మోతెక్కించారు
ABN , Publish Date - Nov 22 , 2026 | 06:49 AM
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బౌలర్లు కాస్త పట్టు విడిచినా.. బ్యాటర్లు మాత్రం బేసిన్ రిజర్వ్ మైదానంలో...
రాహుల్ శతకం
గిల్ కొద్దిలో సెంచరీ మిస్
రాణించిన దేవ్‌దత్, పంత్
భారీ ఆధిక్యం దిశగా భారత్
తొలి ఇన్నింగ్స్ 486/4
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు
హామిల్టన్: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బౌలర్లు కాస్త పట్టు విడిచినా.. బ్యాటర్లు మాత్రం బేసిన్ రిజర్వ్ మైదానంలో రఫ్పాడిస్తున్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (290 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 136) తన ఫామ్‌ను కొనసాగిస్తూ శతకంతో మురిపించాడు. దీంతో 2014 తర్వాత కివీస్ గడ్డపై భారత ఆటగాడు సాధించిన మూడంకెల స్కోరిదే కావడం విశేషం. అంతేకాకుండా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (146 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 98) కూడా జోరు చూపినా, త్రుటిలో సెంచరీని కోల్పోయాడు. దేవ్‌దత్ పడిక్కళ్ (175 బంతుల్లో 10 ఫోర్లతో 80), కీపర్ రిషభ్ పంత్ (62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించి మ్యాచ్‌ను శాసించే స్థితిలో జట్టును నిలిపారు. టాప్-5 బ్యాటర్లంతా కనీసం హాఫ్ సెంచరీలైనా చేయడంతో మూడో రోజైన శనివారం ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 486 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్రీజులో పంత్‌తో పాటు అన్షుల్ కాంబోజ్ (0 బ్యాటింగ్) ఉన్నాడు. భారత్ ప్రస్తుతం 118 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చేతిలో ఆరు వికెట్లున్నాయి. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులు చేసింది.
వికెట్ కోల్పోకుండా..: 159/1 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ తొలి సెషన్‌ను దీటుగా ముగించింది. రాహుల్, దేవ్‌దత్ కివీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. శ్రీలంకలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన దేవ్‌దత్ ఇక్కడా అద్భుత ఫామ్‌ను ప్రదర్శించాడు. అటు రాహుల్ చక్కటి డిఫెన్సివ్ ఆటతో పాటు అడపాదడపా ఫోర్లు సాధిస్తూ ఆకట్టుకున్నాడు. సెషన్ చివర్లో ఫిలిప్స్ ఓవర్‌లో అతను సూపర్ ఫుట్‌వర్క్‌తో లాంగాన్‌లో జట్టుకు తొలి సిక్సర్‌ను అందించాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో వికెట్ కోల్పోకుండా ఈ జోడీ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
భారీ భాగస్వామ్యాలు: రెండో సెషన్‌లో భారత్ 27 ఓవర్లలో 105 పరుగులు చేయగలిగింది. ఆరంభంలోనే రాహుల్ సెంచరీ కాగా.. అటు కివీస్ రెండో కొత్త బంతి తీసుకుని దేవదత్ వికెట్‌ను తీయగలిగింది. వరుసగా మూడో సెంచరీ ఖాయమనిపించిన పడిక్కళ్‌ను జేమిసన్ బౌల్డ్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. అనంతరం చివరి సెషన్‌లో గిల్ జోరు పెంచాడు. డఫీ ఓవర్‌లో 6,4తో 66 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. అయితే మరో ఎండ్‌లో అత్యంత ఓపిగ్గా ఆడుతున్న రాహుల్‌ను స్మిత్ బౌల్డ్ చేయడంతో అతడి సుదీర్ఘ ఇన్నింగ్స్ ముగిసింది. అలాగే గిల్‌తో అతను మూడో వికెట్‌కు 91 పరుగులు జత చేయడం విశేషం. పంత్ ఆరంభంలో ఆచితూచి ఆడినా కుదురుకున్నాక బ్యాట్ ఝుళిపించాడు. హెన్రీ ఓవర్‌లో రెండు ఫోర్లు, డఫీ ఓవర్‌లో 6,6,4తో అదరగొట్టాడు. ఈ ధాటికి 55 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే శనివారం ఆట మరో రెండు బంతుల్లో ముగుస్తుందనగా శతకం ముంగిట గిల్‌ను డఫీ బౌల్డ్ చేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివరి సెషన్‌లో జట్టు 142 రన్స్ రాబట్టడం గమనార్హం.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 368; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్లండెల్ (బి) హెన్రీ 85, రాహుల్ (బి) స్మిత్ 136, దేవ్‌దత్ (బి) జేమిసన్ 80, గిల్ (బి) డఫీ 98, పంత్ (బ్యాటింగ్) 55, అన్షుల్ (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు: 32; మొత్తం: 125 ఓవర్లలో 486/4. వికెట్ల పతనం: 1-130, 2-295, 3-386, 4-486. బౌలింగ్: హెన్రీ 29-7-86-1, జేమిసన్ 27-6-57-1, డఫీ 29-1-180-1, నాథన్ స్మిత్ 24-4-65-1, ఫిలిప్స్ 14-0-76-0, రచిన్ 2-0-6-0.
1
భారత్ ఇన్నింగ్స్‌లో విదేశీ గడ్డపై టాప్-5 బ్యాటర్లు 50+ స్కోర్లు చేయడం ఇదే తొలిసారి.
1
‘సెనా’ దేశాల్లో 50 సిక్సర్లు బాదిన తొలి ఆసియా క్రికెటర్‌గా రిషభ్ పంత్. అలాగే విదేశాల్లో ఎక్కువ పరుగులు (2,544) చేసిన వికెట్ కీపర్‌గానూ నిలిచాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో 3 వేల పరుగులు సాధించిన కీపర్‌గానూ పంత్ రికార్డు సాధించాడు.
1
1
‘సెనా’ (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై సెంచరీలు బాదిన ఏకైక భారత ఓపెనర్‌గా కేఎల్ రాహుల్. ఓవరాల్‌గా ఐదో భారత బ్యాటర్.
వీడియోలు చూసి.. కఠిన ప్రాక్టీస్ చేసి..
న్యూజిలాండ్‌లో టెస్టు క్రికెట్ గురించి ఆరేడు నెలల నుంచే ఎదురుచూస్తున్నా. ఎందుకంటే ఇప్పటిదాకా ఇక్కడ ఆడే చాన్స్ రాలేదు. కివీస్ పిచ్‌లపై పరుగులు సాధించడం కష్టం కాబట్టి ముందుగానే వచ్చి కఠినంగా ప్రాక్టీస్ చేశా. ఇక్కడ మెరుగ్గా ఆడిన క్రికెటర్ల వీడియోలు తిలకించా. అన్ని రకాలుగా సిద్ధమయ్యా కనుకే సెంచరీ సాధించగలిగా.
కేఎల్ రాహుల్