సౌదీలో ఇరుక్కుపోయిన తెలుగు యువకులు.. ఆదుకున్న ఎన్నారై సంఘాల సభ్యులు
ABN , Publish Date - Apr 29 , 2026 | 07:23 PM
తెలియక తప్పులు చేసి సౌదీలో చేరుకుని ఇరుక్కుపోయిన తెలుగు యువకులను ఎన్నారై సంఘాల సభ్యులు ఆదుకుని క్షేమంగా స్వదేశానికి పంపించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎలాంటి అనుభవం, పరిజ్ఞానం లేకున్నా తాము వృత్తి నిపుణులమంటూ గల్ఫ్ దేశాలలోని యజమానులను బురిడీ కొట్టించడంలో ఒకప్పుడు భారతీయులు అందునా తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకులు ఉండే వారు కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. గల్ఫ్ దేశాలతో పాటు స్వదేశంలో పెరుగుతున్న సంస్కరణల కారణంగా పారదర్శకత పెరిగింది. దీంతో మోసపూరితంగా గల్ఫ్‌కు వెళ్లడం, ఒక వేల్లినా మనుగడ సాగించడం కష్టతరంగా ఉంది.
తాము వృత్తి నిపుణులమంటూ అడ్డదారిన దళారుల సహాయంతో సౌదీ అరేబియాకు చేరుకొన్న నలుగురు తెలుగు యువకులు తమ తప్పిదం తెలుసుకుని నాలుగు నెలల తర్వాత అతి కష్టంగా స్వదేశానికి తిరిగి వెళ్ళారు. విశాఖపట్టణం సమీపంలోని అనకాపల్లి జిల్లా కశింకోట మండలానికి చెందిన నలుగురు యువకులు కొద్ది నెలల క్రితం ఏ రకమైన అనుభవం లేకున్నా ఫిట్టర్లుగా సౌదీ అరేబియాలోని ఒక ప్రముఖ కంపెనీలో పని చేయడానికి వచ్చారు. వాస్తవానికి ఈ ఉద్యోగంలో అర్హత సాధించడానికి వీరు విశాఖపట్టణంలో జరిగిన ఇంటర్వ్యూ, పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. కానీ వీరు అక్రమ మార్గన అక్కడ ఒక ఏజెంటు సహాయంతో పాస్ అయినట్లుగా నిరూపించుకుని సౌదీ అరేబియాలోని దమ్మాం నగరానికి చేరుకున్నారు. సౌదీలోని ఒక ప్రముఖ కంపెనీ వీరికి ఉద్యోగంలో నియామకానికి ముందు పరీక్ష నిర్వహించగా అందులో వీరందరు ఫెయిలయ్యారు, దీంతో వీరిపై జాలిపడ్డ కంపెనీ వీరికి భారతదేశంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఫిట్టర్ కాకుండా లేబర్‌గా ఆ స్థాయి వేతనంపై పని చేయాలని సూచించగా వీరు నిరాకరించి ఇంట్లో కూర్చున్నారు.
అందులో ఒకరు, తన తప్పుకు కంపెనీకు 1 లక్షా 50 వేల రూపాయాలు చెల్లించి స్వదేశానికి వెళ్ళిపోగా మిగిలిన మరో ముగ్గురు తమకు అంత డబ్బు చెల్లించే స్తోమత లేదని చెప్పి స్వదేశానికి వెళ్ళిపోతామంటే అందుకు కంపెనీ ఆంగీకరించలేదు. అసలు వాస్తవాన్ని కప్పిపుచ్చి తమకు తక్కువ వేతనం ఇస్తున్నారని తప్పుడు వాదనతో సామాజిక మాధ్యమాలలో, తెలుగు సంఘాలను సంప్రదించారు. చేతిలో చిల్లిగవ్వ లేని వీరి నిస్సహాయ స్ధితిపై చలించిన దమ్మాంలోని ప్రముఖ తెలుగు సామాజిక కార్యకర్త రామిరెడ్డి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా వీరికి ఆశ్రయం కల్పించి భారతీయ ఎంబసీ సహాయంతో వీసా రద్దు చేయించి దమ్మాం నుండి 400 కిలో మీటర్ల దూరంలోని రియాధ్‌కు పంపించారు. రియాధ్ విమానశ్రాయంలో వీరి వీసా రద్దు విషయమై సాంకేతిక సమస్య ఏర్పడడంతో వీరిని విమానశ్రాయం నుండి వెనక్కి పంపించారు. తమకు తెలియని మహానగరంలో బిక్కుబిక్కుమంటూ గడిపిన వీరికి రియాధ్ లోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా ప్రతినిధులు ముజమ్మీల్ శేఖ్, చంద్రకాంత్ మంగళరపు ఆశ్రయం కల్పించి, సౌదీ అధికారుల వద్ద తిరిగి వీసా రద్దు సమాచారాన్ని సరి చేసి విమానమెక్కించగా ఇటీవల స్వదేశానికి తిరిగి వెళ్ళారు.
సరైన అర్హతలు కల్గిన వారు మాత్రమే విదేశాలకు రావాలని, మధ్యవర్తులను నమ్మి అడ్డదారిలో వస్తే ఈ రకమైన ఇబ్బందులు ఎదురవుతాయని సౌదీలోని తెలుగు సామాజిక కార్యకర్తలు హెచ్చరించారు.