హాకీ వరల్డ్‌కప్ రేపటి నుంచే
ABN , Publish Date - Aug 13 , 2026 | 05:30 AM
హాకీ ప్రపంచక్‌పలో యువ ఆటగాళ్లు ఒత్తిడికి గురవకుండా ఆడాలని భారత హాకీ జట్లకు మాజీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ సూచించాడు. ఈ టోర్నీ కోసం పడ్డ కఠోర శ్రమను నమ్ముకొని ముందుకు..
హాయిగా ఆడండి.. లక్ష్యాన్ని చేరండి!
న్యూఢిల్లీ: హాకీ ప్రపంచక్‌పలో యువ ఆటగాళ్లు ఒత్తిడికి గురవకుండా ఆడాలని భారత హాకీ జట్లకు మాజీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ సూచించాడు. ఈ టోర్నీ కోసం పడ్డ కఠోర శ్రమను నమ్ముకొని ముందుకు సాగాలన్నాడు. ఎఫ్‌ఐహెచ్ పురుషుల ప్రపంచకప్ నెదర్లాండ్స్, బెల్జియం వేదికలుగా ఈనెల 15 నుంచి 30 వరకు జరగనుంది. ఇదే వేదికల్లో మహిళల ప్రపంచకప్ ఒక రోజు ముందుగానే మొదలవనుంది. సీనియర్ స్టార్ హర్మన్‌ప్రీత్ సింగ్, సలీమా టెటె నాయకత్వంలో భారత జట్లు మెగా టోర్నీ బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీజేష్ మాట్లాడుతూ.. ‘హాకీలో ఒలింపిక్స్ తర్వాత అతిపెద్ద టోర్నీ ప్రపంచకప్. ప్రపంచం మొత్తం గమనిస్తుంటుంది. అందరి కళ్లూ మీపైనే ఉంటాయ్. ఈ తరుణంలో ఒకింత ఒత్తిడికి గురవడం సహజమే. దీని గురించే ఎక్కువగా ఆలోచిస్తే, అది ఆటపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అందుకే ప్రశాంతంగా ఆడండి. ఈ టోర్నీ కోసం మీరు పడ్డ శ్రమను గుర్తు తెచ్చుకోండి.. లక్ష్యాన్ని చేరుకోండి’ అని శ్రీజేష్ పేర్కొన్నాడు.