Share News

కాచుకో..అల్కారజ్‌

ABN , Publish Date - Jan 31 , 2026 | 02:48 AM

దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ సుదీర్ఘ కెరీర్‌లో ఐదు సెట్ల సమరాలు ఎన్నింటిలోనో తలపడ్డాడు. కానీ ఈ ఐదు సెట్ల పోరు మాత్రం ఎంతో ప్రత్యేకం...

కాచుకో..అల్కారజ్‌

  • దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ సుదీర్ఘ కెరీర్‌లో ఐదు సెట్ల సమరాలు ఎన్నింటిలోనో తలపడ్డాడు. కానీ ఈ ఐదు సెట్ల పోరు మాత్రం ఎంతో ప్రత్యేకం. ప్రత్యర్థి 24 ఏళ్ల యువ కెరటం. పైగా గత రెండు సంవత్సరాలుగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌. అంతేకాదు జొకో రికార్డు గ్రాండ్‌స్లామ్‌ స్వప్నానికి అడ్డుపడుతున్న ఇద్దరిలో ఒకడు. దాంతో 25వ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించాలనుకుంటున్న 38 ఏళ్ల జొకో ప్రయత్నాలు చాలా కాలంగా ఫలించడంలేదు. ఏకంగా పదిసార్లు విజేతగా తనకు అచ్చొచ్చిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఈసారి ‘చరిత్ర’ లిఖించాలని లక్ష్యంగా పెట్టుకొన్న నొవాక్‌ ఈ సెమీస్‌లో ఏమాత్రం తగ్గలేదు. డిఫెండింగ్‌ చాంపియన్‌ సినర్‌ను చిత్తు చేసి అరుదైన మైలురాయి చేరుకొనే దిశగా జొకో మరో అడుగేశాడు.

  • హోరాహోరీ సెమీ్‌సలో సినర్‌, జ్వెరెవ్‌కు షాక్‌జూ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ కిరీటం కోసం లెజెండరీ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌, యువ సంచలనం కార్లోస్‌ అల్కారజ్‌ అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో నాలుగో సీడ్‌ జొకోవిచ్‌ 3-6, 6-3, 4-6, 6-4, 6-4తో రెండో సీడ్‌ జానిక్‌ సినర్‌ (ఇటలీ)కు షాకిచ్చాడు. మరో సెమీఫైనల్లో 22 ఏళ్ల టాప్‌ సీడ్‌ అల్కారజ్‌ (స్పెయిన్‌) కూడా ఐదు సెట్ల ఉత్కంఠ భరిత పోరులో 6-4, 7-6 (5), 6-7 (7), 6-7 (7), 7-5తో మూడో సీడ్‌, నిరుటి ఫైనలిస్ట్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)ను కంగుతినిపించాడు.

తొలి సెట్‌ కోల్పోయినా..: సినర్‌తో 4గంటలకుపైగా జరిగిన మ్యాచ్‌లో తడబాటుకులోనైన జొకో తొలి సెట్‌ను చేజార్చుకున్నాడు. అయితే తనదైన శైలిలో పుంజుకొని రెండో సెట్‌ నెగ్గాడు. మూడో సెట్‌ నెగ్గిన సినర్‌ మళ్లీ పైచేయి సాధించాడు. ఈ దశలో నొవాక్‌ నాలుగో సెట్‌తోపాటు, చివరి సెట్‌ను కూడా సొంతం చేసుకొని 11వ సారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరాడు. ఇదే జోరులో..తన స్వప్నానికి అడ్డొస్తున్న మరో స్టార్‌ అల్కారజ్‌ను ఓడిస్తాడేమో చూడాలి.

నువ్వా..నేనా..:అల్కారజ్‌, 28 ఏళ్ల జ్వెరెవ్‌ సెమీస్‌ పోరు ఐదున్నర గంటలపాటు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. జ్వెరెవ్‌ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నా..మొదటి సెట్‌ను అల్కారజ్‌ చేజిక్కించుకోగలిగాడు. ఈ దశ నుంచి జ్వెరెవ్‌ మరింత ప్రతిఘటించడంతో తదుపరి మూడు సెట్లు టైబ్రేకర్లకు మళ్లాయి. రెండో సెట్‌నూ అల్కారజ్‌ సొంతం చేసుకోగా..తదుపరి రెండింటిని జ్వెరెవ్‌ దక్కించుకున్నాడు. ఇక ఐదో సెట్‌లో అల్కారజ్‌, జ్వెరెవ్‌ ఏ మాత్రం పట్టు సడలించలేదు. అయితే చివరకు ఈ సెట్‌లో విజేతగా నిలిచిన అల్కారజ్‌ ఊపిరి పీల్చుకున్నాడు.

Updated Date - Jan 31 , 2026 | 02:48 AM