Share News

గంభీర్‌ ఓ నియంత!

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:58 AM

వెస్టిండీ‌స్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి అవకాశం దక్కడం లేదు. ఇప్పటిదాకా జరిగిన మూడు మ్యాచ్‌ల్లో అతడు బెంచీకే పరిమితమయ్యాడు.

గంభీర్‌ ఓ నియంత!

  • వైభవ్‌ను కావాలనే ఆడించడం లేదు

  • కోచ్‌ మనీశ్‌ మండిపాటు

న్యూఢిల్లీ: వెస్టిండీ‌స్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి అవకాశం దక్కడం లేదు. ఇప్పటిదాకా జరిగిన మూడు మ్యాచ్‌ల్లో అతడు బెంచీకే పరిమితమయ్యాడు. ఓపెనర్లుగా అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌లను ఆడించేందుకే ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఓపెనింగ్‌ స్థానం కోసం సంజూతో ఈ చిన్నోడికి పోటీ ఏర్పడింది. ఐర్లాండ్‌పై శాంసన్‌ ఆడగా.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టీ20 సిరీ‌స్‌లో 15 ఏళ్ల వైభవ్‌ అరంగేట్రం చేశాడు. అనంతరం జింబాబ్వేతో సిరీస్‌కు కూడా తననే కొనసాగించారు. కానీ అఫ్ఘాన్‌తో మ్యాచ్‌ల్లో తిరిగి సీన్‌ మారింది. మళ్లీ సంజూకే ఓటు వేయగా.. ఆసియా గేమ్స్‌లో మాత్రం వైభవ్‌ను బరిలోకి దించి.. శాంసన్‌ను వన్‌డౌన్‌కు మార్చారు. తాజాగా విండీ్‌సతో సిరీ్‌సకు శాంసన్‌ ఓపెనర్‌గా రాగా, వైభవ్‌కు జట్టులోనే స్థానం లేకుండా పోయింది. ఇలా ఈ ఇద్దరిలో ఎవరికీ ఆ స్థానంలో వరుసగా ఆడే అవకాశం రావడం లేదు. మరోవైపు వైభవ్‌ విషయంలో గంభీర్‌ నియంతలా వ్యవహరిస్తున్నాడని అతడి చిన్ననాటి కోచ్‌ మనీశ్‌ ఓఝా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ‘నా అంచనా ప్రకారం వైభవ్‌ ఓ తుఫాన్‌లాంటి వాడు. అతన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే వారు ఈరోజు కాకపోయినా రేపైనా కొట్టుకుపోతారు. ప్రస్తుత యాజమాన్యం ఆటగాళ్లను బెంచ్‌పై ఉంచడం ద్వారా వారిని తీర్చిదిద్దుతామని భావిస్తున్నట్టుంది. భవిష్యత్‌ కోసం ఆటగాళ్లను సిద్ధం చేయాలంటే ముందు వారిని క్లిష్ట పరిస్థితుల్లో ఆడే అవకాశం కల్పించాలని చెబుతుంటారు. కానీ మీరు చేస్తున్నదేంటి? ముఖ్యంగా వైభవ్‌లాంటి ప్రతిభావంతులను బెంచీపై కూర్చోబెట్టడం దురదృష్టకరం. బహుశా ఈ కుర్రాడికి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో ఇలా నిరాశపరుస్తున్నారు. అతడి విషయంలో గంభీర్‌తో పాటు మేనేజ్‌మెంట్‌ నిరంకుశంగా వ్యవహరిస్తోంది’ అని కోచ్‌ ఓఝా ఘాటుగా స్పందించాడు.

Updated Date - Oct 13 , 2026 | 05:01 AM