పతక పంట
ABN , Publish Date - Jul 29 , 2026 | 04:57 AM
కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. తెలుగు కుర్రాడు వల్లూరి అజయ్‌బాబు వెయిట్ లిఫ్టింగ్‌లో రజత కాంతులీనగా.. హైజంప్‌లో సర్వేశ్ కుషారే...
నేటి భారత షెడ్యూల్
వెయిట్ లిఫ్టింగ్: సంజన (మ. 2).
అథ్లెటిక్స్: లాంగ్ జంప్ ఫైనల్-మురళీ శ్రీశంకర్, లోకేశ్ (రా. 11.54); మహిళల షాట్ పుట్-మన్‌ప్రీత్ కౌర్ (రా. 12.31); పారా పురుషుల డిస్కస్ త్రో- దేవేందర్ కుమార్, సాగర్ తయాట్ (రా. 12.55); మహిళల స్టీపుల్ చేజ్- పారుల్ చౌదరి (రా. 2).
బాక్సింగ్: క్వార్టర్స్ బౌట్‌లు-సాక్షి, అరుంధతి, సచిన్, అంకుశ్, నరేందర్, జాస్మిన్ (సా. 4.45 నుంచి).
స్విమ్మింగ్: పురుషుల 1500 మీ. ఫ్రీస్టయిల్ ఫాస్టెస్ట్ హీట్-ఆర్యన్ నెహ్రా (రా. 1.14).
అజయ్ బాబుకు రజతం
అదరగొట్టిన సర్వేశ్
పారా అథ్లెట్ షర్మిలకు స్వర్ణం
కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. తెలుగు కుర్రాడు వల్లూరి అజయ్‌బాబు వెయిట్ లిఫ్టింగ్‌లో రజత కాంతులీనగా.. హైజంప్‌లో సర్వేశ్ కుషారే త్రుటిలో స్వర్ణం చేజార్చుకొన్నాడు. పారా షాట్‌పుట్‌లో షర్మిల చారిత్రక పసిడిని అందించగా.. శిల్ప కాంస్యం దక్కించుకొంది.
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల వెయిట్ లిఫ్టింగ్‌లో పతక జోరు కొనసాగుతోంది. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోటీల్లో తెలుగు లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు అద్భుత ప్రదర్శనతో రజతం సొంతం చేసుకోగా.. హైజం్‌పలో సర్వేశ్ కుషారే చారిత్రక రజతంతో మెరిశాడు. పారా షాట్‌పుట్‌లో షర్మిల ధన్కర్ స్వర్ణం.. శిల్ప కాంస్యం నెగ్గారు.

పట్టువదలని సర్వేశ్
కామన్వెల్త్ క్రీడల హైజం్‌పలో దేశానికి తొలి రజత పతకం అందించిన భారత అథ్లెట్‌గా సర్వేశ్ కుషారే రికార్డుల కెక్కాడు. జాతీయ రికార్డు హైజంపర్ సర్వేశ్ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొన్నాడు. సర్వేశ్ 2.25 మీటర్లు దూకి రజతం సొంతం చేసుకోగా.. రొమెయినీ బెక్‌ఫోర్డ్ (జమైకా) స్వర్ణం సాధించాడు. పసిడి కోసం సర్వేశ్, బెక్‌ఫోర్డ్ ఇద్దరూ 2.28 మీటర్లు దూకడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ, కౌంట్‌బ్యాక్‌లో బెక్‌ఫోర్డ్‌ను పసిడి వరించగా.. సర్వేశ్ రెండో స్థానానికే పరిమితమయ్యాడు. ఇంగ్లండ్ అథ్లెట్ జాక్ కిమాని 2.20 మీ. దూకి కాంస్యం సాధించాడు. మరో భారత జంపర్ ఆదర్శ్ రామ్ 2.15 మీ. దూకి ఐదో స్థానంలో నిలిచాడు. 2022 బర్మింగ్‌హామ్ క్రీడల్లో కాంస్యం సాధించిన తేజస్విన్ శంకర్ కూడా బరిలోకి నిలిచాడు. కానీ, తొలి ప్రయత్నంలో 2.05 మీ. దూకడంలో విఫలమైన తేజస్విన్.. మోకాలి నొప్పితో రిటైరయ్యాడు. అయితే, గురువారం నుంచి జరిగే డెకాథ్లాన్ ఈవెంట్‌లో అతడు బరిలోకి దిగే అవకాశం ఉంది.

