విశాఖపట్టణంలో కొత్త శాఖను ప్రారంభించిన సౌదీ ఐ.టి సంస్థ
ABN , Publish Date - May 04 , 2026 | 06:24 PM
అర్బ సాఫ్ట్‌వేర్ ఇప్పుడు విశాఖపట్టణంలో ఆరంగ్రేటం చేసింది. సౌదీ అరేబియాలోని అనేక ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు సాప్ సాల్యూషన్ సేవలందిస్తున్న అర్బ సాఫ్ట్‌వేర్ ఇప్పటికే హైదరాబాద్, మంగళూర్ నగరాలలో కార్యాలయాలుండగా తాజాగా విశాఖకూ విస్తరించింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా విశాఖపట్టణంను ఐ.టి. హబ్‌గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిలో తమ వంతుగా భాగస్వామ్యులు కావడానికి విదేశాలలోని ప్రవాసాంధ్రులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. గుగూల్, ఇన్ఫోసిస్‌తో సహా అనేక దిగ్గజ ఐ.టి. సంస్థలు విశాఖపట్టణాన్ని ఎంచుకుంటుండగా ప్రవాసాంధ్ర ఐ.టి. వ్యాపారస్థులు కూడా ఈ నగరంపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.

ఐ.టి. రంగంలో కీలకమైన ఇ.ఆర్.పి సాఫ్ట్‌వేర్‌లో విశ్వఖ్యాతి గాంచిన సాప్ (SAP) అనే సాఫ్ట్ వేర్‌ను సౌదీ అరేబియాలో విజయవంతంగా అమలు చేస్తున్న ఐ.టి. సంస్థలలో ఒకటయిన అర్బ సాఫ్ట్‌వేర్ ఇప్పుడు విశాఖపట్టణంలో ఆరంగ్రేటం చేసింది. సౌదీ అరేబియాలోని అనేక ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు సాప్ సాల్యూషన్ సేవలందిస్తున్న అర్బ సాఫ్ట్‌వేర్ ఇప్పటికే హైదరాబాద్, మంగళూర్ నగరాలలో కార్యాలయాలుండగా తాజాగా విశాఖకూ విస్తరించింది. బుధవారం రిమోట్ విధానం ద్వారా సౌదీ అరేబియా నుండి జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అర్బ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రతినిధులు కందిబెండల వరప్రసాద్, గౌరునాయుడు వోలేటి, సుల్తాన్ అహ్మద్, గులాం దస్తగిరిలు పాల్గోన్నారు.
విశాఖపట్టణంలోని తమ నూతన కార్యాలయం ద్వారా రానున్న మూడు సంవత్సరాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 300కు పైగా ఉద్యోగావకాశాలను సృష్టించే ప్రణాళిక ఉందని వరప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. విశాఖపట్టణంలోని తమ నూతన కార్యాలయం ద్వారా స్థానిక ప్రతిభను గుర్తిస్తూ ప్రోత్సహించే దిశగా ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. అదే విధంగా పి-4 పథకానికి కూడా తాము చేయూతనిస్తామని వరప్రసాద్ చెప్పారు.