నిఖిల్ ఆల్‌రౌండ్ షో
ABN , Publish Date - Nov 22 , 2026 | 06:41 AM
భారత సంతతి ఆటగాడు నిఖిల్ చౌధురి (2 వికెట్లు, 66 పరుగులు) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో ఉత్కంఠగా సాగిన...
తొలి టీ20లో ఇంగ్లండ్‌పై ఆసీస్ గెలుపు
మెల్‌బోర్న్: భారత సంతతి ఆటగాడు నిఖిల్ చౌధురి (2 వికెట్లు, 66 పరుగులు) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 3 వికెట్లతో ఇంగ్లండ్‌ను ఓడించింది. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (65) టాప్ స్కోరర్. నిఖిల్ (2/21)కు తోడు ఎడ్వర్డ్స్ (2/27) రెండు వికెట్లు తీశాడు. ఛేదనలో అరంగేట్రం ఆటగాడు నిఖిల్ అర్ధ సెంచరీకి తోడు సారథి, ఓపెనర్ మిచెల్ మార్ష్ (37), హార్పర్ (32) చెలరేగడంతో ఆసీస్ 19.5 ఓవర్లలో 191/7 స్కోరు చేసి గెలిచింది.
ఎవరీ నిఖిల్..?
ఢిల్లీలో జన్మించిన నిఖిల్ 2017-19 మధ్య పంజాబ్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే టోర్నీల్లో ఆడాడు. గిల్, అభిషేక్ శర్మలతో కలిసి దేశవాళీ క్రికెట్ ఆడిన నిఖిల్.. టూరిస్ట్ వీసా కింద ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లాడు. అప్పుడు కోవిడ్ నిబంధనల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో బతుకుదెరువు కోసం ఓవైపు రెస్టారెంట్‌లో పనిచేస్తూనే క్రికెట్ కెరీర్‌ను కొనసాగించాడు. అనంతరం తనదైన ప్రతిభతో ఆసీస్ జాతీయ జట్టుకు ఎంపికైన అతడు.. ఇప్పుడు తానాడిన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లోనే సూపర్ షోతో అలరించాడు.