పసిడి త్రుటిలో..
హోరాహోరీగా జరిగిన పోరులో 21 ఏళ్ల ఆంధ్ర లిఫ్టర్ అజయ్ త్రుటిలో స్వర్ణం చేజార్చుకొన్నాడు. పురుషుల 79 కిలోల విభాగంలో అజయ్ 330 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో రెండో ప్రయత్నంలో విఫలమైనా.. ఆఖరిసారి 149 కిలోలు లిఫ్ట్ చేసి గేమ్స్ రికార్డు నెలకొల్పిన అజయ్.. క్లీన్ అండ్ జెర్క్‌లో సునాయాసంగా 181 కిలోలు ఎత్తాడు. అయితే, 331 (147+184) కిలోలు ఎత్తి పసిడి సాధించిన మలేసియా లిఫ్టర్ ఎర్రే హిదాయత్, అజయ్ మధ్య థ్రిల్లింగ్ ఫైట్ జరిగింది. క్లీన్ అండ్ జెర్క్‌లో హిదాయత్ 181 కిలోలు ఎత్తి గేమ్స్ రికార్డును నెలకొల్పినా.. తన చివరి ప్రయత్నంలో అజయ్ 181 కిలోలు లిఫ్ట్ చేసి బద్దలు కొట్టాడు. కానీ, తన ఆఖరి ప్రయత్నంలో హిదాయత్ 184 కిలోలు ఎత్తి కొత్త గేమ్స్ రికార్డుతో బంగారు పతకాన్ని సొంతం చేసుకొన్నాడు. ఇంగ్లండ్ లిఫ్టర్ క్రిస్ మర్రే మొత్తం 325 (148+177) కిలోలు ఎత్తి కాంస్యం దక్కించుకొన్నాడు. కాగా, వెయిట్ లిఫ్టింగ్ మహిళల 63 కిలోల కేటగిరీలో నిరుపమ దేవి ఘోరంగా నిరాశపర్చింది. స్నాచ్‌లో 93 కిలోలు లిఫ్ట్ చేసిన నిరుపమ.. క్లీన్ అండ్ జెర్క్ మూడు ప్రయత్నాల్లోనూ 123 కిలోలు ఎత్తలేక పోయింది.
బాక్సింగ్ సెమీ్‌సకు ప్రీతి, ప్రియ
భారత బాక్సర్లు ప్రీతి పవార్, ప్రియ ఘంఘాస్, జాదూమణి సింగ్ సెమీస్ చేరి పతకాలను ఖాయం చేసుకొన్నారు. మహిళల 54 కిలోల క్వార్టర్స్‌లో ప్రీతి 5-0తో నికోల్ క్లైడ్ (నార్తర్న్ ఐర్లాండ్)ను, 60 కిలోల కేటగిరీలో ప్రియ 4-1తో నిమా మిచెల్ (స్కాట్లాండ్)ను ఓడించారు. 55 కిలోల విభాగంలో జాదూమణి 5-0తో జాంబియా బాక్సర్ ఎమ్‌వాలెను చిత్తుచేశాడు.
రవికి ఆరోస్థానం
స్విమ్మింగ్‌లో పారా పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో తెలుగు కుర్రాడు రవి బుడిగిన, అలీ ఇమామ్ పోడియం ఫినిష్ చేయలేక పోయారు. బుడిగిన 25.68 సెకన్ల టైమింగ్‌తో ఆరో స్థానంలో, అలీ 28.28 సెకన్లతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఇక, పురుషుల 100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో శ్రీహరి నటరాజ్ సెమీ్‌సకు అర్హత సాధించాడు. అయితే, 50 మీ. బటర్‌ఫ్లై హీట్స్‌లో సజన్ ప్రకాశ్ విఫలమయ్యాడు.
