ఫాస్టెస్ మ్యాన్ గుర్విందర్
ABN , Publish Date - May 24 , 2026 | 03:18 AM
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 100 మీటర్ల స్ర్పింట్‌లో గుర్విందర్ సింగ్, 400 మీటర్లలో విశాల్ టీకే సంచలన ప్రదర్శనతో భళా అనిపించారు.
100 మీ. రేసులో నయా రికార్డు
400 మీ.లో విశాల్ సంచలనం
ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్
రాంచీ: ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 100 మీటర్ల స్ర్పింట్‌లో గుర్విందర్ సింగ్, 400 మీటర్లలో విశాల్ టీకే సంచలన ప్రదర్శనతో భళా అనిపించారు. 100 మీ. పరుగులో శుక్రవారం తొలి రోజు..గుర్విందర్ సింగ్, అనిమేష్ కుజుర్ పోటీపడి ఒకరి రికార్డు మరొకరు బద్ధలుగొట్టిన నేపథ్యంలో శనివారం నాటి ఫైనల్ హోరాహోరీగా సాగుతుందని భావించారు. కానీ 25 ఏళ్ల గుర్విందర్ సింగ్ 10.09 సె.లలోనే గమ్యం చేరి చరిత్ర సృష్టించాడు. దాంతో శుక్రవారంనాటి సెమీఫైనల్లో 10.15 సె.లో అనిమేష్ కుజుర్ నమోదు చేసిన గత జాతీయ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఇంకా..10.10 సె.లలోపే రేస్‌ను పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్‌గా గుర్విందర్ రికార్డు నెలకొల్పాడు. గుర్విందర్ తాజా టైమింగ్ ఆసియాలో రెండో అత్యుత్తమం. అనిమేష్ (10.20సె.), ప్రణవ్ గౌరవ్ (10.29 సె) 2,3 స్థానాల్లో నిలిచారు. ఈ ప్రదర్శనతో కామన్వెల్త్ క్రీడల టైమింగ్ 10.16 సె.లను కూడా గుర్విందర్ అధిగమించాడు.

విశాల్ 45 సెకన్ల లోపే..: 400 మీటర్ల పరుగులో విశాల్ 44.98 సెకన్ల కొత్త జాతీయ రికార్డుతో రేస్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈక్రమంలో గతేడాది ఇంటర్ స్టేట్ ఛాంపియన్‌షిప్ లో 45.12 సె.లతో తానే నమోదు చేసిన జాతీయ రికార్డును తిరగరాశాడు. విశాల్ తాజా టైమింగ్ ఈ సీజన్‌లో ఆసియాలోనే అత్యుత్తమం కావడం విశేషం.