Share News

సెయింట్‌ లూయిస్‌లో వైభవంగా ప్రారంభమైన శతచండీ సహిత రుద్రయాగం

ABN , Publish Date - Jul 16 , 2026 | 03:28 PM

అమెరికాలో తొలిసారిగా సెయింట్ లూయిస్‌లోని హిందు ఆలయంలో నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం మంగళవారం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా ప్రారంభమైంది.

సెయింట్‌ లూయిస్‌లో వైభవంగా ప్రారంభమైన శతచండీ సహిత రుద్రయాగం
Shata Chandi Homam

అమెరికాలో తొలిసారిగా సెయింట్ లూయిస్‌లోని హిందు ఆలయంలో నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం మంగళవారం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా ప్రారంభమైంది. వేద పండితుల మంత్రోచ్చారణలు, యాగశాల ప్రాంగణంలోని ఆధ్యాత్మిక వాతావరణం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులతో ఆలయం ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడింది.

ఉదయం గోమాత పూజతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, దీక్షా ధారణ, పంచగవ్య ప్రాశనం వంటి శాస్త్రోక్త కార్యక్రమాలను వేద పండితులు అత్యంత వైదిక సంప్రదాయంలో నిర్వహించారు. కార్యక్రమాల ముగింపులో మంత్రపుష్పం అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. సాయంత్రం యాగ కార్యక్రమాలు మరింత వైభవంగా కొనసాగాయి. పూజా ద్రవ్యాలు, దేవతా విగ్రహాలను శోభాయాత్రగా యాగశాలకు తీసుకువెళ్లగా భక్తులు భక్తిపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన నిర్వహించారు. తదుపరి ధ్వజారోహణం, షోడశ స్తంభ పూజ, వేదిక పూజ ఘనంగా జరిగాయి.

NRI2.jpg


యాగానికి అత్యంత ముఖ్య ఘట్టమైన అగ్ని మథనం ద్వారా పవిత్ర యజ్ఞాగ్నిని శాస్త్రోక్తంగా ఆవాహన చేసి యాగ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం వాస్తు గణపతి హోమం నిర్వహించగా, భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. తొలి రోజు కార్యక్రమాలు తీర్థ ప్రసాదంతో ముగిశాయి.

ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ మహాయాగంలో ప్రతిరోజూ వివిధ శాస్త్రోక్త పూజలు, హోమాలు, చండీ పారాయణం, రుద్రయాగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్ తెలిపారు. ప్రపంచ శాంతి, లోకక్షేమం, సర్వజన సుఖశాంతి కోసం నిర్వహిస్తున్న ఈ మహాయాగంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారు, పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

NRI7.jpgNRI4.jpgNRI3.jpgNRI6.jpgNRI5.jpg


ఈ వార్తలనూ చదవండి:

ఆటా 19వ మహాసభలకు విస్తృత ఏర్పాట్లు

అట్లాంటాలో తానా మరో కొత్త కార్యక్రమం

Updated Date - Jul 16 , 2026 | 03:35 PM