Share News

గుకేష్‌కు సవాల్‌

ABN , Publish Date - Nov 24 , 2026 | 03:07 AM

చెస్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ చాంపియన్‌షి్‌పనకు వేళైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ ప్రపంచ చెస్‌ సమాఖ్య (ఫిడే) మెగా టోర్నమెంట్‌ మంగళవారం ఇక్కడ మొదలవనుంది.

గుకేష్‌కు సవాల్‌

  • నేటి నుంచి ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్

జెనీవా (స్విట్జర్లాండ్‌): చెస్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ చాంపియన్‌షి్‌పనకు వేళైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ ప్రపంచ చెస్‌ సమాఖ్య (ఫిడే) మెగా టోర్నమెంట్‌ మంగళవారం ఇక్కడ మొదలవనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌, భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేష్‌ దొమ్మరాజు.. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన జాకిర్‌ సిందరోవ్‌తో అమీతుమీ తేల్చుకుంటాడు. 2026 క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన సిందరోవ్‌ చాలెంజర్‌గా గుకేష్‌ను ఢీకొంటున్నాడు. ఇద్దరు ఆటగాళ్లకు 20 ఏళ్లే కావడంతో చెస్‌ చరిత్రలో పిన్నవయస్కులు ఢీకొంటున్న ప్రపంచ సమరంగా ఈ పోటీ రికార్డు నెలకొల్పుతున్నది. మంగళవారం జరిగే మొదటి గేమ్‌ను సిందరోవ్‌ తెల్లపావులతో, గుకేష్‌ నల్లపావులతో ప్రారంభిస్తారు.


స్కోర్లు సమమైతే..

14 గేమ్‌ల తర్వాత స్కోర్లు సమమైతే టైబ్రేక్‌ గేమ్‌ల ద్వారా ఫలితాన్ని ఖరారు చేస్తారు. ఇందులో భాగంగా ఇద్దరు ఆటగాళ్లు నాలుగు గేమ్‌ల ర్యాపిడ్‌ ఫ్లేఆఫ్‌లో తలపడతారు. ఇందులో ఒక్కో ఆటగాడికి 15 నిమిషాల సమయం ఉంటుంది. ప్రారంభం నుంచి ప్రతి ఎత్తు తర్వాత అదనంగా 10 సెకన్లు ఉంటుంది. నాలుగు గేమ్‌ల తర్వాతా..ఫలితం తేలకుంటే రెండు గేమ్‌ల ర్యాపిడ్‌ ప్లేఆఫ్‌ నిర్వహిస్తారు. ఇందులో ఒక్కో ఆటగాడికి 10 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ప్రతి ఎత్తు తర్వాత ఐదు సెకన్లు అదనంగా కేటాయిస్తారు. ఇక్కడ కూడా స్కోర్లు సమమైతే.. బ్లిట్జ్‌ విధానంలోకి పోటీ మారుతుంది. ఇందులో ఆటగాళ్లు రెండు గేమ్‌లు ఆడతారు. ఒక్కొక్కరికి మూడు నిమిషాలు, ఒక్కో ఎత్తుకు రెండు సెకన్ల అదనపు సమయం ఇస్తారు. ఇక్కడ కూడా ఫలితం రాకుంటే.. సింగిల్‌ బ్లిట్జ్‌ గేమ్‌లను ఆడిస్తారు. మూడు నిమిషాలు, ఒక్కో ఎత్తుకు రెండు సెకన్ల అదనపు సమయంతో ఈ సడెన్‌డెత్‌ పోటీ జరుగుతుంది. ఇందులో ఒకరు గెలిచేదాకా గేమ్‌ ఆడించి విజేతను నిర్ణయిస్తారు. ఆఖరిదైన 14వ గేమ్‌ డిసెంబరు 11న జరుగుతుంది. అవసరమైతే టైబ్రేక్స్‌ 12న నిర్వహిస్తారు.


ఫార్మాట్‌ ఇలా..

14 గేమ్‌ల క్లాసికల్‌ విధానంలో చాంపియన్‌షి్‌ప జరుగుతుంది. తొలుత 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు టైటిల్‌ దక్కించుకుంటాడు. విజయానికి ఒక పాయింట్‌ లభిస్తుంది. డ్రా అయితే ఆర పాయింటు కేటాయిస్తారు. గేమ్‌లో తొలి 40 ఎత్తులకు 120 నిమిషాల సమయముంటుంది. ఆ తర్వాత మిగిలిన ఆటకు 30 నిమిషాల సమ యం ఇస్తారు. 41వ ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 30 సెకన్ల అదనపు సమయం లభిస్తుంది.

ముఖాముఖి

2018-26 మధ్య ఇద్దరు తలపడిన మొత్తం ఏడు గేముల్లో సిందరోవ్‌ 4-1తో గుకేష్‌పై ఆధిక్యంలో నిలిచాడు. రెండు గేమ్‌లు డ్రా అయ్యాయి. క్లాసికల్‌ చెస్‌లో గుకేష్‌పై సిందరోవ్‌ 2-0తో ముందంజలో ఉండగా, ఒక గేమ్‌ డ్రాగా ముగిసింది. మొత్తంగా క్లాసికల్‌ విభాగంలో సిందరోవ్‌పై భారత గ్రాండ్‌సమ్టార్‌ ఒక్కసారీ గెలవలేదు.

Updated Date - Nov 24 , 2026 | 03:08 AM