Share News

అజింక్య రహానేకు దెబ్బ మీద దెబ్బ.. ఓటమే అనుకుంటే... మరో షాక్

ABN , Publish Date - Apr 15 , 2026 | 11:36 AM

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 32 పరుగుల తేడాతో కేకేఆర్‌ ఓడిన విషయం తెలిసిందే. ఈ బాధ నుంచి తేరుకోకముందే ఆ జట్టుకు మరో షాక్‌ తగిలింది.

అజింక్య రహానేకు దెబ్బ మీద దెబ్బ.. ఓటమే అనుకుంటే... మరో షాక్
Ajinkya Rahane fine

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న(మంగళవారం) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్‌ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు ఓడింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. చెన్నై చేతిలో ఓటమితో విమర్శలు ఎదుర్కొంటున్న కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేకు మరో బిగ్ షాక్ తగిలింది.


అజింక్య రహానేపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. చెన్నై మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా అతడికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్‌లో తొలి తప్పిదం కావడంతో కేవలం​ జరిమానాతోనే బీసీసీఐ సరిపెట్టింది. ఐపీఎల్ 2026లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానా ఎదుర్కొన్న నాలుగో కెప్టెన్‌ రహానే నిలిచాడు. ఆర్టికల్ 2.22 ప్రకారం రహానే చేసి తొలి తప్పిదం కావడంతో బీసీసీఐ రూ.12 లక్షలు జరిమానా విధించిందని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.


కేకేఆర్ విషయానికి వస్తే.. ఈ సీజన్ లో ఆ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. సీజన్‌ ప్రారంభానికి ముందే కీలక బౌలర్లంతా దూరం కాగా.. భారీ అంచనాలు పెట్టుకున్న గ్రీన్‌ అట్టర్ ప్లాప్ అయ్యాడు. కెప్టెన్‌ రహానే సహా మిగతా స్టార్ ప్లేయర్లు నామమాత్రపు ప్రదర్శన చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కేకేఆర్‌ ఈ సీజన్‌ను గెలుపు లేకుండా ముగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్‌ 17న అహ్మదాబాద్‌ వేదికగా జరుగనుంది.

Updated Date - Apr 15 , 2026 | 11:36 AM