Share News

ఆట అదిరె..ఆశలు నిలిచె!

ABN , Publish Date - Feb 27 , 2026 | 03:50 AM

ఒత్తిడంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది.. భారత్‌ మళ్లీ గాడిలో పడింది. సూపర్‌-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో సూర్యసేన సెమీస్‌ అవకాశాలపై ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకున్నాయి....

ఆట అదిరె..ఆశలు నిలిచె!

ఒత్తిడంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది.. భారత్‌ మళ్లీ గాడిలో పడింది. సూపర్‌-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో సూర్యసేన సెమీస్‌ అవకాశాలపై ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ, జింబాబ్వేపై సాధికార విజయంతో టీమిండియా నాకౌట్‌ ఆశలను నిలబెట్టుకొంది. ముఖ్యంగా తడబడుతూ సాగుతున్న భారత బ్యాటర్లు.. ఈ మ్యాచ్‌లో సత్తాచాటారు. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ ఫామ్‌లోకి రావడం శుభపరిణామం.

  • 72 పరుగుల తేడాతో ఘన విజయం

  • మెరిసిన హార్దిక్‌, అభిషేక్‌, తిలక్‌

చెన్నై: బ్యాటర్లు రాణించడంతో.. టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌ ఆశలను భారత్‌ సజీవంగా నిలబెట్టుకొంది. సూపర్‌-8లో భాగంగా గురువారం గ్రూప్‌-1లో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తొలుత భారత్‌ 20 ఓవర్లలో 256/4 స్కోరు చేసింది. అభిషేక్‌ శర్మ (30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55), హార్దిక్‌ పాండ్యా (23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలు సాధించగా.. తిలక్‌ వర్మ (16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్‌) సత్తాచాటాడు. సికందర్‌ రజా, ముజరబాని, ఎన్‌గరవ తలో వికెట్‌ పడగొట్టారు. ఛేదనలో జింబాబ్వే ఓవర్లన్నీ ఆడి 184/6 స్కోరు చేసింది. బ్రియాన్‌ బెన్నెట్‌ (97 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేశాడు. అర్ష్‌దీప్‌ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ఓటమితో నాకౌట్‌ రేసు నుంచి జింబాబ్వే అవుటైంది. కాగా, సెమీస్‌ బెర్త్‌ కోసం ఆదివారం జరిగే బంపర్‌ మ్యాచ్‌లో వెస్టిండీ్‌సతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. పాండ్యా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

ముందుగానే వదిలేశారు..

భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ఏదశలోనూ ఛేదించే విధంగా కనిపించలేదు. బెన్నెట్‌ భారీ అర్ధ శతకంతో రాణించినా.. విజయం కోసం తెగించలేక పోయాడు. సగం ఓవర్లు ముగిసే సరికి రన్‌రేట్‌ 20కిపైగా చేరుకోవడంతో.. జింబాబ్వే ఓటమి లాంఛనమేనని అర్థమైంది. ఓపెనర్లు బెన్నెట్‌, మరుమణి జట్టుకు నిలకడైన ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ స్కోరుబోర్డును నడిపించడంతో.. జింబాబ్వే 44/0తో పవర్‌ప్లేను ముగించింది. కానీ, ఆ తర్వాతి ఓవర్‌లోనే మరుమణిని అక్షర్‌ క్యాచవుట్‌ చేసి.. టీమిండియాకు బ్రేక్‌ అందించాడు. అయితే, 9వ ఓవర్‌లో అక్షర్‌ బౌలింగ్‌లో బెన్నెట్‌ 6,4,6తో ఒక్కసారిగా గేర్‌ మార్చాడు. కానీ, మేయర్స్‌ (6)ను వరుణ్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఈ దశలో బెన్నెట్‌, కెప్టెన్‌ సికందర్‌ (31) మూడో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కావాల్సిన రన్‌రేట్‌ భారీగా పెరిగిపోవడంతో.. వీరిద్దరూ ఓటమి అంతరాన్ని తగ్గించడానికే ప్రయత్నించారు. 15వ ఓవర్‌లో దూబే బౌలింగ్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 26 పరుగులు రాబట్టిన బెన్నెట్‌ సెంచరీ దిశగా సాగాడు. కానీ, రజా, బర్ల్‌ (0)తోపాటు మన్యోంగా (11)ను అర్ష్‌దీప్‌ వెనక్కిపంపాడు. చివరి ఓవర్‌లో మూసేకివ (7)ను దూబే అవుట్‌ చేసినా.. 6,4 బాదిన బెన్నెట్‌ వంద మార్క్‌కు మాత్రం చేరుకోలేక పోయాడు.


