Share News

బెల్జియం గ్రేట్‌ ఎస్కేప్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 02:04 AM

ఆఖరి పంచ్‌ మనదైతే ఆ కిక్కేవేరు అన్నట్టుగా బెల్జియం.. అభిమానులకు అసలు సిసలు ఫుట్‌బాల్‌ మజాను అందించింది. రెండు గోల్స్‌తో వెనుకబాటు.. మరో ఐదు నిమిషాల్లో రెగ్యులర్‌...

బెల్జియం  గ్రేట్‌ ఎస్కేప్‌

ఫిఫా కప్‌ మ్యాచ్‌లు

స్విట్జర్లాండ్‌ X అల్జీరియా

(ఉదయం 8.30)

ఆస్ట్రేలియా X ఈజిప్ట్‌

(రాత్రి 11.30)

అర్జెంటీనా X కాబో వెర్డె

(శనివారం తెల్లవారుజాము 3.30)

  • 3-2తో సెనెగల్‌పై గెలుపు

  • ఆఖర్లో పంచ్‌తో

  • ప్రీక్వార్టర్స్‌కు రెడ్‌ డెవిల్స్‌

  • ఫిఫా వరల్డ్‌కప్‌ రౌండ్‌-32

సియాటెల్‌: ఆఖరి పంచ్‌ మనదైతే ఆ కిక్కేవేరు అన్నట్టుగా బెల్జియం.. అభిమానులకు అసలు సిసలు ఫుట్‌బాల్‌ మజాను అందించింది. రెండు గోల్స్‌తో వెనుకబాటు.. మరో ఐదు నిమిషాల్లో రెగ్యులర్‌ సమయం ముగుస్తుంది. ఇక ప్రపంచ కప్‌ నుంచి బెల్జియం నిష్క్రమణే..! స్టేడియంలో సెనెగల్‌ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకొంటుండగా.. రెడ్‌ డెవిల్స్‌ అభిమానుల్లో నిరాశ.. నిస్పృహ..! కానీ, మూడు నిమిషాల్లోనే సీన్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న బెల్జియం.. అనూహ్యంగా రెండు గోల్స్‌తో స్కోరు సమం చేసింది. ఎక్స్‌ట్రా టైంలో మరో గోల్‌తో.. పరాజయం ఖాయమనుకొన్న మ్యాచ్‌లో గ్రేట్‌ ఎస్కే్‌పతో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. అనూహ్య పరిణామంతో విస్తుబోయిన సెనెగల్‌ ఇంటిముఖం పట్టింది. గురువారం అత్యంత నాటకీయంగా జరిగిన రౌండ్‌-32 మ్యాచ్‌లో బెల్జియం 3-2తో సెనెగల్‌ను ఓడించింది. బెల్జియం ఆటగాళ్లు రుమేలు లుకాకు (86వ), యూరీ టైలిమన్స్‌ (89వ, 120+5వ) గోల్స్‌ సాధించారు. హబీబ్‌ డయర్రా (24వ నిమిషం), ఇస్మయిలా సర్‌ (51వ) సెనెగల్‌ తరఫున గోల్స్‌ చేశారు. మ్యాచ్‌ ఆరంభం నుంచే సెనెగల్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకొంది. ఈ క్రమంలో 24వ నిమిషంలో పాస్‌ను అందుకొన్న హబీబ్‌.. బెల్జియం పెనాల్టీ ఏరియాలోకి చొరబడి బంతిని నేరుగా షూట్‌ చేశాడు. కానీ, రెడ్‌ డెవిల్స్‌ కీపర్‌ అడ్డుకోగా.. రీబౌండ్‌ అయిన బంతిని హబీబ్‌ గోల్‌లోకి పంపి సెనెగల్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. సమం చేసేందుకు బెల్జియం యత్నించినా ప్రత్యర్థి డిఫెన్స్‌ను బద్దలుకొట్టలేక పోయింది. ఇక, సెకండాఫ్‌ ఆరంభమైన ఆరో నిమిషంలోనే ఇస్మయులా లాంగ్‌ రేంజ్‌ కిక్‌తో సెనెగల్‌ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. దీంతో బెల్జియం శిబిరంలో నిరాశ ఆవరించింది. అయితే, 86వ నిమిషంలో థామస్‌ మ్యూనియర్‌ క్రాస్‌ను వెటరన్‌ స్ట్రయికర్‌ లుకాకు గోల్‌లోకి పంపి.. ఊపిరిలూదాడు. ఆ తర్వాత, 89వ నిమిషంలో కెప్టెన్‌ టైలిమన్స్‌ అద్భుత హెడర్‌తో గోల్‌ చేయడంతో.. 2-2తో సమం చేసిన బెల్జియం మ్యాచ్‌ ఫలితాన్ని అదనపు సమయానికి తీసుకెళ్లింది. అయితే, ఇంజ్యూరీ టైమ్‌లో టైలిమన్స్‌ను సెనెగల్‌ ఆటగాడు అభ్యంతరకరంగా అడ్డుకోవడంతో రెఫరీ పెనాల్టీ కిక్‌ ఇచ్చాడు. దీన్ని టైలిమన్స్‌ గోల్‌గా మలచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. రౌండ్‌-16లో అమెరికాతో బెల్జియం తలపడనుంది.


10-Sports.jpg

24 ఏళ్ల తర్వాత అమెరికా..

బోస్నియాపై విజయంతో ప్రీక్వార్టర్స్‌కు..

శాంటా క్లారా: మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న కెనడా, మెక్సికోతోపాటు అమెరికా కూడా ప్రీక్వార్టర్స్‌కు చేరుకొంది. మరో రౌండ్‌- 32 మ్యాచ్‌లో అమెరికా 2-0తో బోస్నియా అండ్‌ హెర్జ్‌గోవినాపై గెలిచింది. 2002 తర్వాత..అంటే 24 ఏళ్ల తర్వాత యూఎస్‌ నాకౌట్‌ మ్యాచ్‌ నెగ్గడం ఇదే తొలిసారి. ఫస్టాఫ్‌ 45వ నిమిషంలో ఫొలారిన్‌ బలోగన్‌ గోల్‌ చేసి అమెరికాను 1-0 ఆధిక్యంలో నిలబెట్టాడు. అయితే, సెకండా్‌ఫలో బలోగన్‌కు రెడ్‌ కార్డ్‌ చూపడంతో అమెరికా 10 మందితోనే ఆడినా ఆధిక్యాన్ని కాపాడుకోగలిగింది. ఈ క్రమంలో 82వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను మాలిక్‌ టిల్మన్‌ గోల్‌లోకి పంపి యూఎస్‌ ఆనందాన్ని రెట్టింపు చేశాడు.

ఈ వార్తలనూ చదవండి:

వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..

మెస్సీకి ఒక న్యాయం.. బలోగన్‌కు మరో న్యాయమా.. అభిమానుల ఆగ్రహం..

Updated Date - Jul 03 , 2026 | 02:04 AM