Share News

సంజూ దూకుడు.. భారీ స్కోరు సాధించిన భారత్!

ABN , Publish Date - Mar 05 , 2026 | 09:18 PM

భారత్ భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్‌కు ఏకంగా 254 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

సంజూ దూకుడు..  భారీ స్కోరు సాధించిన భారత్!
Ind Vs Eng T20 Semi Finals; Eng Target 254

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో నేడు తలపడుతున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ (89), ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43) రాణించడంతో స్కోరు ఏకంగా 253 పరుగులకు చేరింది. కెప్టెన్ సూర్య కుమార్ (11), అభిషేక్ శర్మ (9) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా ఇతర ప్లేయర్లు అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరును అందించారు. ఇంగ్లండ్‌కు భారీ టార్గెట్‌ను నిర్దేశించారు.

ఇంగ్లండ్ టాస్ గెలవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన సంజూ, అభిషేక్ తొలి నుంచి దూకుడుగా ఆడటం ప్రారంభించారు. ముఖ్యంగా సంజూ క్రమం తప్పకుండా బౌండరీలు రాబడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి 97 పరుగుల పటిష్ట భాగస్వామ్యాన్ని అందించాడు ఆ తరువాత ఇషాన్ తొమ్మిదవ ఓవర్‌లోనే వెనుదిరిగా సంజూ జట్టుకు అండగా కొనసాగాడు. పరుగుల వరద పారిస్తూ 26 పరుగులకే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చురుగ్గా ఆడుతూ సెంచరీకి చేరువవుతున్న సమయంలో సంజూ ఔటవడం అభిమానులను నిరాశపరిచింది.


14వ ఓవర్‌లో విల్ జాక్స్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి (42 బంతుల్లో 89 పరుగులు; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) సంజూ వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) చివరి ఓవర్లలో పరుగులను రాబట్టి భారీ స్కోరును సాధించారు. దీంతో, భారత్ 20 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్, అదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు, జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ తీశారు. హార్దిక్, శివమ్ రన్ ఔట్ అయ్యారు.

Updated Date - Mar 05 , 2026 | 09:29 PM