Share News

అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్‌కు కీలక పదవి

ABN , Publish Date - Apr 14 , 2026 | 02:45 PM

అఫ్గానిస్థాన్ స్టార్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌కు కీలక పదవి దక్కింది. ప్రపంచ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ ప్లేయర్‌ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా నియమితులయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో రషీద్ ఖాన్ బిజీగా ఉన్నాడు.

అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్‌కు కీలక పదవి
Rashid Khan WCA advisory board,

స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్ స్టార్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌కు కీలక పదవి దక్కింది. ప్రపంచ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ (డబ్ల్యూసీఏ) ప్లేయర్‌ సలహా మండలిలో సభ్యుడిగా నియమితులయ్యాడు. ఈ విషయాన్ని డబ్ల్యూసీఏ ఇవాళ (మంగళవారం) ప్రకటించింది. ప్లేయర్‌ అడ్వైజరీ బోర్డులో రషీద్‌తో పాటు చమారి ఆటపట్టు, డారిల్‌ మిచెల్, వేన్‌ మాడ్సెన్, మాడీ గ్రీన్‌‌లకు కొత్త సభ్యులుగా చోటు దక్కింది. ప్రపంచ క్రికెట్ విషయాలపై ఆటగాళ్లు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ పదవి ఒక ముఖ్యమైన అవకాశం కల్పిస్తుంది. ఈ పదవిలోనే రషీద్‌ తదితరులు గ్లోబల్‌ క్రికెట్‌లో జరిగే విషయాలపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు.


టిమ్ సౌథీ పదవీ విరమణ , సోఫీ డివైన్ నిష్క్రమణ తర్వాత ఈ కొత్త సభ్యులు ఎంపిక జరిగింది. అడ్వైజరీ బోర్డుకు సౌథీ, సోఫీ అందించిన సేవలను డబ్ల్యూసీఏ ప్రశంసించింది. డబ్ల్యూసీఏ బోర్డు 2018లో ఏర్పడింది. ఐసీసీ ఈవెంట్లు, షెడ్యూలింగ్‌, కమర్షియల్‌ అంశాలపై ఆటగాళ్ల అభిప్రాయాలను ప్రతిబింబించడం ఈ బోర్డు ప్రధాన లక్ష్యం. ఇందులో 17 ప్రధాన క్రికెట్‌ దేశాల ఆటగాళ్లకు ప్రాతినిథ్యం ఉంది. కొత్త బోర్డు సభ్యుల నియామకంపై డబ్యూసీఏ బోర్డు సీఈవో మాట్లాడుతూ.. ఆటగాళ్లు క్రికెట్‌ భవిష్యత్తుపై శ్రద్ధ చూపుతున్నారని, 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ పాల్గొనడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఆటగాళ్ల హక్కులు, అవకాశాలు, క్రికెట్‌ అభివృద్ధి కోసం వారు కలసి పనిచేయాలని కోరుకుంటున్నారని అన్నారు.


ఇది ఇలా ఉంటే.. ప్రస్తుతం రషీద్‌ ఖాన్‌ ఐపీఎల్‌ 2026లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో అతను ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీశాడు. ఇటీవల ఏప్రిల్ 8న ఢిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన(4 వికెట్లు) చేసి, గతకొంతకాలంగా లేని ఫామ్‌లోకి వచ్చాడు. 2024లో వెన్ను శస్త్రచికిత్స తర్వాత రషీద్‌ ప్రభావం కాస్త తగ్గింది. ఐపీఎల్ 2024లో అతను 12 మ్యాచ్‌లలో 10 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2025లో 15 మ్యాచ్‌లలో 9 వికెట్లు సాధించాడు.

Updated Date - Apr 14 , 2026 | 02:45 PM