Share News

మెస్సీ సేనను వణికించారు!

ABN , Publish Date - Jul 05 , 2026 | 04:59 AM

అండర్‌డాగ్‌ కేప్‌ వెర్డె వరల్డ్‌క్‌పలో పెను సంచలనాన్ని త్రుటిలో చేజార్చుకొంది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో డిఫెండింగ్‌ చాంప్‌ అర్జెంటీనాను దాదాపుగా ఓడించినంత పని చేసింది.

మెస్సీ సేనను వణికించారు!

  • ఫుట్‌బాల్‌ పవర్‌హౌస్‌ అర్జెంటీనా అంటే ఎంతటి జట్లకైనా వణుకే..! లియోనెల్‌ మెస్సీతోపాటు మెరికల్లాంటి స్ట్రయికర్లతో జోరుమీదున్న అర్జెంటీనాతో పసికూన కేప్‌ వెర్డె పోరంటే.. అంతా వన్‌సైడే అని భావించారు. కానీ, అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన కేప్‌ వెర్డె.. దూకుడైన ఆటతో వరల్డ్‌ నెం:1 జట్టునే బెంబేలెత్తించింది. ఒకదశలో అతిపెద్ద సంచలనం సృష్టించేలా కనిపించింది. కానీ, ప్రత్యర్థి సెల్ఫ్‌గోల్‌తో అర్జెంటీనా కష్టంగా నెగ్గి ఊపిరిపీల్చుకొంది. ఈ మ్యాచ్‌లో ఓడినా.. బ్లూ షార్క్స్‌ చిరస్మరణీయ పోరాటం మాత్రం సాకర్‌ ప్రేమికులను ఆకట్టుకుంది.

  • కష్టంగా నెగ్గిన డిఫెండింగ్‌ చాంప్‌

  • అర్జెంటీనాకు ప్రీక్వార్టర్స్‌ బెర్త్‌ ఖరారు

మయామి గార్డెన్స్‌: అండర్‌డాగ్‌ కేప్‌ వెర్డె వరల్డ్‌క్‌పలో పెను సంచలనాన్ని త్రుటిలో చేజార్చుకొంది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో డిఫెండింగ్‌ చాంప్‌ అర్జెంటీనాను దాదాపుగా ఓడించినంత పని చేసింది. బ్లూ షార్క్స్‌ చిరస్మరణీయ పోరాటంతో.. మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మెస్సీ సేనకు చావుతప్పి కన్నులొట్టబోయినట్టయింది. శనివారం అదనపు సమయం వరకు సాగిన రౌండ్‌-32 మ్యాచ్‌లో అర్జెంటీనా 3-2తో కేప్‌ వెర్డెపై గెలిచి.. ప్రీక్వార్టర్స్‌కు చేరుకొంది. ఈ మ్యాచ్‌లో బ్లూ షార్క్స్‌ ఓడినా.. తొలిసారి ఆడిన మెగా ఈవెంట్‌లోనే తమదైన ముద్రవేసింది. ముఖ్యంగా ఆ జట్టు కీపర్‌ వొజిన్హా దాదాపు 10 సేవ్‌లతో ప్రత్యర్థిని తీవ్ర అసహనానికి గురి చేశాడు. లియోనెల్‌ మెస్సీ (29వ నిమిషం), లిసాండ్రో మార్టినెజ్‌ (92వ) అర్జెంటీనా తరఫున చెరో గోల్‌ చేయగా.. కేప్‌ వెర్డె ప్లేయర్లు డెరాయ్‌ డువార్టే (59వ), సిడ్నీ లోపెజ్‌ కాబ్రాల్‌ (103వ) గోల్స్‌ చేసి సమం చేశారు. కానీ, 111వ నిమిషంలో కేప్‌ వెర్డె ప్లేయర్‌ డినీ బోర్జెస్‌ సెల్ఫ్‌ గోల్‌తో అర్జెంటీనాను గెలిపించాడు. కేప్‌ వెర్డె పసికూన కావడంతో.. అర్జెంటీనా అలవోకగా నెగ్గుతుందని భావించారు. ఈ క్రమంలో 29వ నిమిషంలో మెస్సీ గోల్‌ చేసి అర్జెంటీనాను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. అయితే, అర్జెంటీనా ఫస్టాఫ్‌లో మరో గోల్‌ చేయలేక పోయింది.

