Share News

చలో..గ్లాస్గో

ABN , Publish Date - Jul 23 , 2026 | 02:38 AM

మనుపటి తరహాలో అథ్లెట్ల సందడి లేదు.. ప్రచార ఆర్భాటాలూ లేవు. గడచిన మూడు దశాబ్దాల్లో అతి తక్కువ క్రీడాంశాలతో జరిగే 23వ కామన్వెల్త్‌ క్రీడలకు స్కాట్లాండ్‌లోని...

చలో..గ్లాస్గో

సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షప్రసారం

నీరజ్‌కు నదీమ్‌ సవాల్‌

మనోళ్లు పోటీపడే క్రీడాంశాలు ఇవే..

అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, సైక్లింగ్‌, ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌,

జూడో, లాన్‌ బౌల్స్‌, స్మిమ్మింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌.

పారా క్రీడలు..

పారా అథ్లెటిక్స్‌, వీల్‌ చైర్‌ బాస్కెట్‌ బాల్‌, పారా పవర్‌ లిఫ్టింగ్‌, పారా స్విమ్మింగ్‌, పారా సైక్లింగ్‌.

భారత్‌ షెడ్యూల్‌ నేడు

లాన్‌ బౌల్స్‌: మహిళల పెయిర్స్‌ (సా. 4.50 నుంచి),

పురుషుల సింగిల్స్‌ (సా. 6.15 నుంచి).

నేటి నుంచే కామన్వెల్త్‌ క్రీడలు

భారత ఆశలన్నీ బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌, లిఫ్టింగ్‌పైనే

గ్లాస్గో: మనుపటి తరహాలో అథ్లెట్ల సందడి లేదు.. ప్రచార ఆర్భాటాలూ లేవు. గడచిన మూడు దశాబ్దాల్లో అతి తక్కువ క్రీడాంశాలతో జరిగే 23వ కామన్వెల్త్‌ క్రీడలకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో గురువారం అధికారికంగా తెరలేవనుంది. 11 రోజులపాటు అలరించే క్రీడలు ఆగస్టు 2న ముగియనున్నాయి. 74 దేశాలకు చెందిన కేవలం 3 వేల మంది అథ్లెట్లు.. 4 వేదికల్లో జరిగే 16 క్రీడాంశాల్లో బరిలోకి దిగనున్నారు వీటిలో పారా క్రీడాంశాలు (6) కూడా ఉన్నాయి. బడ్జెట్‌ సవాళ్లు ఎదుర్కొంటున్నా.. ఈ మల్టీ స్పోర్టింగ్‌ ఈవెంట్‌ స్థాయి మాత్రం ఏమాత్రం తగ్గదని నిర్వాహకులు చెబుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పతకాల పట్టికలో టాప్‌-5లో నిలుస్తూ వస్తోంది. అయితే, గ్లాస్గో క్రీడల్లో మాత్రం అదంత సులువు కాదు. బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌పైనే భారత్‌ ఎక్కువ పతక ఆశలు పెట్టుకొంది. పారా క్రీడలు కూడా సమాంతరంగా జరగనున్నాయి. వాస్తవంగా ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్‌ ఈ క్రీడల ఆతిథ్య హక్కులు దక్కించుకొంది. కానీ, ఖర్చులు అమాంతం పెరిగిపోవడంతో తమవల్ల కాదని నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో 2014 క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన గ్లాస్గో.. ఆ బాధ్యత తీసుకొంది. అయితే, ఖర్చులో భారీగా కోతలు పెట్టింది. కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్‌తోనే ఈవెంట్‌ను ముగించనున్నారు. 2022 బర్మింగ్‌హామ్‌ క్రీడల బడ్జెట్‌తో పోల్చితే 60 శాతం తక్కువ.

చానుపై అంచనాలు: మొత్తం 13 క్రీడాంశాలు (5 పారా విభాగాలతో కలిపి)కు సంబంధించి 125 మంది సభ్యుల భారత బృందం ఈ క్రీడల్లో పాల్గొంటోంది. అయితే, మనోళ్లు ఎక్కువగా పతకాలు కొల్లగొట్టే రెజ్లింగ్‌, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్ని్‌సతోపాటు షూటింగ్‌ను కూడా తప్పించడం పతకాల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గత క్రీడల్లో ఈ నాలుగు క్రీడాంశాలకు సంబంధించిన 61 పతకాల్లో భారత్‌ 25 సాధించింది. ఇప్పుడు ఆ బాధ్యత బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌పై పడింది. గరిష్ఠంగా అథ్లెటిక్స్‌లో 32 మంది.. 22 మెడల్‌ ఈవెంట్స్‌లో పోటీపడనున్నారు. ఎప్పుడూ ఫేవరెట్‌గా భావించే స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాపై స్వర్ణం అంచనాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కారణంగా ఒలింపిక్‌ చాంపియన్‌ అర్షద్‌ నదీమ్‌ (పాకిస్థాన్‌), రుమేష్‌ తరంగ (శ్రీలంక) నుంచి చోప్రాకు గట్టిపోటీ ఎదురుకానుండటమే.


లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌, హైజంపర్‌ సర్వేశ్‌ కుషారే, ట్రిపుల్‌ జంపర్‌ ప్రవీణ్‌తోపాటు పురుషులు, మహిళల 4-400 రిటే జట్ల నుంచి పతకాలు ఆశించవచ్చు. 11 మంది బరిలోకి దిగుతున్న వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను మూడో స్వర్ణంపై గురి పెట్టింది. బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహైన్‌, జాస్మిన్‌ లంబోరియా, ప్రీతి పవార్‌, సాక్షి, సచిన్‌ సివాచ్‌, నరేందర్‌ పోడియం ఫినిష్‌ చేయగలరని భావిస్తున్నారు. లాన్‌ బౌల్స్‌, జూడోలో పతక అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ, 2022 బర్మింగ్‌హామ్‌ క్రీడల్లో సాధించిన 61 పతకాలను చేరడం కష్టమే.

8-Sports.jpg

బరిలో తెలుగోళ్లు

తెలుగు రాష్ట్రాల నుంచి వల్లూరి అజయ్‌ బాబు, నిష్కా అగర్వాల్‌, రవి కామన్వెల్త్‌ క్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విజయనగరానికి చెందిన అజయ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ 79 కిలోలలో, హైదరాబాద్‌కు చెందిన నిష్కా అగర్వాల్‌ రిథమిక్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌లో, జంగారెడ్డిగూడానికి చెందిన రవి పారా స్విమ్మింగ్‌ బరిలో ఉన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 02:38 AM