Share News

ఐపీఎల్ మ్యాచులకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:13 PM

ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు కీలక అప్‌డేట్స్ వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

ఐపీఎల్ మ్యాచులకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
IPL 2026

స్పోర్డ్స్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు కీలక అప్ డేట్స్ వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఐపీఎల్ మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించుకునేందుకు కర్ణాటక సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రత, సంసిద్ధత చర్యలపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఇవాళ( సోమవారం) విధాన సౌధలో హోం మంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bengaluru) హోం మ్యాచ్‌లకు చిన్నస్వామి స్టేడియం వేదిక ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మైదానంలో ఆర్సీబీ ఐదు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే బెంగళూరుకు రెండో హోమ్ గ్రౌండ్‌ అయిన రాయ్‌పుర్‌లోని షహీద్‌ వీర్ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో మరో రెండు లీగ్‌ మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్‌లో ఒక ప్లేఆఫ్‌ మ్యాచ్‌ బెంగళూరులో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ కున్హా అధ్యక్షతన కమిటీ వేశారు. ఆ నివేదిక సిఫార్సులను అనుసరించి, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ 2026లో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు క్రౌడ్ మేనేజ్‌మెంట్, భద్రత చర్యలను ప్రవేశపెట్టిందని కార్యదర్శి సంతోష్ మీనన్ తెలిపారు.


ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా 35,000 మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. అలాగే చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి మ్యాచ్‌కు 3, 4 గంటల ముందే స్టేడియం గేట్లను తెరవనున్నారు. మహిళలు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేయనున్నారు. బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ భాగస్వామ్యంతో.. టికెట్‌ కలిగి ఉన్న ప్రేక్షకులకు మెట్రోలో ఉచితంగా ప్రయాణం చేసేందుకు కర్నాటక ప్రభుత్వం అనుమతించింది.

Updated Date - Mar 16 , 2026 | 04:13 PM