అందరివాడు ఆట ఆపేశాడు
ABN , Publish Date - Sep 01 , 2026 | 05:13 AM
అర్జెంటీనా ఫుట్‌బాల్ గ్రేట్ లియోనెల్ మెస్సీ (39) అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాలపాటు అర్జెంటీనాకు ప్రాతినిథ్యం వహించిన మెస్సీ.. జాతీయ జట్టుకు రిటైర్మెంట్...
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై
ఫుట్‌బాల్‌తో పెద్దగా పరిచయం లేని వాళ్లు కూడా కాసేపు తన ఆట చూస్తే ఆ ఆటలో మజా ఏంటో అర్ధమై ఆస్వాదించేలా చేయగల ఆకర్షణ కలిగినవాడు..
మైదానంలో పాదరసంలా కదలాడుతూ, అద్భుతమైన డ్రిబ్లింగ్ నైపుణ్యంతో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించినవాడు..
కళ్లు చెదిరే ఫీల్డ్ గోల్స్‌తో ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిన ఘనుడు.. తన మంత్రముగ్ధమైన ఆటతో యావత్ క్రీడాలోకాన్ని ఉర్రూతలూగించినవాడు.. మాటల్లో సౌమ్యుడు, చేతల్లో ఘనాపాఠిగా ఉంటూ అభిమానులకు అపరిమితమైన ఆనందాన్ని పంచిన అందరివాడు..
ఆటనే ప్రేమించి.. ఆటనే శ్వాసించి.. ఆటనే శాసించిన లియోనెల్ మెస్సీ.. ఇక చాలని సెలవు తీసుకొన్నాడు.
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ గ్రేట్ లియోనెల్ మెస్సీ (39) అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాలపాటు అర్జెంటీనాకు ప్రాతినిథ్యం వహించిన మెస్సీ.. జాతీయ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు సోమవారం స్పానిష్ భాషలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. రికార్డు స్థాయిలో దేశం తరఫున ఆరు వరల్డ్‌క్‌పలు ఆడాడు. 2016లో కోపా కప్ ఫైనల్లో ఓటమి తర్వాత విమర్శలకు తట్టుకోలేక తొలిసారి రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ.. అభిమానుల విజ్ఞప్తితో పునరాగమనం తర్వాత అంతా స్వర్ణయుగమే. మెస్సీ సారథ్యంలో 2022లో కతార్‌లో జరిగిన సాకర్ ప్రపంచక్‌పలో అర్జెంటీనాను విజేతగా నిలవగా.. 2026 మెగా టోర్నీ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓడింది. అయితే, తుది పోరులో ఓడిన రెండు రోజుల తర్వాత తన రిటైర్మెంట్ లేఖను రాసినట్టు మెస్సీ తెలిపాడు. కానీ, తన తండ్రి జార్జ్ మెస్సీ అనారోగ్యం, ఆయన మృతి కారణంగా బహిర్గతపర్చడానికి సమయం తీసుకొన్నట్టు తెలిపాడు. కాగా, క్లబ్ సాకర్‌లో లియోనెల్ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు ఇంటర్ మయామి కెప్టెన్‌గా ఉన్నాడు. మరో రెండేళ్లపాటు ఆ క్లబ్‌తో అతడికి అగ్రిమెంట్ ఉంది.

సర్వం ధారపోశా..
లియోనెల్ భావోద్వేగ లేఖ
‘ఫైనల్ ముగిసిన ఇన్ని రోజుల తర్వాత, ఎంతో ఆలోచించిన తర్వాత, జాతీయ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించాలనే నా నిర్ణయాన్ని మీకందరికి తెలియజేస్తున్నా. ఇది ఎంతో బాధ కలిగించే నిర్ణయమే అయినా.. అందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. అర్జెంటీనా జెర్సీ కోసం సర్వస్వం ధారపోశా. జట్టుతో కలసి దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించా. అర్జెంటీనా ప్రజలను గర్వపడేలా చేయడం ఎప్పుడూ ఆనందమే. ఇక, సమయం తరిగి పోతుంది. కొన్ని అధ్యాయాలు ముగిసిపోనున్నాయి. దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు ఎంతో ఇష్టం. నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశా. ఇక నా వద్ద ఏమీ మిగల్లేదు. ఎంతో మంది ప్రతిభగల యువ ఆటగాళ్లు దూసుకొస్తున్నారు. వారికి ఇదే తగిన సమయం. 20 ఏళ్లుగా అందించిన ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. ఇకపై జాతీయ జట్టుకు బయట నుంచి అభిమానించే వ్యక్తిగా ఉంటా. కుటుంబం, కోచ్, సహచరులు, జట్టు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. చిరస్మరణీయ జ్ఞాపకాలను నాతో తీసుకెళ్తున్నా. నా సహచరులతో కలసి ఒకప్పుడు కలలు కన్న క్షణాలను.. మీకు అందించామనే సంతృప్తితో సగర్వంగా నిష్క్రమిస్తున్నా. అర్జెంటీనావాడిగా నన్ను పుట్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు. లెట్స్ గో అర్జెంటీనా..’
లియోనెల్ మెస్సీ