చావో రేవో!
ABN , Publish Date - Jun 28 , 2026 | 02:43 AM
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా పురోగమిస్తుందా.. ఇంటిబాట పడుతుందా..తేలేందుకు మరికొద్ది గంటల సమయమే మిగిలింది.
కంగారూలతో హర్మన్‌సేన పోరు నేడు
లండన్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా పురోగమిస్తుందా.. ఇంటిబాట పడుతుందా..తేలేందుకు మరికొద్ది గంటల సమయమే మిగిలింది. గ్రూప్ ‘ఎ’ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అత్యంత బలీయమైన ఆస్ట్రేలియాను హర్మన్‌ప్రీత్ సేన ఆదివారం ఢీకొననుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే మనోళ్లు సెమీఫైనల్లో అడుగుపెడతారు. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ఇదే గ్రూపులో ఆదివారం జరిగే మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (6 పాయింట్లు), బంగ్లాదేశ్ (4 పాయింట్లు)తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల ద్వారా గ్రూప్ ‘ఎ’ సెమీస్ జట్లు ఖరారు కానున్నాయి. భారత్ (6) రెండో స్థానంలో ఉండగా..ఆస్ట్రేలియా (8) గ్రూప్ టాపర్‌గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో పోరు భారత్‌కు క్వార్టర్స్ లాంటిదే. ఈరోజు తొలుత జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా..బంగ్లాపై గెలిస్తే, అప్పుడు ఆస్ట్రేలియాను ఓడించడం తప్ప మనోళ్లకు మరో మార్గం లేదు. మరోవైపు టీమిండియా చేతిలో ఓడినా..పాయింట్లు, నెట్ రన్‌రేట్ (4.74) ఆధారంగా ఆసీస్ ముందుకెళ్తుంది. బంగ్లా కనుక దక్షిణాఫ్రికాకు షాకిస్తే.. టీమిండియాపై ఒత్తిడి తగ్గుతుంది. అప్పుడు ఆసీస్ చేతిలో ఓడినా..భారత్ నెట్ రన్‌రేట్ (2.268), దక్షిణాఫ్రికా ప్రస్తుత రన్‌రేట్ (0.734) కంటే మెరుగ్గా ఉండడంవల్ల హర్మన్‌సేన సెమీ్‌స చేరుతుంది. ఇక..దూకుడుమీదున్న ఆసీస్‌ను అడ్డుకోవాలంటే.. బ్యాటింగ్ విభాగం సమష్టిగా సత్తా చాటాలి. ఫీల్డింగ్ మెరుగుపడాలి. స్పిన్‌త్రయం శ్రీచరణి, రాధా యాదవ్, దీప్తీశర్మతోపాటు పేస్ బౌలింగ్ విభాగం వంద శాతానికి మించి ప్రదర్శన చేయాలి.
ఐర్లాండ్ చరిత్ర: ఐర్లాండ్ పురుషుల జట్టు భారత్‌పై తొలి టీ20లో విజయంతో చరిత్ర సృష్టిస్తే..ఆ దేశ మహిళల టీమ్ పొట్టి ప్రపంచ కప్‌లో చరిత్ర లిఖించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 6 వికెట్లతో వెస్టిండీస్‌ను చిత్తుచేసింది. తద్వారా ఈ మెగా టోర్నీలో ఐర్లాండ్ తొలి గెలుపు రుచి చూసింది. తొలుత విండీస్ 20 ఓవర్లలో 128/7 స్కోరుకే పరిమితమైంది. స్వల్ప ఛేదనను ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 129/4 స్కోరుతో ముగించింది. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్ శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 37 పరుగులతో నెదర్లాండ్స్‌పై నెగ్గింది.