Share News

సూపర్‌ ‘జంప్‌’

ABN , Publish Date - Aug 10 , 2026 | 01:11 AM

అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. బసంత్‌ కుమార్‌ మేఘ్వాల్‌, షానవాజ్‌ ఖాన్‌ అయితే ఏకంగా చారిత్రక ప్రదర్శనతో రికార్డు సృష్టించారు.

 సూపర్‌ ‘జంప్‌’

  • బసంత్‌కు రజతం షానవాజ్‌కు కాంస్యం

  • అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌

యూజీన్‌ (అమెరికా): అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. బసంత్‌ కుమార్‌ మేఘ్వాల్‌, షానవాజ్‌ ఖాన్‌ అయితే ఏకంగా చారిత్రక ప్రదర్శనతో రికార్డు సృష్టించారు. హైజంప్‌లో బసంత్‌ రజతం, లాంగ్‌జంప్‌లో షానవాజ్‌ కాంస్య పతకాలు కొల్లగొట్టారు. తద్వారా ఈ రెండు విభాగాలలో అండర్‌-20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్లుగా రికార్డు పుటలకెక్కారు. రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల బసంత్‌ హైజంప్‌లో 2.21 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ దూరం లంఘించి రజత పతకం సొంతం చేసుకున్నాడు. అయితే, స్వర్ణ, రజత, కాంస్య పతక విజేతలైన యూనస్‌ అయాచీ (అల్జీరియా), బసంత్‌, ఓటిస్‌ పూల్‌ (బ్రిటన్‌)లు సమానంగా 2.21 మీటర్లే లంఘించడం విశేషం. దీంతో ‘కౌంట్‌ బ్యాక్‌’ ఆధారంగా పతక విజేతలను నిర్ణయించారు. తొలి ప్రయత్నంలోనే 2.21 మీ. దూరం దూకడంతో యూనస్‌కి పసిడి పతకం లభించింది. రెండో యత్నంలో 2.21 మీ. లంఘించిన బసంత్‌కు రజతం దక్కింది. ఇక, మూడో ప్రయత్నంలో 2.21 మీ. చేరుకున్న ఓటిస్‌ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.


షానవాజ్‌కు మూడో స్థానం: పురుషుల లాంగ్‌జంప్‌లో ఉత్తరప్రదేశ్‌ అథ్లెట్‌ షానవాజ్‌ ఖాన్‌ 7.84 మీటర్ల ప్రదర్శన చేసి మూడోస్థానంతో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 18 ఏళ్ల షానవాజ్‌ మూడో ప్రయత్నంలో ఆ దూరాన్ని లంఘించాడు. డేనియల్‌ ఇంజోలి (ఇటలీ, 7.97 మీ.) స్వర్ణం, మెక్‌గ్రోడర్‌ (ఆస్ట్రేలియా, 7.96 మీ.) రజత పతకం గెలిచారు.

రిలే ఫైనల్‌కు మహిళల జట్టు

అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో భూమికా నెహాతే, తహురా ఖాటున్‌, తనూ చౌఽధరి, తియా ఆర్ముగమ్‌తో కూడిన భారత మహిళల జట్టు 4గీ400 మీటర్ల రిలేలో ఫైనల్‌కు చేరింది. హీట్‌లో 3:39.53 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది. అయితే మహిళల 4గీ100 మీ. రిలేలో అమోల్‌ భోంస్లే, భావన, ఆర్తీ, అనన్యా సురేష్‌తో కూడిన భారత బృందం హీట్‌లో 45.91 సెకన్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు ముందే నిష్క్రమించింది. ఇక సబీర్‌, రంజిత్‌, పియూష్‌, అష్ఫాక్‌తో కూడిన భారత 4గీ400 మీటర్ల పురుషుల జట్టు సైతం ఫైనల్‌ చేరడంలో విఫలమైంది. హీట్‌లో జట్టు ఐదోస్థానంలో నిలిచింది. మహిళలు, పురుషుల విభాగాల ప్రతి హీట్‌లో తొలి మూడు స్థానాలలో నిలిచిన జట్లే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. పురుషుల 5వేల మీ. వాక్‌ ఫైనల్లో నితిన్‌ గుప్తా ఆరో స్థానంలో నిలిచాడు. పురుషుల డిస్కస్‌ త్రోలో నిశ్చయ్‌ ఫొగట్‌ 59.46 మీ. దూరంతో క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో 16వ స్థానం సాధించి ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయాడు.

Updated Date - Aug 10 , 2026 | 01:13 AM