కలసి కొట్టారు..

బ్యాటర్లు సమష్టిగా చెలరేగడంతో.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ భారీ స్కోరు చేసింది. టోర్నీలో తొలిసారి ఓపెనర్లు సంజూ శాంసన్‌ (24) అభిషేక్‌ శుభారంభాన్ని అందించారు. కిషన్‌ స్థానంలో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సంజూ.. మొదటి రెండు ఓవర్లు దాదాపుగా తానే ఎదుర్కోవడంతో శర్మపై ఒత్తిడి తగ్గింది. తొలి ఓవర్‌లోనే 4,6 బాదిన శాంసన్‌.. ఆ తర్వాత ఓవర్‌లో మరో సిక్స్‌ కొట్టాడు. 3వ ఓవర్‌లో మపోసా బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌తో టచ్‌లోకి వచ్చిన అభిషేక్‌.. ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. అయితే, భారీ స్కోరు చేస్తాడని భావించిన సంజూ మరోసారి వికెట్‌ పారేసుకొన్నాడు. ముజరబాని బౌలింగ్‌లో అతడు క్యాచవుట్‌ కావడంతో.. తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక, వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (38) కూడా రెండు ఫోర్లు బాదడంతో.. పవర్‌ప్లేలో భారత్‌ 80/1 స్కోరు చేసింది. మధ్య ఓవర్లలో కూడా టీమిండియా బ్యాటర్లు ఇదే జోరు చూపడంతో రన్‌రేట్‌ ఎక్కడా తగ్గలేదు. 11వ ఓవర్‌లో సికందర్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ సింగిల్‌తో టోర్నీలో తొలి ఫిఫ్టీ నమోదు చేసినా.. 4,6 కొట్టిన కిషన్‌ క్యాచవుట్‌ అయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ (33) బౌండ్రీతో ఖాతా తెరిచాడు. ఇవాన్స్‌ బౌలింగ్‌లో ముజరబాని క్యాచ్‌ చేజార్చడంతో బతికిపోయిన సూర్య 4,6తో బ్యాట్‌కు పనిచెప్పాడు. కానీ, అభిషేక్‌ను మపోసా అవుట్‌ చేసి దెబ్బకొట్టాడు. ధాటిగా ఆడే క్రమంలో సూర్య కూడా వెనుదిరిగాడు.

పాండ్యా, తిలక్‌ పోటాపోటీ..

డెత్‌ ఓవర్లలో పాండ్యా, తిలక్‌ ఎడాపెడా షాట్లతో.. ఐదో వికెట్‌కు 31 బంతుల్లో 84 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమ్‌ స్కోరు 250 మార్క్‌ దాటింది. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండ్రీకి తరలించిన తిలక్‌.. ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. 17వ ఓవర్‌లో ఇవాన్స్‌ బౌలింగ్‌లో పాండ్యా ఫోర్‌ కొట్టగా.. తిలక్‌ సిక్స్‌ బాదాడు. వీరిద్దరూ పోటీపడి ఆడడంతో ఆ తర్వాతి రెండో ఓవర్లలో 40 పరుగులు లభించాయి. కాగా, ఆఖరి ఓవర్‌లో పాండ్యా రెండు వరుస సిక్స్‌లతో అర్ధ శతకం పూర్తి చేసుకోవడంతోపాటు గ్రాండ్‌ ఫినిషింగ్‌ ఇచ్చాడు.

మారిన వ్యూహం

తీవ్ర విమర్శల నేపథ్యంలో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో భారీ మార్పులు చోటు చేసుకొన్నాయి. ఓపెనర్‌గా శాంసన్‌కు చోటివ్వగా.. అక్షర్‌ పటేల్‌ టీమ్‌లోకి వచ్చాడు. రింకూ సింగ్‌, సుందర్‌పై వేటుపడగా.. ఇషాన్‌ వన్‌డౌన్‌లో, తిలక్‌ వర్మ మిడిలార్డర్‌లో బరిలోకి దిగారు. లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు.

1

టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్‌ (35). ఈ క్రమంలో బుమ్రా (33)ను అధిగమించాడు.

Updated Date - Feb 27 , 2026 | 03:50 AM