Share News

వైభవంగా కప్పు కొట్టారు

ABN , Publish Date - Feb 07 , 2026 | 03:37 AM

అండర్‌-19 వన్డే వరల్డ్‌కప్‌ను భారత కుర్రాళ్లు అజేయంగా ముగించారు. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆయుష్‌ మాత్రే సేన 100 రన్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది.

వైభవంగా కప్పు కొట్టారు

  • ఫైనల్లో ఇంగ్లండ్‌ చిత్తు

  • అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌

  • వామ్మో వైభవ్‌.. వయస్సు 14 ఏళ్లే అయినా అతడి బ్యాట్‌ సాగించిన వీరంగానికి ఇంగ్లండ్‌ బౌలర్లది దిక్కుతోచని పరిస్థితి. 15 ఫోర్లు, 15 సిక్సర్లతో ఏకంగా 175 పరుగులు రాబట్టిన సూర్యవంశీ బాదుడుకు రికార్డులు బద్దలయ్యాయి. అటు 412 పరుగుల భారీ ఛేదనను ఇంగ్లండ్‌ దీటుగానే ఆరంభించింది. కానీ భారత బౌలర్లు వికెట్ల వేట ఆపలేదు. దీంతో రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్‌-19 వన్డే వరల్డ్‌కప్‌ భారత్‌ వశమైంది. 2022లోనూ భారత జట్టు ఇంగ్లండ్‌ను ఓడించే కప్పు కైవసం చేసుకుంది.

హరారే: అండర్‌-19 వన్డే వరల్డ్‌కప్‌ను భారత కుర్రాళ్లు అజేయంగా ముగించారు. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆయుష్‌ మాత్రే సేన 100 రన్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ ఖాతాలో ఇది ఆరో టైటిల్‌ కావడం విశేషం. గతంలో 2000, 2008, 2012, 2018, 2022లలో కప్‌ చాంపియన్‌గా నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ 50 ఓవర్లలో 411/9 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (53), అభిగ్యాన్‌ (40), కనిష్క్‌ (37 నాటౌట్‌), వేదాంత్‌ (32), విహాన్‌ (30) సహకరించారు. మింటోకు మూడు.. గ్రీన్‌, మోర్గాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారీ ఛేదనలో ఇంగ్లండ్‌ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. వేగంగా ఆడే క్రమంలో జట్టు వికెట్లను కోల్పోవడం దెబ్బతీసింది. అయితే మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఫాల్కనర్‌ (67 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 115) వీరోచిత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌ డాకిన్స్‌ (66), మయేస్‌ (45), థామస్‌ రూ (31) ఫర్వాలేదనిపించారు. అంబరీ్‌షకు మూడు.. కనిష్క్‌, దీపేశ్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌గా వైభవ్‌ నిలిచారు.


వీరవిహారం: మొదటి 25 ఓవర్లలోనే భారత్‌ స్కోరు 250/2.. కానీ ఆ తర్వాత 25 ఓవర్లలో 161/7 మాత్రమే. ఓపెనర్‌ వైభవ్‌ సునామీ ఇన్నింగ్స్‌ ఎలా సాగిందో ఈ స్కోరు కార్డు చూస్తేనే అర్థమవుతుంది. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడినా.. అతడు క్రీజులో ఉన్నంతవరకు హరారే స్టేడియం భారీ షాట్లతో దద్దరిల్లింది. మరో ఓపెనర్‌ ఆరోన్‌ (9) త్వరగానే అవుటైనా కెప్టెన్‌ ఆయుష్‌ జత కలవడంతో ఇంగ్లండ్‌ బౌలర్లు బేలగా మారారు. వీరు రెండో వికెట్‌కు 90 బంతుల్లోనే 142 పరుగులు జత చేసి ప్రత్యర్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. 32 బంతుల్లో ఫిఫ్టీ, 55 బంతుల్లో సెంచరీ బాదిన వైభవ్‌ ఆ తర్వాత మరింతగా చెలరేగాడు. 22వ ఓవర్‌లో 4,6,6,4,4తో 27 రన్స్‌ సాధించాడు. ఈ దూకుడుకు సెంచరీ తర్వాత మరో 16 బంతుల్లోనే 150కి చేరాడు. తద్వారా అండర్‌-19లో ఫాస్టెస్ట్‌ (71 బంతులు) 150 సాధించిన బ్యాటర్‌ అయ్యాడు. 25వ ఓవర్‌లోనూ 4,6,6,4తో చెలరేగగా స్కోరు 250/2కి చేరింది. ఈ దశలో వైభవ్‌ డబుల్‌ సెంచరీతో పాటు భారత్‌కు 500 రన్స్‌ కూడా సాధ్యమే అనిపించింది. కానీ తర్వాతి ఓవర్‌లోనే పేసర్‌ లమ్స్‌డెన్‌..వైభవ్‌ వికెట్‌ తీయడంతో మూడో వికెట్‌కు వేదాంత్‌తో 89 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఆ తర్వాత జట్టు ఆటతీరు నెమ్మదించింది. చివర్లో కనిష్క్‌, అభిగ్యాన్‌, విహాన్‌ మోస్తరుగా ఆడడంతో స్కోరు 400 దాటింది.

  • అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో అత్యధిక స్కోరు (175) చేసిన బ్యాటర్‌గా వైభవ్‌. అలాగే ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు (15) సంధించడమే కాకుండా మొత్తంగానూ 30 సిక్సర్లతో టాప్‌లో ఉన్నాడు. అలాగే యూత్‌ వన్డేల్లో బౌండరీలతోనే 150 రన్స్‌ సాధించిన ఏకైక ఆటగాడు. ఈ టోర్నీ చరిత్రలోనే సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడి (14 ఏళ్లు)గానూ నిలిచాడు.

  • అండర్‌-19 వరల్డ్‌కప్‌ ప్లేఆఫ్స్‌లో అత్యధిక స్కోరు (411/9) సాధించిన జట్టుగా భారత్‌.

  • ఈ టోర్నీ చరిత్రలో ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డులందుకున్న ఏకైక బ్యాటర్‌గా వైభవ్‌.

  • యూత్‌ వన్డే మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు (722), ఎక్కువ సిక్సర్లు (31) నమోదు కావడం ఇదే తొలిసారి.

2

  • అండర్‌-19 వరల్డ్‌క్‌పలో రెండో వేగవంతమైన సెంచరీ (55 బంతుల్లో) సాధించిన వైభవ్‌. తాజా టోర్నీలో విల్‌ (ఆసీస్‌, 51 బంతుల్లో) ఫాస్టెస్ట్‌ శతకం బాదాడు. మొత్తంగా ఫైనల్లో సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌. ఉన్ముక్త్‌, మన్‌జోత్‌ గతంలో సాధించారు.

Updated Date - Feb 07 , 2026 | 03:37 AM