గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా సీఎం రేవంత్ రెడ్డి.. రూ.5 లక్షల సాయం
ABN , Publish Date - Apr 21 , 2026 | 08:51 PM
ఇటీవల మృతి చెందిన ఒక గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్ధిక సహాయం మంజూరైంది.
ఇటీవల మృతి చెందిన ఒక గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం, పొలాస గ్రామానికి చెందిన ఆరెల్లి గంగారాజం గల్ఫ్‌లో ఉండగా అనారోగ్యం పాలై కోమాలోకి వెళ్లడంతో స్వదేశానికి తరలించాల్సి వచ్చింది. ఇక్కడ చికిత్స పొందుతూ పదిరోజులు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాధితుడి కుటుంబానికి అండగా నిలిచింది. సీఎం ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి, సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్, ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్‌లు మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో మృతుడి భార్య ఆరెల్లి రాజవ్వకు చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.
కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆరెల్లి గంగారాజం (61) 2025 నవంబర్ 12న దుబాయిలోని ఆస్టర్ హాస్పిటల్‌లో చేరారు. చివరకు కోమా స్థితిలోకి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం డిసెంబర్ 14న హైదరాబాద్‌కు తరలించి, నిమ్స్‌లో చేర్చారు. అనంతరం రీహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందారు. చివరకు జగిత్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డిసెంబర్ 24న మరణించారు.

జీ.ఓ. నెం.216 ప్రకారం గల్ఫ్ దేశాల్లో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తోంది. కానీ రూల్స్‌లో ‘మరణ స్థలం గల్ఫ్ దేశం అయి ఉండాలి’ అనే నిబంధన కారణంగా ఆర్థిక సహాయం పొందడంలో ఆటంకం ఏర్పడింది. మానవతా దృక్పథంతో ప్రత్యేక కేసుగా పరిగణించి ₹5 లక్షల గల్ఫ్ ఎక్స్ గ్రేషియా మంజూరు చేయాలని మృతుడి భార్య రాజవ్వ, కుమారుడు జలంధర్ మార్చి 31న హైదరాబాద్ ప్రజాభవన్‌లో నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. జగిత్యాల ఎమ్మెల్యే డా. మాకునూరి సంజయ్ కుమార్‌కు దరఖాస్తు ప్రతిని పంపించారు. అదే సమయంలో ప్రవాసీ ప్రజావాణి హెల్ప్ డెస్క్‌ను సందర్శించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణల దృష్టికి ఈ సమస్య వచ్చింది. గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.
ప్రత్యేక కేసుగా పరిగణించి గల్ఫ్ ఎక్స్ గ్రేషియా మంజూరును పరిశీలించాలని ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రిని కోరుతూ డా. జి. చిన్నారెడ్డి దరఖాస్తుపై ఎండార్స్ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించాలని ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులుతో ఫోన్‌లో చర్చించి, ప్రభుత్వానికి డి.ఓ. లేఖ రాశారు. ఈ క్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధిత కుటుంబానికి నిధులు విడుదల అయ్యాయి.
మృతుడి భార్య రాజవ్వ, కుమారుడు జలంధర్‌లు ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డితో పాటు సెక్రటేరియట్‌కు వెళ్లి సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులును కలిసి ఆర్థిక సహాయం చెక్కు విడుదలలో కీలకంగా వ్యవహరించినందుకు కృతఙ్ఞతలు తెలిపారు.
పెషేంట్‌ను దుబాయి నుంచి స్వదేశానికి తరలించడం నుండి అన్ని రకాలుగా సహకరించిన జీఏడీ ఎన్నారై సెల్ సెక్షన్ ఆఫీసర్ కంచర్ల శ్రీనివాస రెడ్డి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ సమీనా బేగం, పి. రాజీవ్ కుమార్‌లను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గల్ఫ్ కార్మిక కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డా. మాకునూరి సంజయ్ కుమార్, అధికార యంత్రాంగానికి పొలాస సర్పంచ్ మిల్కూరి శంకరయ్య, డీసీసీ అధ్యక్షులు గాజెంగి నందయ్యలు కృతఙ్ఞతలు తెలిపారు.