సింగపూర్‌లో వైభవంగా స్వరలయ ఆర్ట్స్ వార్షికోత్సవం
ABN , Publish Date - May 04 , 2026 | 09:24 PM
సింగపూర్‌లోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవం 2026 ఏప్రిల్ 25న ఘనంగా జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: సింగపూర్‌లోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవం 2026 ఏప్రిల్ 25న ఘనంగా జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమం ప్రొఫెసర్ బి.వి.ఎస్. చౌదరి, రాజ్యలక్ష్మి చౌదరి సమక్షంలో సింగపూర్ శివకృష్ణ దేవాలయంవారి ఫంక్షన్ హాలు వేదికగా జరిగింది. స్వరలయ సంస్థ విద్యార్ధుల సంగీత ప్రదర్శన, కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఆహూతులను అలరించింది. కుమారి శ్రీవిద్య పంతువరాళి రాగంలో ‘ఎన్నగాను రామభజన’ త్యాగరాజ కీర్తనను హృద్యంగా గానం చేసి ప్రేక్షకుల అభినందనలను అందుకున్నారు. స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు, గురు శేషుకుమారి సంగీత ప్రదర్శనలో ఆలపించిన త్యాగరాజ కీర్తన ‘ప్రక్కల నిలబడి’, ఒక ‘మీరా భజన్’, విద్యార్థులతో కలిసి చేసిన జానపద గీతం ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకున్నాయి.
తరువాత తెలుగు విశ్వవిద్యాలయం గ్రేడ్, యూనివర్సిటీ కోర్సులలో ఉత్తీర్ణులైన సంగీత విద్యార్ధులకు వీసీ నిత్యానందరావు అర్హతాపత్రాలు, ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేషుకుమారి సంగీత ప్రస్థానాన్ని ప్రశంసించారు. చదివినది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయినా చిన్నతనం నుంచీ సంగీతం పట్ల ఉన్న ఆసక్తి, అనురక్తి కర్నాటక సంగీత రీతులను, లోతులను కొలిచేలా, సంగీతకళను భావితరాలకి అందించేలా ఆమెను నడిపిస్తున్నాయని ఆయన అన్నారు. స్వరలయ విద్యార్థులు భవిష్యత్తులో కర్నాటక సంగీతరంగంలో తమవైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

హార్మనీ అండ్ హ్యూస్ అధ్యక్షురాలు శ్యామల ప్రసంగిస్తూ 2025లో తిరుపతిలో అన్నమాచార్య 500వ జయంతి ఉత్సవాలలో చేసిన సంగీత కచేరీ, శేషుకుమారి వంశీ-సీల్వెల్ ఫౌండేషన్ వారి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డ్ అందుకోవడం స్వరలయ సంస్థ సాధించిన కొత్త మైలురాళ్లని కొనియాడారు. గురు శేషు కుమారిని ‘సింగపూర్ గాన కోకిల’గా అభివర్ణిస్తూ, ఆమె శిష్యులు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంలో కుమారి మనోజ్ఞ అనే గాత్ర సంగీత విద్యార్థి మాట్లాడుతూ కర్నాటక గాత్ర సంగీతాన్ని ఒక O-level ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలు రాసేందుకు సింగపూర్ విద్యాశాఖ నుంచి తాను అనుమతి సాధించగలగటం విశేషం అని అన్నారు. ఇది తన గురువు ఇచ్చిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం వల్లనే సాధ్యమైందని అన్నారు. సంగీతం ఒక సబ్జెక్టుగా తీసుకోవడంతో ఇటు సంగీతంలో కృషి, అటు చదువుకునే సమయాన్ని సమర్థవంతంగా వాడుకోవడం వీలవుతోందని చెప్పారు.
ఈ సంవత్సరం స్వర లయ ఆర్ట్స్ తన కార్యకలాపాలను విస్తరించి, గురు కృష్ణ శృతి గారి మార్గదర్శకత్వంలో కూచిపూడి నృత్యాన్ని ప్రవేశపెట్టినట్లు శేషుకుమారి వివరించారు. ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా, గురు శేషుకుమారి తాళం, రాగం నేర్పించేందుకు వినూత్నమైన సంగీత ఆటలను ప్రవేశపెట్టారు. ఇవి ప్రత్యక్షంగా వేదికపై నిర్వహించిన, సంగీత శిక్షణలో ఒక కొత్త పోకడను పరిచయం చేశాయి.

యు.టి.ఐ.ఎ.ఇ.సి చైర్మన్ శ్రీ రాయ్, ట్రెజరర్ వి. ఆదేశ్ బాబు , కళ, శివ కృష్ణ ఆలయ చైర్మన్, మేనేజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కాకతీయ సాంస్కృతిక పరివారం నుంచి సబ్బుపాలకుర్తి, సింగపూర్ తెలుగు వనితలు సమూహం నుంచి శ్రీ క్రాంతి, జయ, దీపు, రేఖ, రాణి, గాయత్రి వంటి అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. పిల్లలు ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించి, వేడుకను విజయవంతంగా ముగించాయి. సౌజన్య చక్కటి వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. స్వర లయ ఆర్ట్స్ సింగపూర్‌లో భారతీయ సంప్రదాయ సంగీతం, నృత్య సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ, అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతోంది.