పారాలో కొత్త చరిత్ర
కామన్వెల్త్ పారా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా షర్మిల చరిత్ర సృష్టించింది. పారా షాట్‌పుట్ ఎఫ్47లో 40 ఏళ్ల షర్మిల ఇనుప గుండును 9.81 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించింది. ఇదే ఈవెంట్‌లో సమీక్ష అనంతరం మరో భారత షాట్ పుటర్ శిల్పకు కాంస్యం ప్రకటించారు. శిల్ప 7.26 మీటర్ల దూరం విసిరింది. అయితే, తొలుత నైజీరియన్ యుచారియా లియాజికి కాంస్యం దక్కింది. కానీ, ఆమె ఫౌల్ చేసిందని భారత్ నిరసన వ్యక్తం చేయడంతో నిర్వాహకులు రివ్యూ చేశారు. నాలుగో స్థానంలో నిలిచిన శిల్పను మూడో స్థానానికి అప్‌గ్రేడ్ చేశారు. అయితే, నైజీరియా కూడా కౌంటర్‌గా నిరసన వ్యక్తం చేసింది.
అతని రాకతో వెలుగు..
చాంపియన్ షర్మిల
బాల్యంలోనే పోలియో.. టీనేజ్‌లోనే పెళ్లి.. భర్త చేతిలో దెబ్బలు.. వరకట్న వేధింపులు.. ఇద్దరు పిల్లలతో ఒంటరి జీవితం.. ఆర్ధిక సమస్యలు.. ఇది అడుగడుగునా కన్నీటి కష్టాల సుడిగుండాలను దాటి.. నలభై ఏళ్ల వయసులో గ్లాస్గో వేదికగా పసిడి వెలుగులు విరజిమ్మి అంతర్జాతీయ వేదికపై దేశం గర్వపడేలా చేసిన షర్మిలా ధన్కర్ విజయ ప్రస్థానం.. ఎందరికో స్ఫూర్తిదాయకం. ఒకటి, రెండు కాదు, ఎన్నో పరీక్షలను దాటి సగం జీవితం నరకాన్నే చూసిన తనకు చివరకు ఆటలే సంతోషాన్నిస్తున్నాయని 40 ఏళ్ల షర్మిల అంటోంది. ‘హరియాణాలోని మహేంద్రగఢ్ జిల్లా చిత్రౌలి గ్రామానికి చెందిన నాకు పోలియో సోకడంతో రెండేళ్లప్పుడే ఎడమ కాలు చచ్చుబడిపోయింది. ఇక నాకు టీనేజిలోనే పెళ్లిచేశారు. మద్యానికి, డ్రగ్స్‌కు బానిసైన నా భర్త నన్ను కొట్టి, దుస్తులు చింపేసి ఇరుగుపొరుగు వారి ముందు నిలబెట్టాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక నా ఇద్దరు కూతుళ్లను తీసుకొని పుట్టింటికి వచ్చేశా. ఆ తర్వాత జీవనాధారం కోసం ఆసుపత్రిలో క్లీనింగ్‌లాంటి పనులు చేశా. మొదటి భర్త రూపంలో చీకటిలోనే మగ్గిపోయిన నాకు రెండో భర్త అజిత్ రాకతో నా జీవితంలో వెలుగు వచ్చింది. నా పిల్లల బాధ్యత తీసుకున్నారు. అతనే నన్ను పారా క్రీడలకు పరిచయం చేశారు. షాట్‌పుట్‌లో ప్రావీణ్యం సంపాదించేలా వెన్ను తట్టి ప్రోత్సహించారు. నా రెండో భర్తకు తోడు అమ్మానాన్నలు అండగా నిలవడంతో ఇవాళ నేను విజయగర్వంతో మీ అందరి ముందు నిలుచున్నా’ అని షర్మిల ఆనందం వ్యక్తం చేసింది.
విశాల్ ముందుకు..
కామన్వెల్త్ క్రీడల అథ్లెటిక్స్ పురుషుల 400 మీటర్ల రేస్‌లో విశాల్ టీకే సెమీ్‌సకు అర్హత సాధించాడు. రౌండ్-1 హీట్6లో విశాల్ 46.49 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచి సెమీస్ చేరుకొన్నాడు. కానీ, రాజేష్ రమేష్ హీట్స్‌లోనే వెనుదిరిగాడు. పురుషుల 110 మీ. హర్డిల్స్ ఫైనల్లో తేజస్ శిర్సే ఫైనల్స్‌లో ఆఖరి స్థానంలో నిలిచాడు. గాయంతోనే పరిగెత్తిన తేజస్.. 15.39 టైమింగ్‌తో ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యాడు. కాలికి గాయమైనా.. తేజస్ మొండి పట్టుదలతో రేస్‌ను పూర్తి చేశాడు.