ఆ నిబంధనలపై వారు అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాను: అనయ బంగర్
ABN , Publish Date - Aug 29 , 2026 | 07:24 AM
ఆస్ట్రేలియాలోని కమ్యూనిటీ క్రికెట్‌లో ఆడేందుకు క్రికెటర్ అనయ బంకర్‌కు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన విషయంలో విమర్శలు చేస్తున్న వారికి అనయ గట్టి కౌంటర్ ఇచ్చింది.
స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియాలోని కమ్యూనిటీ క్రికెట్‌లో ఆడేందుకు క్రికెటర్ అనయ బంకర్‌కు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL)లో ఆడే అవకాశం కూడా రావడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘అనయ బంగర్ క్రికెట్ ఆడేందుకు అసలు అనుమతి ఇవ్వకూడదు!’ అంటూ ఘాటుగా విమర్శలు చేసింది. వీటిపై తాజాగా అనయ కౌంటర్ ఇచ్చింది.
'నేను మహిళ క్రికెట్ టోర్నీల్లో ఆడటాన్ని వ్యతిరేకించే వారు ఈ విషయంపై అవగాహన పెంచుకోవాలని నేను భావిస్తున్నాను. నేను అన్యాయంగా ఎలాంటి ప్రయోజనం పొందటం లేదు. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించడం వంటి అవసరమైన సమాచారాన్ని నేను ఇప్పటికే అందించాను. ఎవరికైనా నాపైన వేరే విధంగా వ్యక్తిగత అభిప్రాయం ఉంటే.. వారు వెళ్లి మహిళల క్రికెట్ నిబంధనలకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకుంటారని నేను ఆశిస్తున్నాను' అని అనయ వెల్లడించింది.
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ .. తాను మార్చి 2027 నుంచి ఆస్ట్రేలియాలో జరిగే ఎలైట్ మహిళల క్రికెట్‌లో పాల్గొనడానికి అర్హత సాధించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నుంచి వచ్చిన అధికారిక ప్రకటన ఫొటోలను అనయ షేర్ చేసింది. ఆ లేఖలో, తాను అందించిన వైద్య సమాచారం ఆధారంగా సీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనయ పేర్కొంది.