SAFF 2026: ఛాంపియన్‌గా అవతరించిన భారత్
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:45 PM
సౌత్ ఏసియా ఫుట్ బాల్ ఫెడరేషన్(SAFF) 2026లో భారత ఫుట్‌బాల్ జట్టు అదరగొట్టింది. పాకిస్థాన్‌తో జరిగిన హోరాహోరీ ఫైనల్లో 2-1తో విజయం సాధించి సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: సౌత్ ఏసియా ఫుట్ బాల్ ఫెడరేషన్(SAFF)2026 ఛాంపియన్‌గా భారత్ అవతరించింది. ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 2-1తో భారత్ ఘన విజయం సాధించి. ఈ గెలుపుతో పదోసారి సాఫ్ (SAFF) ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. పాక్ ఆటగాడు జునైద్ షాకు రెండో అర్ధభాగంలో రెడ్ కార్డు రావడం మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
మ్యాచ్ ఆరంభం నుంచి పాకిస్థాన్ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. శారీరక సామర్థ్యంతో పాటు సాంకేతిక నైపుణ్యంలోనూ భారత ప్లేయర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఇంజ్యూరీ టైమ్ తొలి నిమిషంలో జునైద్ షా పంపిన క్రాస్‌ను అలంగీర్ ఘాజీ గోల్‌గా మలిచాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి పాక్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో సెషన్‌లో భారత జట్టు ఆటతీరును పూర్తిగా మార్చుకుంది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మాకార్టన్ నిక్సన్ భారతకు కీలకంగా మారాడు. అతడు రెండు మంచి అవకాశాలు సృష్టించినప్పటికీ వాటిని గోల్స్‌గా మలచడంలో మిగిలిన ప్లేయర్లు విఫలమయ్యారు.
ఇలా ఉత్కఠంగా సాగుతున్న మ్యాచ్ 61వ నిమిషంలో కీలక మలుపు తిరిగింది. భారత ఆటగాడు బ్రైసన్ ఫెర్నాండెజ్‌పై పాక్ ప్లేయర్ జునైద్ షా ప్రమాదకరంగా టాకిల్ చేశాడు. బంతి నేలపై ఉండగా జునైద్ తన బూట్ల స్టడ్స్‌తో బ్రైసన్ తొడ భాగాన్ని బలంగా తాకాడు. తొలుత రిఫరీ అతడికి ఎలాంటి కార్డు చూపించలేదు. అయితే వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) జోక్యంతో ఘటనను పరిశీలించిన అనంతరం జునైద్‌కు రెడ్ కార్డు చూపించాడు. దీంతో పాక్ పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఆ వెంటనే భారత్ స్కోరు సమం చేసింది. ఇక అక్కడి నుంచి భారత్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. 88వ నిమిషంలో అబ్దుల్ రబీహ్ వేసిన కార్నర్‌ను సందీప్ మండీ అద్భుతమైన హెడర్‌తో గోల్‌గా మలిచాడు. దీంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
మిగిలిన సమయంలో పాకిస్థాన్‌కు మరో గోల్ చేసే అవకాశాన్ని భారత ఆటగాళ్లు ఇవ్వలేదు. చివరకు రిఫరీ పూర్తిస్థాయి విజిల్ ఇవ్వడంతో భారత శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఈ విజయంతో భారత్ పదోసారి సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుంది. పాక్‌పై ఫైనల్లో విజయం సాధించడంతో భారత ఫుట్‌బాల్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.