చాంపియన్‌కు షాకిచ్చాడు
ABN , Publish Date - Aug 18 , 2026 | 05:48 AM
ప్రతిష్ఠాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో తొలిరోజే భారత కుర్రాడు సంచలనం సృష్టించాడు. యువ షట్లర్ ఆయుష్ శెట్టి తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేస్తూ.. ప్రపంచ నెంబర్ వన్...
వరల్డ్ నెం.1 షి యుకిపై ఆయుష్ సంచలన విజయం
సింధు ముందంజ జూగాయత్రి జోడీ శుభారంభం
ప్రతిష్ఠాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో తొలిరోజే భారత కుర్రాడు సంచలనం సృష్టించాడు. యువ షట్లర్ ఆయుష్ శెట్టి తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేస్తూ.. ప్రపంచ నెంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ షి యుకికి షాకిచ్చాడు. మూడు గేమ్‌ల హోరాహోరీ సమరంలో చైనా స్టార్‌ను మట్టి కరిపించి గ్రాండ్‌గా రెండోరౌండ్‌కు దూసుకెళ్లాడు.
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల తొలిరోజు ఆతిథ్య భారత్‌కు మరపురానిదిగా నిలిచింది. 21 ఏళ్ల భారత ఆటగాడు ఆయుష్ శెట్టి అద్భుతం సృష్టించాడు. ఏకంగా గత ఏడాది విజేత, చైనా సూపర్ స్టార్ షి యుకిని ఇంటిముఖం పట్టించాడు. ఇక..మొదటి రోజు ఆతిథ్య భారత్‌కు చక్కటి ఫలితాలు లభించాయి. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ పీవీ సింధు, డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్/ట్రీసా జాలీ, సిమ్రాన్/కవిప్రియ జోడీలు, పురుషుల డబుల్స్‌లో అర్జున్/హరిహరన్ ద్వయం శుభారంభం చేశాయి. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో ఆయుష్ శెట్టి 21-14, 13-21, 21-19తో ప్రపంచ మొదటి ర్యాంకర్ షి యుకిని చిత్తు చేశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో తొమ్మిదో సీడ్ సింధు 21-7, 21-11తో వరుస గేముల్లో 141 ర్యాంకర్ సోఫియా నోబుల్ (ఐర్లాండ్)పై నెగ్గింది. మహిళల డబుల్స్ మొదటి రౌండ్‌లో గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ జోడీ 21-9, 21-13తో పౌలా లోపెజ్/లూసియా రోడ్రిగ్స్ (స్పెయిన్) జంటపై అలవోకగా నెగ్గింది. మరో తొలి రౌండ్‌లో సిమ్రాన్ సింఘీ/కవిప్రియ ద్వయం 22-20, 21-14తో నికోల్/కార్మెన్ (స్పెయిన్) జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో అర్జున్/హరిహరన్ జోడీ 21-16, 21-4తో ఉన్న దశలో రేనాల్డ్స్/గిలిడా (ఐర్లాండ్) వైదొలగడంతో ముందంజ వేశారు. ఇక.. మిగతా స్టార్ షట్లర్లలో అంటొన్సెన్, జూనియర్ పొపోవ్, మహిళల్లో టాప్‌సీడ్ అన్ సె యంగ్, కటెథాంగ్, వాంగ్ జీ యీ సింగిల్స్ రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు.
ఆదినుంచే జోరు: సొంతగడ్డపై అభిమానుల హర్షధ్వానాలతో విజృంభించిన ఆయుష్.. 30 ఏళ్ల షి యుకితో మ్యాచ్ మొదటి గేమ్‌లో 11-5 ఆధిక్యంలోకి దూసుకుపోయాడు. అదే ఊపులో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న షి యుకి..సుదీర్ఘ ర్యాలీలతో ఆయు్‌షను అలిసిపోయేలా చేసి గేమ్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక గేమ్‌లో.. తెలివిగా ఆడిన ఆయుష్ ప్రత్యర్థి తప్పులను సద్వినియోగం చేసుకొని గేమ్‌ను మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు. తద్వారా తన కెరీర్‌లో మరో చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. కర్ణాటకకు చెందిన ఆయుష్ ఈఏడాది ఆసియా చాంపియన్‌షి్‌పలో లీ షి ఫెంగ్, జొనాథన్ క్రిస్టీ, విదిత్‌సర్న్ వంటి హేమాహేమీలను చిత్తుచేసి రజత పతకం కైవసం చేసుకోవడం విశేషం.