Share News

చెన్నైపై ‘పంజా’

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:04 AM

సొంత మైదానంలోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తేలిపోయింది. భారీ స్కోరు సాధించినప్పటికీ బౌలింగ్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది.

చెన్నైపై ‘పంజా’

  • కింగ్స్‌ ఖాతాలో రెండో విజయం జూఅదరగొట్టిన శేయాస్‌, ప్రియాన్ష్‌

  • చెపాక్‌లోనూ ఓడిన సీఎస్‌కే జూఆయుష్‌ పోరాటం వృథా

చెన్నై: సొంత మైదానంలోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తేలిపోయింది. భారీ స్కోరు సాధించినప్పటికీ బౌలింగ్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. అటు పంజాబ్‌ టాపార్డర్‌ కలిసికట్టుగా రాణించడంతో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా, శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. చెపాక్‌లో ఈ జట్టుకిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. అలాగే ఈ సీజన్‌లో సీఎస్‌కేకిది వరుసగా రెండో ఓటమి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఆయుష్‌ మాత్రే (43 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 73), శివమ్‌ దూబే (27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 నాటౌట్‌), సర్ఫరాజ్‌ (12 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 32) వేగంగా ఆడారు. వైశాక్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో పంజాబ్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగులు చేసి గెలిచింది. ప్రభ్‌సిమ్రన్‌ (34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 43), ప్రియాన్ష్‌ ఆర్య (11 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 39), కూపర్‌ (22 బంతుల్లో 6 ఫోర్లతో 36) రాణించారు. అన్షుల్‌, హెన్రీలకు రెండేసి వికెట్లు లభించాయి. వేగంగా ఆడిన ప్రియాన్ష్‌ ఆర్య ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.


సమష్ఠిగా రాణించి..: భారీ ఛేదనలో పంజాబ్‌ టాపార్డర్‌ అదరగొట్టింది. వీరి ఆటతీరుతో జట్టు ఆది నుంచే విజయం దిశగా సాగింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌, ప్రియాన్ష్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ముఖ్యంగా తొలి రెండు బంతులనే 4,6గా మలిచిన ప్రియాన్ష్‌ రెండో ఓవర్‌లో 4,6,4తో మరింత జోరు చూపాడు. అటు ప్రభ్‌ నాలుగో ఓవర్‌లో మూడు ఫోర్లు బాదడంతో స్కోరు 55కి చేరింది. ఈ స్థితిలో ప్రియాన్ష్‌ను పేసర్‌ హెన్రీ బౌల్డ్‌ చేయడంతో తొలి వికెట్‌కు 26 బంతుల్లోనే 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం కూపర్‌తో కలిసి రెండో వికెట్‌కు 34 పరుగులు జోడించిన ప్రభ్‌ సమన్వయలోపంతో రనౌటయ్యాడు. ఈ స్థితిలో కెప్టెన్‌ శ్రేయాస్‌ ధాటిగా ఆడడంతో చెన్నైకి ఆశల్లేకుండా పోయాయి. కూపర్‌ వెనుదిరిగినా.. శ్రేయాస్‌ ఎదురుదాడి ఆపలేదు. స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లతో పరుగులు రాబట్టాడు. పేసర్‌ హెన్రీని కూడా వదలకుండా 15వ ఓవర్‌లో 4,6తో 15 రన్స్‌ అందించాడు. 26 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసిన శ్రేయాస్‌ అదే స్కోరుపై వెనుదిరిగాడు. అప్పటికి 18 బంతుల్లో 24 రన్స్‌ అవసరమే కాగా.. చెన్నై బౌలర్లు చేసేదేమీ లేకపోయింది. శశాంక్‌ (14 నాటౌట్‌), స్టొయినిస్‌ (9 నాటౌట్‌) 8 బంతులుండగానే జట్టును గెలిపించారు.


ఆయుష్‌ అదుర్స్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శుభారంభం దక్కలేదు. అయితే యువ బ్యాటర్లు ఆయుష్‌ మాత్రే, సర్ఫరాజ్‌లతో పాటు చివర్లో శివమ్‌ దూబే ఫినిషింగ్‌తో స్కోరు 200 దాటింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (7) వైఫల్యం చెపాక్‌లోనూ కొనసాగింది. పేసర్‌ బార్ట్‌లెట్‌ అతడిని రెండో ఓవర్‌లోనే అవుట్‌ చేశాడు. మరో ఓపెనర్‌ రుతురాజ్‌ 12వ ఓవర్‌ వరకు క్రీజులో ఉన్నా మెరుపులు కరువయ్యాయి. కానీ వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఆయుష్‌ మాత్రే అంతా తానై ఎదురుదాడికి దిగాడు. నాలుగో ఓవర్‌లో మాత్రే హ్యాట్రిక్‌ ఫోర్లతో స్కోరుబోర్డులో వేగం పెరిగింది. వైశాక్‌ ఓవర్‌లోనూ అతను సిక్సర్‌ బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 57/1 స్కోరుతో ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత కూడా యాన్సెన్‌, స్టొయినిస్‌ ఓవర్లలో రెండేసి సిక్సర్లు బాదడంతో మాత్రే 29 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అటు రుతురాజ్‌ను స్పిన్నర్‌ చాహల్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇందులో మాత్రేవే 67 పరుగులు ఉండడం విశేషం. ఆ వెంటనే వైశాక్‌ ఓవర్‌లో మాత్రే అవుట్‌ కావడంతో చెన్నై ఆట నెమ్మదించింది. కార్తీక్‌ (1) ఎల్బీగా వెనుదిరగగా, వరుసగా మూడు ఓవర్లలో జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఆరంభంలో దూబే కూడా షాట్లు ఆడడంలో ఇబ్బందిపడ్డాడు. కానీ సర్ఫరాజ్‌ మాత్రం 12 బంతులే ఎదుర్కొన్నా దడదడలాడించాడు. అర్ష్‌దీప్‌ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో పాటు బార్ట్‌లెట్‌ ఓవర్‌లో సిక్సర్‌ బాదాడు. అలాగే 17వ ఓవర్‌లో మరోసారి హ్యాట్రిక్‌ ఫోర్లతో చెపాక్‌లో జోష్‌ తెచ్చాడు. కానీ అదే ఓవర్‌లో వైశాక్‌కు సర్ఫరాజ్‌ చిక్కడంతో 38 పరుగుల మెరుపు భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత పుంజుకున్న దూబే చివరి రెండు ఓవర్లలో 26 పరుగులు అందించి జట్టు భారీస్కోరుకు దోహదపడ్డాడు.

Updated Date - Apr 04 , 2026 | 04:04 AM