పతకం ఖాయం చేశారు
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:47 AM
మహిళల డబుల్స్‌లో అంతర్జాతీయంగా తమదైన ముద్ర వేస్తున్న భారత స్టార్ జోడీ గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లోనూ సత్తా చాటింది.
సెమీస్‌కు గాయత్రి జోడీ
సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు మహిళల డబుల్స్‌లో పతకం
సాత్విక్ ద్వయం పరాజయం
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఓ పతకం ఖాయమైంది. మెగా టోర్నమెంట్‌లో జోరు ప్రదర్శిస్తున్న యువ డబుల్స్ ద్వయం గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ సెమీఫైనల్‌కు దూసుకుపోయింది. తద్వారా కనీసం కాంస్యం దక్కించుకోనుంది. 2011 తర్వాత ఈ మెగా టోర్నీ మహిళల డబుల్స్‌లో భారత్‌కు పతకం అందించిన ఘనతను గాయత్రి జోడీ అందుకోనుంది.
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల డబుల్స్‌లో భారత్ చివరిసారిగా 2011లో కాంస్య పతకం అందుకుంది. లండన్‌లో జరిగిన ఆ టోర్నీలో గుత్తా జ్వాల/అశ్వినీ పొన్నప్ప పతకం గెలిచారు.
న్యూఢిల్లీ: మహిళల డబుల్స్‌లో అంతర్జాతీయంగా తమదైన ముద్ర వేస్తున్న భారత స్టార్ జోడీ గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లోనూ సత్తా చాటింది. అద్భుత పోరాటంతో సెమీఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో అన్‌సీడెడ్ గాయత్రి జంట 16-21, 21-15, 21-13తో నాలుగో సీడ్, చైనా ద్వయం జియా యి ఫాన్/జాంగ్ షు జియాన్‌కు షాకిచ్చింది. తద్వారా తమ కెరీర్‌లో అతి పెద్ద విజయం సాధించింది. రెండురోజుల క్రితమే వీరిద్దరూ ప్రతిష్టాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన విషయం తెలిసిందే. కాగా శనివారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ చైనా జోడీ లియు షెంగ్‌షూ/టాన్ నింగ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
తొలి గేమ్ ఓడినా..పట్టు వీడక..: క్వార్టర్‌ఫైనల్ ప్రత్యర్థి చైనా జోడీతో గతంలో మూడుసార్లు తలపడినప్పుడు గాయత్రి జంటకు ఓటమే ఎదురైంది. పైగా..ఈ మ్యాచ్ తొలి గేమ్‌లోనూ భారత ద్వయం 1-6తో వెనుకంజలో నిలిచింది. ఈ దశలో పోరాడిన గాయత్రి/జాలీ వరుసగా ఆరు పాయింట్లు చేజిక్కించుకొని 8-9కి చేరింది. విరామానికి చైనా జోడీ మూడు పాయింట్ల ఆధిక్యంలో ఉంది. బ్రేక్ తర్వాతా పోరాటాన్ని కొనసాగించిన భారత జోడీ 13-15తో పోటీలోకి వచ్చింది. కానీ మనోళ్లకు అవకాశమివ్వని జియా యి ఫాన్/జాంగ్ షు గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ జోరు కొనసాగించిన యి ఫాన్/జాంగ్ షు 10-7తో ముందంజలో నిలిచింది. అయితే వెరవని గాయత్రి జోడీ 13-10తో దూకుడు ప్రదర్శించింది. మరోవైపు చైనా జోడీ కూడా తగ్గేదేలే అనేలా ఆడి అంతరాన్ని 14-15కి తగ్గించింది. కానీ ఒత్తిడి దరి చేరనీయని గాయత్రి/ట్రీసా విజయం సాధించి మ్యాచ్‌ను..మూడో గేమ్‌కు మళ్లించింది. నిర్ణాయక గేమ్‌లో 11-5తో తిరుగులేని స్థితిలో నిలిచిన భారత జంట అదే ఉత్సాహంతో మ్యాచ్‌ను ముగించింది.
చిరాగ్ జంట హ్యాట్రిక్ మిస్
2022, 2025 ప్రపంచ చాంపియన్‌షి్‌పలో కాంస్య పతకాలు నెగ్గిన భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి హ్యాట్రిక్ కొట్టడంలో విఫలమైంది. ఈసారి వాళ్ల పోరాటం క్వార్టర్‌ఫైనల్‌కే పరిమితమైంది. ఐదో సీడ్ సాత్విక్ జోడీ 18-21, 9-21తో మూడో సీడ్ లియాంగ్ వీకెంగ్/వాంగ్ చాంగ్ (చైనా) జంట చేతిలో ఓడింది.