కౌంటర్‌ అటాక్‌..: సెకండాఫ్‌ లో కేప్‌ వెర్డె దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి శిబిరంపై అనూహ్యంగా ఒత్తిడి పెంచి ఫలితం సాధించింది. 59వ నిమిషంలో పెనాల్టీ ఏరియాలో పాస్‌ను అందుకొన్న కేప్‌ వెర్డె ప్లేయర్‌ డెరాయ్‌ లాఘవంగా గోల్‌లోకి పంపి 1-1తో సమం చేశాడు. మరోవైపు కీపర్‌ వొజిన్హా.. గోల్‌ పోస్టుకు గోడకట్టినట్టుగా అడ్డుగా నిలవడంతో అర్జెంటీనా ఎన్ని ప్రయత్నాలు చేసినా తగిన ఫలితం సాధించలేక పోయింది. గోల్‌ పోస్టు ముందు మెస్సీ కొట్టిన పవర్‌ఫుల్‌ కిక్‌తోపాటు ప్రీకిక్‌ను కూడా వొజిన్హా చాకచక్యంగా అడ్డుకొన్నాడు. దీంతో మ్యాచ్‌ అదనపు సమయానికి దారితీసింది. అయితే, 92వ నిమిషంలో లాంగ్‌ పాస్‌ను దొరకబుచ్చుకొన్న మార్టినెజ్‌.. ప్రత్యర్థి డిఫెండర్లను తప్పిస్తూ గోల్‌ చేసి అర్జెంటీనాను 2-1తో ఆధిక్యంలో నిలబెట్టాడు. ఈ క్రమంలో 103వ నిమిషంలో లోపెజ్‌ కొట్టిన కిక్‌ నేరుగా గోల్‌లో పడడంతో కేప్‌ వెర్డె 2-2తో సమం చేయడంతో మ్యాచ్‌ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కానీ, 111వ నిమిషంలో మెస్సీ కొట్టిన కిక్‌ను క్రిస్టియన్‌ రొమిరోస్‌ హెడర్‌ ద్వారా గోల్‌ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, బంతి కేప్‌ వెర్డె ప్లేయర్‌ బోర్జెస్‌‌కు తగిలి గోల్‌లో పడింది. ప్రత్యర్థి సెల్ఫ్‌ గోల్‌తో అర్జెంటీనా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొంది. రౌండ్‌-16లో ఈజిప్ట్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.

4.jpg


కొలంబియా ముందంజ

కాన్సస్‌ సిటీ (యూఎస్‌): కొలంబియా జట్టు ప్రీక్వార్టర్‌ఫైనల్లో అడుగుపట్టింది. ఇక్కడ జరిగిన రౌండ్‌-32 మ్యాచ్‌లో కొలంబియా ఏకైక గోల్‌తో ఘనాను ఓడించింది. మ్యాచ్‌ మొదలైన 14వ నిమిషంలోనే మిడ్‌ఫీల్డర్‌ జాన్‌ అరియాస్‌ గోల్‌కొట్టి ఘనాను ఆధిక్యంలో నిలిపాడు. స్ట్రయికర్‌ లూయిస్‌ జేవియర్‌ సువారెజ్‌ నుంచి వచ్చిన పాస్‌ను అరియాస్‌ గోల్‌లోకి పంపాడు. ఆపై మ్యాచ్‌ను పూర్తిగా తన నియంత్రణలోనే ఉంచుకున్న కొలంబియా..ప్రత్యర్థికి గోల్‌ చేసే చాన్సు ఇవ్వలేదు.

ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు వయాగ్రా!

మెక్సికో సిటీ: ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ల్లో ప్రత్యేక ఎనర్జీ డ్రింక్స్‌, బార్‌లు తీసుకోవడం సహజం. అయితే, రొటీన్‌కు భిన్నంగా ఇంగ్లండ్‌ టీమ్‌ వయాగ్రా మాత్రలను తీసుకొనేందుకు అధికారులు అనుమతించడం ఆసక్తిగా మారింది. సోమవారం జరిగే ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లో మెక్సికోతో ఇంగ్లండ్‌ తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌ జరిగే స్టేడియం ఎస్టాడియో అజ్టెకా సముద్ర మట్టానికి దాదాపు 7,350 అడుగుల ఎత్తులో ఉంది. దీంతో ఇక్కడ ఆటగాళ్లు త్వరగా అలసిపోయే అవకాశం ఉంది. దీన్ని అధిగమించేందుకు లైంగిక ఉద్రేకాన్ని కలిగించే వయాగ్రా (సిల్డినాఫిల్‌)ను డాక్టర్లు సిఫారసు చేస్తున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల రక్తం కొంత పలుచబడి.. నరాల్లో వేగంగా ప్రవహిస్తుంది. ఇంగ్లండ్‌ కోచ్‌ విజ్ఞప్తి మేరకు ఈ ఔషధాన్ని ఉపయోగించేందుకు ఫిఫా, వాడా అనుమతి మంజూరు చేశాయి. వాడా నిషేధిత డ్రగ్స్‌ జాబితాలో కూడా వయాగ్రా లేదు.

మారడోనా రికార్డు బద్దలు

వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్‌కు సహకారం అందించిన అర్జెంటీనా దిగ్గజం మారడోనా రికార్డును మెస్సీ బద్దలుకొట్టాడు. మారడోనా 8 గోల్స్‌కు బాటలు వేయగా.. మెస్సీ 9 సార్లు ఆ ప్రయత్నాలతో రికార్డులను తిరగరాశాడు.

మెస్సీ@ 20

వరల్డ్‌కప్‌లో వరుసగా 8వ మ్యాచ్‌లోకూడా గోల్‌ చేసిన ఆటగాడిగా మెస్సీ అరుదైన రికార్డు నమోదు చేశాడు. అంతేకాకుండా మెగా టోర్నీలో 20వ గోల్‌తో టాప్‌లో తన పేరును మరింత సుస్థిరం చేసుకొన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మొత్తం 7 గోల్స్‌తో గోల్డెన్‌ బూట్‌ రేస్‌లో మెస్సీ ముందున్నాడు.

3.jpg

Updated Date - Jul 05 , 2026 | 06:55 AM