ జోడీ మధ్య రెండో వికెట్‌కు 65 రన్స్ సమకూరాయి. 16వ ఓవర్‌లో రజత్‌ను శాంట్నర్ అవుట్ చేయగా.. డేవిడ్ బౌండరీలతో జట్టు 240 రన్స్‌కు చేరింది.