Khawaja Announces Retirement: ఖవాజా వీడ్కోలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:25 AM
ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్టు వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం ఇక్కడ ప్రారంభమయ్యే యాషెస్ ఐదో టెస్ట్ తన కెరీర్‌లో చివరిదని శుక్రవారం ప్రకటించాడు...
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టే ఆఖరిది
కెరీర్‌లో ఎన్నో చేదు ఘటనలు జూఉస్మాన్ వెల్లడి
సిడ్నీ: ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్టు వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం ఇక్కడ ప్రారంభమయ్యే యాషెస్ ఐదో టెస్ట్ తన కెరీర్‌లో చివరిదని శుక్రవారం ప్రకటించాడు. పాకిస్థాన్‌లో జన్మించిన ఖవాజా ఆస్ట్రేలియా తరపున ఆడిన తొలి ముస్లిమ్ క్రికెటర్. తను ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోనే 39 ఏళ్ల ఉస్మాన్ చివరి మ్యాచ్ ఆడుతుండడం గమనార్హం. 2018లో ఇదే మైదానంలో యాషె్‌సలో అతడు మొదటి శతకం సాధించాడు. అంతేకాదు..ఇదే గ్రౌండ్‌లో 35వ ఏట కెరీర్‌ను పునర్‌నిర్మించుకున్న ఖవాజా ఇంగ్లండ్‌పై రెండు సెంచరీలు చేయడం విశేషం. అనంతరం మరో రెండేళ్లకు ఇంకో ఏడు శతకాలు బాది లేటు వయస్సులో పునరాగమనం చేసి అద్భుతంగా ఆడిన క్రికెటర్‌గా పేరు తెచ్చుకొన్నాడు. ఇక..వెన్ను నొప్పి కారణంగా ఈ యాషెస్ సిరీస్‌లోని తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. స్టీవెన్ స్మిత్ హఠాత్తుగా అనారోగ్యం పాలవడంతో మూడో టెస్టులో ఉస్మాన్‌కు చోటు లభించింది. ఆ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 82, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేశాడు. ఆ తర్వాత నాలుగో టెస్టులో (29,0) విఫలమయ్యాడు. కాగా ఆఖరిదైన ఐదో టెస్టులోనూ ఆడనున్నాడు.
ఆస్ట్రేలియాలో మితిమీరిన జాత్యహంకారం
ఆస్ట్రేలియా క్రికెట్‌లో జాత్యహంకారం దారుణంగా ఉందని ఖవాజా కుండబద్దలు కొట్టాడు. ఆటతీరుపై కాకుండా తన మతం నేపథ్యంగా మీడియా, మాజీ క్రికెటర్లు తనపై విమర్శలు గుప్పించడాన్ని గర్హించాడు. యాషెస్ సిరీస్ పెర్త్ టెస్ట్‌లో తన వైఫల్యాన్ని ఆ కోణంలోనే చూశారని మండిపడ్డాడు. ‘ఆ టెస్ట్‌కు సన్నద్ధం కాకుండా నేను గోల్ఫ్ ఆటకే ప్రాధాన్యమిచ్చానని నిందించారు. గోల్ఫ్ ఆడి గాయపడ్డాడని విమర్శించారు’ అని ఖవాజా వాపోయాడు. 2017లో సిడ్నీ టెస్ట్ సందర్భంగా తనకు ఎదురైన మరో చేదు అనుభవాన్ని కూడా ఉస్మాన్ గుర్తు చేసుకున్నాడు. మైదానం వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు తనకు పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్ చూపించాడని వెల్లడించాడు. ఇలాంటి ఘటనలు ఎన్నింటినో తన కెరీర్‌లో ఎదుర్కొన్నానని ఖవాజా తెలిపాడు.