Share News

ఆసియాడ్‌లో తొలిసారి..

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:19 AM

టోర్నమెంట్‌ ఏదైనా.. వేదిక ఎక్కడైనా భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య మ్యాచ్‌ అంటే ప్రపంచ క్రికెట్‌ ప్రేమికులకుండే క్రేజ్‌ వేరు. తాజాగా ఆసియా గేమ్స్‌లో తొలిసారి ఈ జట్లు తలపడనున్నాయి.

ఆసియాడ్‌లో తొలిసారి..

నిస్సిన్‌: టోర్నమెంట్‌ ఏదైనా.. వేదిక ఎక్కడైనా భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య మ్యాచ్‌ అంటే ప్రపంచ క్రికెట్‌ ప్రేమికులకుండే క్రేజ్‌ వేరు. తాజాగా ఆసియా గేమ్స్‌లో తొలిసారి ఈ జట్లు తలపడనున్నాయి. శనివారం ఇరుజట్ల మధ్య స్వర్ణం కోసం పోరు జరుగనుంది. ఓడిన జట్టుకు రజతం దక్కుతుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న శ్రేయాస్‌ సేన వరుసగా రెండో గోల్డ్‌ మెడల్‌ అందుకోవాలనుకుంటోంది. అటు ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగుతున్న పాకిస్థాన్‌ చివరిగా 2010లో కాంస్యం నెగ్గింది. ఇక ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్‌పై అందరి దృష్టి పడనుంది. పాక్‌తో తను తొలిసారి ఆడబోతున్నాడు. అటు పాక్‌ జట్టులో బ్యాటింగ్‌లో అనుభవలేమి కనిపిస్తోంది. భారత్‌పై ఈ జట్టు చివరిసారి 2022లో టీ20 మ్యాచ్‌ గెలిచింది.

ఫైనల్‌కు నఖ్వీ దూరం

భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య స్వర్ణ పతక పోరుకు ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ) అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ హాజరుకావడం లేదు. ఆసియాకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్లు ఆయన చేతుల మీదుగా ట్రోఫీలు తీసుకునేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగానే ఆయన గైర్హాజరు అవుతున్నట్టు ఏసీసీ పేర్కొంది.

Updated Date - Oct 03 , 2026 | 01:21 AM