బర్త్ సర్టిఫికెట్ లేక గల్ఫ్‌లో తెలుగు కుటుంబం ఇక్కట్లపాలు! ఎట్టకేలకు..
ABN , Publish Date - May 25 , 2026 | 12:35 PM
జనన ధ్రువీకరణ పత్రం లేక గల్ఫ్‌లో ఒక తెలుగు కుటుంబం నానా ఇక్కట్ల పాలై, ఎట్టకేలకు భారత్‌కు తిరుగుప్రయాణమైంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: మనిషి పుట్టుక, చావుకు చట్టబద్ధ రుజువు అనేది అవసరం. అది లేని పక్షంలో అధికారికంగా మనిషికి ఉనికి అంటూ ఉండదు. ప్రస్తుతం చేపట్టిన ఎస్ఐఆర్‌తో పరిస్థితి మరింత క్లిష్టతరమైంది. ఇందులో ఏ రకమైన నిర్లక్ష్యమైనా చట్టపరమైన సుదీర్ఘ చిక్కులకు దారి తీస్తోంది. గల్ఫ్ దేశాలలో కొన్ని తెలుగు ప్రవాసీ కుటుంబాలు ఈ రకమైన చిక్కుల్లో పడి అగమ్యగోచర స్థితిని ఎదుర్కొంటున్నాయి.
తమ బిడ్డ జనన ధ్రువీకరణ పత్రం విషయంలో జరిగిన జాప్యం కారణంగా బహ్రెయిన్‌లో విచ్ఛిన్నమైన ఒక తెలుగు ప్రవాసీ కుటుంబం ఎట్టకేలకు స్వదేశానికి తిరిగి వెళ్ళింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఒక ప్రవాసీ బహ్రెయిన్‌లో వ్యాపారం చేసే వారు. సందర్శక వీసాపై ఆయన తన భార్య, కూతురిని సుమారు తొమ్మిదేళ్ళ క్రితం బహ్రెయిన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత దంపతులకు 2018లో ఒక కూతురు జన్మించగా బిడ్డ జననాన్ని వారు భారతీయ ఎంబసీలో నమోదు చేయలేదు. దీంతో ఆమె కనీసం పాఠశాలకు కూడా వెళ్లలేకపోయింది. ఆ తరువాత ఆయనకు వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ విషయం తెలియని ఆయన మరో కేసులో ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా ఆయన అఖమా (వీసా) నెంబర్ ఆధారంగా అప్పటికే ఫిర్యాదు నమోదై ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. చివరకు ఆయనను దేశం నుంచి బహిష్కరించి స్వదేశానికి పంపించారు. ఆయన భార్యాపిల్లలు మాత్రం దేశం కానీ దేశంలో ఇరుక్కుపోయారు. గల్ఫ్ దేశాలలో ఒక్కసారి దేశ బహిష్కరణ (డిపోర్ట్) చేస్తే సదరు వ్యక్తి తిరిగి ప్రవేశించడానికి వీలుండదు. అందుకని తన కుటుంబాన్ని ఆదుకోవడానికి కుటుంబ పెద్ద రాలేకపోయాడు. వారు తిండి, గూడు లేక అల్లాడిపోయారు. పైగా వీరందరూ వీసా నిబంధనలను ఉల్లంఘించి అక్కడ ఉండటంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. తల్లీబిడ్డలు మాతృభూమికి తిరిగి వెళ్తామంటే, బహ్రెయిన్‌లో జన్మించిన కూతురికి జనన ధ్రువీకరణ పత్రం లేదు. దాంతో ఆమెకు ఏ రకమైన గుర్తింపు లేక గల్ఫ్, భారతీయ చట్టాలు ఆమెను భారతీయ పౌరురాలిగా గుర్తించలేదు. తల్లీబిడ్డలు భారతీయ ఎంబసీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా నిబంధనలు అడ్డువచ్చాయి.
భారతీయ పౌరసత్వం, జనన నమోదు నిబంధనల ప్రకారం, విదేశాలలో భారతీయ దంపతులు తమకు బిడ్డ పుట్టాక ఒక సంవత్సరం లోపు సంతానం వివరాలను ఎంబసీలో నమోదు చేయాలి. ఆ తరువాత న్యూఢిల్లీలోని కేంద్ర హోం శాఖ ప్రత్యేక అనుమతితో మాత్రమే ఎంబసీలో జననం నమోదవుతుంది. ఈ సర్టిఫికెట్‌ను గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు కూడా గుర్తించవల్సి ఉంటుంది. దానికి వివాహ రుజువు సమర్పించవల్సి ఉంటుంది.
జననం నమోదైన తరువాత మాత్రమే పాస్‌పోర్ట్ జారీ అవుతుంది. ఆ తర్వాత దాన్ని బహ్రెయిన్ ప్రభుత్వం క్లియర్ చేస్తే గానీ దేశం విడిచి వెళ్ళడానికి వీలు లేదు. ఇందుకు సంబంధించిన గడువు దాటితే జరిమానా కూడా చెల్లించవల్సి ఉంటుంది. తాజా ఉదంతంలో ఈ జరిమానాను బాధిత కుటుంబం తరఫున ఎంబసీ చెల్లించింది. బహ్రెయిన్‌లోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు కళా సమితి ఈ కుటుంబానికి ఆశ్రయం కల్పించడంతో పాటు మొత్తం ప్రక్రియను భారతీయ ఎంబసీ సహాయంతో పూర్తి చేసింది. దీంతో, శనివారం ఆ కుటుంబం మాతృభూమికి తిరిగి వెళ్ళింది. వీసాల గడువు, జనన సర్టిఫికెట్ల జారీలో జాప్యంతో గల్ఫ్ దేశాలలో ఇంకా అనేక కుటుంబాలు ఇలానే ఇక్కట్ల పాలవుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
అట్లాంటాలో తానా వాలీబాల్ టోర్నమెంట్
ఖతర్‌లో మహానాడుకు మంత్రి ప్రార్థసారథి