Share News

ఆశలు గల్లంతు

ABN , Publish Date - Jun 29 , 2026 | 03:58 AM

మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో వరుసగా రెండోసారీ భారత జట్టు గ్రూప్‌ దశకే పరిమితమైంది. ఆదివారం ఆస్ట్రేలియాతో కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడింది.

ఆశలు గల్లంతు

  • భారత మహిళలకు నిరాశ

  • సెమీస్‍లో ఆసీస్‌, దక్షిణాఫ్రికా

  • ఎలిస్‌ పెర్రీ, గార్డ్‌నర్‌ జోరు

  • హర్మన్‌ పోరాటం వృథా

  • మహిళల టీ20 వరల్డ్‌కప్‌

లండన్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో వరుసగా రెండోసారీ భారత జట్టు గ్రూప్‌ దశకే పరిమితమైంది. ఆదివారం ఆస్ట్రేలియాతో కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో గ్రూప్‌ ‘ఎ’ నుంచి టాపర్‌గా నిలిచిన ఆసీస్‌ సెమీ్‌సలో ప్రవేశించింది. ఇక భారత్‌ ఓటమితో దక్షిణాఫ్రికా కూడా నాకౌట్‌కు వెళ్లింది. అయితే కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు.. ఆసీస్‌ ఛేదనలో భారత బౌలర్లు ఆదిలో రాణించడంతో విజయంపై ఆశలు రేగాయి. కానీ ఎలిస్‌ పెర్రీ (38 బంతుల్లో 8 ఫోర్లతో 56), గార్డ్‌నర్‌ (29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 నాటౌట్‌) ఒత్తిడిని అధిగమిస్తూ ఆసీస్‌కు అదిరే విజయాన్నందించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేసింది. మంధాన (37 బంతుల్లో 6 ఫోర్లతో 38), షఫాలీ (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34), జెమీమా (28 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 34) రాణించారు. మోలినెక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్‌ 19 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసి గెలిచింది. శ్రీచరణికి రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎలిస్‌ పెర్రీ నిలిచింది. ఈనెల 30న తొలి సెమీస్‍లో ఆసీస్‌-విండీస్‌, జూలై 2న రెండో సెమీస్‍లో దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్‌ తలపడతాయి.


ఆదుకున్న పెర్రీ-గార్డ్‌నర్‌: భారీ ఛేదనలో ఆసీస్‌ ఆరంభంలో వెనుకబడినా.. ఎలిస్‌ పెర్రీ, గార్డ్‌నర్‌ మెరుపు అర్ధసెంచరీలతో కోలుకుంది. ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 168 పరుగుల కీలక భాగస్వామ్యం భారత్‌ను దెబ్బతీసింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ వోల్‌ను పేసర్‌ రేణుకా సింగ్‌ అవుట్‌ చేయగా.. మూనీ (22), లిచ్‌ఫీల్డ్‌ (24) కాసేపు క్రీజులో నిలిచారు. స్పిన్నర్‌ శ్రీచరణి ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చింది. 12 ఓవర్లపాటు భారత్‌దే ఆధిపత్యం కనిపించింది. కానీ పెర్రీ-గార్డ్‌నర్‌ జోడీ సమయోచిత ఆటతీరును ప్రదర్శించింది. వీరి ఎదురుదాడితో 15-19 ఓవర్ల మధ్య 63 పరుగులు రాబట్టిన ఆసీస్‌ మరో ఆరు బంతులుండగానే మ్యాచ్‌ను ముగించింది.

హర్మన్‌ప్రీత్‌ ధనాధన్‌: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు మంధాన, షఫాలీ శుభారంభం అందించారు. ఇక చివర్లో కెప్టెన్‌ హర్మన్‌ ఎదురుదాడికి జట్టు పటిష్టమైన స్కోరు సాధించగలిగింది. అయితే మధ్య ఓవర్లలో ఆసీస్‌ బౌలర్లు కట్టడి చేయగలిగారు. పదో ఓవర్‌లో షఫాలీని బౌల్డ్‌ చేయడంతో తొలి వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే మంధాన లేని పరుగు కోసం వెళ్లి రనౌటైంది. అయితే జెమీమా, కెప్టెన్‌ హర్మన్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇంగ్లండ్‌ బౌలర్లు వీరిని భారీ షాట్లకు వెళ్లకుండా అడ్డుకోగలిగారు. ముఖ్యంగా జెమీమా ఇబ్బందిపడింది. 18 ఓవర్లలో స్కోరు 134/2గా ఉండడంతో 150 కూడా కష్టమే అనిపించింది. అయితే 19వ ఓవర్‌లో 13 రన్స్‌ సాధించిన జట్టు చివరి ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు రాబట్టింది. హర్మన్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఐదో బంతికి తను వెనుదిరిగినా ఆఖరి బంతికి దీప్తి (4 నాటౌట్‌) ఫోర్‌తో స్కోరు 170కి చేరింది. అంతకుముందు 18వ ఓవర్‌ ముగిశాక జెమీమా రిటైర్డ్‌ అవుటైంది.

1 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ (25 బంతుల్లో) బాదిన బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్‌. అలాగే ఈ టోర్నీలో ఎక్కువ 50+ స్కోర్లు (5) సాధించిన కెప్టెన్‌గా చార్లోట్‌ ఎడ్వర్డ్స్‌, మెగ్‌ లానింగ్‌ సరసన నిలిచింది.

మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ వికెట్లు (356) తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ. జులన్‌ గోస్వామి (355)ని అధిగమించింది.

2 ఒకే టోర్నీలో ఎక్కువ వికెట్లు (14) తీసిన రెండో బౌలర్‌గా శ్రీచరణి. 2024లో అమెలియా కెర్‌ 15 వికెట్లు తీసింది.

Updated Date - Jun 29 , 2026 | 03:58 AM