Share News

అప్పుడు హేళనలు ఇప్పుడు ప్రశంసలు

ABN , Publish Date - Aug 19 , 2026 | 05:53 AM

ఒలింపిక్‌ పతక విజేత గగన్‌ నారంగ్‌ స్ఫూర్తితో 14 ఏళ్ల వయసులో రైఫిల్‌ చేతపట్టిన బధిర షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లకు తట్టుకొని నిలిచాడు. సరిగా మాట్లాడలేక పోవడం, వినికిడి...

అప్పుడు హేళనలు ఇప్పుడు ప్రశంసలు

ఒలింపిక్‌ పతక విజేత గగన్‌ నారంగ్‌ స్ఫూర్తితో 14 ఏళ్ల వయసులో రైఫిల్‌ చేతపట్టిన బధిర షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లకు తట్టుకొని నిలిచాడు. సరిగా మాట్లాడలేక పోవడం, వినికిడి లోపం ఉన్న నీకు ఆటలెందుకు? అని కొందరు హేళన చేసినా.. ఏమాత్రం కుంగిపోలేదు. తన ప్రతిభనే నమ్ముకొని ముందుకు సాగాడు. నిరుడు బధిర ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు. వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప వంటి మెగా ఈవెంట్ల్లో రికార్డులను కొల్లగొట్టి శెభాష్‌ అనిపించుకున్నాడు. ఇప్పుడు తనకు దక్కిన అర్జున అవార్డును కోచ్‌ గగన్‌ నారంగ్‌కు అంకితమిచ్చాడు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో ధనుష్‌ తల్లి ఆశ పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..

గగన్‌ నారంగ్‌ సార్‌ స్ఫూర్తితో ధనుష్‌ షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. గగన్‌ ఒలింపిక్స్‌లో ఆడిన వీడియోలు, ఇంటర్వ్యూలు చూసి ధనుష్‌ ప్రేరణ పొందాడు. ఈరోజు తానీస్థాయిలో ఉండడానికి కారణం గగన్‌నే. అర్జున అవార్డు వచ్చిందంటే ధనుష్‌ తొలుత నమ్మలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన క్రీడా పురస్కారాల జాబితాను చూసి కూడా ఇది నిజమేనా అని అతడు ఆలోచిస్తుండగా, గగన్‌ సార్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఆయన మాటల్లో తెలుసుకున్నాక ఎగిరి గంతేశాడు. ధను్‌షకు గాడ్‌ఫాదర్‌ ఆయనే. ధనుష్‌ కెరీర్‌లో గగన్‌ ప్రమేయం లేకుండా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఇక, తనతో పాటే తన కోచ్‌ నేహా చవాన్‌కు ద్రోణాచార్య అవార్డు లభించడం మా ఆనందాన్ని రెట్టింపు చేసింది.

కష్టానికి తగిన ప్రతిఫలం..

ఇన్ని పతకాలు సాధిస్తున్నా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నుంచి ఎందుకు తనకి సరైన గుర్తింపు రావడం లేదని ఇంతకుముందు బాగా బాధపడేవాడు. ఏదో ఒక రోజు నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది, నీరోజు వచ్చే వరకు సహనంగా వేచి చూడాలని చెప్పేదానిని. ఒకప్పుడు నీకెందుకు షూటింగ్‌ అని అతడిని హేళన చేసిన వారే ఇప్పుడు ధనుష్‌ విజయాలను చూసి ప్రశంసిస్తుంటే చాలా సంతోషంగా ఉంది.

2028 ఒలింపిక్స్‌ లక్ష్యంగా..

బధిర షూటింగ్‌లోనే కాకుండా సాధారణ సర్క్యూట్‌లో కూడా చాలా కాలంగా ఆడుతున్నాడు. వచ్చే అక్టోబరులో ఈజిప్టులో జరిగే రెగ్యులర్‌ వరల్డ్‌కప్‌ బరిలోకి దిగనున్నాడు. ఇక్కడ మంచి ప్రదర్శన కనబర్చి 2028 ఒలింపిక్స్‌కు సన్నద్ధం కావాలనే ప్రణాళికలో ఉన్నాడు. కచ్చితంగా సాధారణ విభాగంలో కూడా దేశం గర్వించే ప్రదర్శన చేసి, పతకాలు సాధిస్తాడనే నమ్మకం అతడికి ఉంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన కలలను సాకారం చేసుకునేందుకు తల్లిదండ్రులుగా మేము సహకరిస్తాం.

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)

Updated Date - Aug 19 , 2026 | 05:54 AM