కువైత్‌లో సీఎం చంద్రబాబు అభిమానుల రక్తదాన శిబిరం
ABN , Publish Date - Apr 18 , 2026 | 07:33 AM
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అభిమానులు కువైత్‌తో తాజాగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కులం, మతం, దేశం, ధనిక-పేద వివక్షలేవీ లేకుండా ఒక మనిషి సాటి మనిషికి ఇచ్చే అమూల్య బహుమానం రక్తదానం. ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ఇచ్చే బహుమానాలకు బహుళ సార్థకతలు ఉంటాయి. తమ అభిమాన నాయకుడి పేరిట ఈ రకమైన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా కువైత్‌లోని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు తమ నాయకుడిపై అభిమానాన్ని చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యన్.చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా కువైత్‌లో తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్.ఆర్.ఐ టీడీపీ కువైత్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం జరిగింది. ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని తాము కువైత్‌లో సేవా దినోత్సవంగా మార్చి ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లుగా తెలుగుదేశం పార్టీ ఎన్నారై గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజలకు సేవ చేయడానికని అన్నారు. తెలుగువారి సేవలో కువైత్ లేదా కడప అనే వ్యత్యాసం ఉండదని చెప్పారు. ఎక్కడైనా సేవ చేయవచ్చని ఆయన అన్నారు.

వాస్తవానికి ఈ రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. 500 మందికి పైగా ఆసుపత్రికు వచ్చినా అక్కడి నిల్వ సామర్ధ్యం పరిమితులు, శుక్రవారం సెలువు రోజు కావడంతో కేవలం 200 యూనిట్ల రక్తాన్ని మాత్రమే సేకరించగలిగారని వెంకట్ వివరించారు.
రక్తదానం చేసిన వారందరికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ప్రశంస ప్రతాలను పంపారని ఆయన చెప్పారు. కార్యక్రమానికి ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు రవి వేమూరి, గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధకృష్ణా, ఏపీ ఎన్నార్టీ సర్వీసెస్ డైరెక్టర్ అక్కిలి నాగేంద్రబాబు, తెలుగుదేశం ఎన్నారై సెల్ చప్పిడి రాజశేఖర్‌లు సహకరించారని వెంకట్ అన్నారు.

తెలుగుదేశం నాయకులు ఓలేటి దివాకర్, ములకల సుబ్బరాయుడు, దరూరి బలరాం నాయుడు, ఉదయ్ ప్రకాశ్, మాలేపాటి బాబు, పొలరపు బాబు నాయుడు, డాక్టర్ నెట్టం కృష్ణ, మోహన్ రాచూరి, శ్రీకాంత్ చింతల, రవి మలిశెట్టి, దొడ్డిపల్లి సుబ్బరాజు, దౌర్ల సాయి, భాస్కర్, రవి, వెంకట సుబ్బయ్య , శశికుమార్, సాయి, ముశ్తాఖ్ ఖాన్, రెడ్డయ్య చౌదరి, రమేశ్ చౌదరి, కృష్ణ చైతన్య, దుగ్గినేని మురళి, శంకర్ యాదవ్, నారాయాణమ్మలతో పాటు జనసేన నాయకులు హరి రాయల్, ప్రసాద్, మల్లికార్జున, ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు బాల రెడ్డయ్య చౌదరి, నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు నగేశ్, జనం మనం ఉపాధ్యక్షులు జిలానీ బాషా తదితరులు సహకరించారని నిర్వహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
