ఐపీఎల్ 2026: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు బిగ్ షాక్
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:27 AM
టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం షాకింగ్ న్యూస్ చెప్పింది. గాయం కారణంగా ధోని రెండు వారాల పాటు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని(MS Dhoni) అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం షాకింగ్ న్యూస్ చెప్పింది. సీఎస్కే జట్టు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించింన ధోని ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా సీఎస్కే వెల్లడించింది. ధోనీ ప్రస్తుతం పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడని తెలిపింది.
'పిక్క గాయం కారణంగా ధోని ప్రస్తుతం ప్రస్తుతం రీహాలిటేషన్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్నాడు. రెండు వారాల పాటు టాటా ఐపీఎల్ 19వ సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. త్వరగా కోలుకోండి తలా’ అని ఆకాంక్షిస్తూ ఎక్స్ వేదికగా సీఎస్కే( CSK news) ట్వీట్ చేసింది. ధోని దూరం కావడంతో ఈ సీజన్ ఆరంభంలోనే చెన్నై జట్టు పెద్ద పరీక్షను ఎదుర్కొనాల్సి వస్తోంది. జట్టు యాజమాన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటనతో ఈ వార్త ఒక్కసారిగా క్రికెట్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మార్చి30 ( సోమవారం) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో సీఎస్‌కే ఈ సీజన్‌ను ప్రారంభించనుంది. ధోని ఆడకపోయినప్పటికీ సీఎస్కేకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయాపడుతున్నారు. గత రెండు, మూడు సీజన్లుగా ధోని జట్టులో మెంటర్ పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. బ్యాటింగ్‌లో ఎక్కువగా లోయర్ ఆర్డర్‌లోనే వస్తున్న ధోని ఫీల్డింగ్‌లో మాత్రం తన మాస్టర్‌మైండ్‌కు పని చెబుతున్నాడు.
ధోనీ లేని ఈ రెండు వారాల సమయంలో భారత ఓపెనర్ సంజు శాంసన్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. గత డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ 2026 వేలానికి ముందు సీఎస్కే.. రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చి.. రూ. 18 కోట్లకు శాంసన్‌ను కొనుగోలు చేసుకుంది. 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి ధోని కేవలం ఐపీఎల్‌లోనే ఆడుతున్నాడు. గత సీజన్‌లో ధోని సీఎస్కే తరఫున మొత్తం 14 మ్యాచ్‌లలో ఆడి, 135.17 స్ట్రైక్ రేట్‌తో 24.50 సగటుతో 196 పరుగులు సాధించాడు.
ఇవి కూడా చదవండి: