Share News

సొంత ఊరిలో స్మశానం నిర్మాణం.. ఎన్నారై దాతృత్వం

ABN , Publish Date - Apr 01 , 2026 | 08:41 PM

ఒంగోలుకు చెందిన ఓ ఎన్నారై తన స్వగ్రామంలో సొంత ఖర్చులతో స్మశానాన్ని నిర్మించారు.

సొంత ఊరిలో స్మశానం నిర్మాణం.. ఎన్నారై దాతృత్వం
Ongole crematorium development

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: బతుకు పరుగులో గెలుపోటములు, కష్టసుఖాలను ఎదుర్కొన్నా చివరి మజిలీ మాత్రం స్మశానం. మట్టిలో కలిసిపోయి శాశ్వత విశ్రాంతి తీసుకునే స్థలం ఇదే. ఇది కేవలం ఒక దహన వాటిక కాదు, జీవిత కథలు ముగిసి, నిశ్శబ్దంగా శాశ్వతంగా నిద్రించే స్థలం. తమ కర్మలను కర్తవ్యంగా భావించి చేస్తారో, నిత్యం ప్రశాంతంగా ఉంటారో, సుఖ దుఖాలను సమానంగా చూస్తారో వారిలో శివుడు ఉంటాడనేది అనేక మందికి ఉండే విశ్వాసం. భగవద్గీతలో కృష్ణుడు కూడా తనకు ఈ రకమైన వారంటే ఇష్టమని భోదించాడు. అందుకే శివుడిని స్మశానవాసి అని అన్నారు.

అరిష్టం శినోతి తనూకరోతి అంటే అరిష్టాలను తగ్గించేది శివం, పెద్ద చిన్న తేడాలతో నిమిత్తం లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు చేరేది స్మశానికే. అక్కడ చేరిన తర్వాత ఇక పునర్జన్మ ఉండదనే కైవల్యపదమే శివుడి నివాసం. మనిషి ఎక్కడ స్వంత ఊరిలో ఉన్నా ఎక్కడో అరేబియా లేదా అమెరికాలో ఉన్నా చివరకు చేరేది స్మశానానికే.

సౌదీ అరేబియాలో దురదృష్టకర పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకొని మరణించిన తన భార్యకు ఆమె పుట్టిన ఊరిలో అంతిమ సంస్కారం చేయడంతో పాటు గ్రామంలో అన్ని వసతులతో కూడిన ఒక స్మశాన వాటికను నిర్మించడానికి ముందుకు వచ్చిన ఒక ప్రవాసాంధ్రుడి కథ ఇది.

1.jpg


సౌదీ అరేబియాలో నివసించే ఒంగోలు జిల్లా సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామానికి చెందిన తిరుపతి స్వర్ణ స్వామి అనే ప్రవాసాంధ్రుడు తన భార్య అనూష కొద్ది కాలం క్రితం ఆత్మహత్య చేసుకోని మరణించడంతో చలించిపోయాడు. గల్ఫ్ నుండి ఆమె మృతదేహాన్ని తీసుకొని వెళ్ళి తన స్వస్థలంలో ఆమెకు అంతిమ క్రియలు నిర్వహించారు. తర్వాత బడి, గుడి, విగ్రహాలు అంటే ఆసక్తి ప్రదర్శించే ప్రజానీకం అఖరి మజిలి పట్ల అనాసక్తితో దూరంగా ఉండడంతో విస్తుపోయారు. దీంతో స్మశానం, మరణం అనే ఆంశాలపై ఉన్న దురభిప్రాయాలను తొలగించడమే కాకుండా ప్రతి ఒక్కరూ చివరకు వెళ్లాల్సిన ఈ ఆఖరి మజిలీ ప్రాధాన్యాన్ని విడమరిచి చెప్పడానికి కంకణం కట్టుకున్నాడు.

సౌదీలో ఉంటూ తన గ్రామంలో చెరువు పక్కన విశాల స్థలంలో సకల సదుపాయాలతో కూడిన స్మశానవాటికను అందరి సహాయంతో నిర్మించి రాష్ట్ర ప్రభుత్వంతో సత్కారం పొందారు. తన నాయనమ్మ మాణిక్యమ్మ మరణించినప్పుడు గ్రామ స్మశానవాటికలో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో ఉన్న ప్రదేశంలోనా చివరకు మనిషి వెళ్ళేది అన్న ప్రశ్న తలెత్తింది. చివరకు ఆయన భార్య అనూష అనుకోని పరిస్థితుల్లో మరణించిన తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం లభించింది. శాశ్వతంగా ఉండవల్సిన చోటు మన ఇంటి కంటే మెరుగ్గా ఉండాలనే సంకల్పంతో తాను స్మశానవాటిక నిర్మాణానికి శ్రీకారం చుట్టానని స్వామి తన మనోగతాన్ని వెల్లడించారు. గ్రామంలోని రాజకీయ పరిస్ధితులు ఇతరత్రా కారణాల వలన ఆలోచన మొదట్లో కార్యరూపం దాల్చలేదని, కానీ తన భార్య మరణించిన తర్వాత దీన్ని పూర్తి చేసినట్లుగా ఆయన అన్నారు.

2.jpg


హైందవ స్వర్గధామం పేరిట నిర్మించిన ఈ స్మశానవాటిక ప్రస్తుతం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎక్కడ లేని విధంగా సకల సౌకర్యాలతో ఉందని స్వామి చెప్పారు. ఆకర్షణీయమైన శివుడి విగ్రహంతో పాటు సత్యహరిశ్చంద్రుని విగ్రహాలను ప్రత్యేక శిల్పుల ద్వార చేయించామని ఆయన వివరించారు. పి4 క్రింద ఒంగోలు జిల్లాలో మొత్తం నలుగురిని ప్రభుత్వం గుర్తించి సత్కరించగా అందులో వ్యక్తిగత కోటాలో తనకూ సత్కారం దక్కిందని ఆయన వివరించారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి తనను సత్కరించగా తన పక్షాన తన ప్రతినిధి, ఆత్మీయుడు అయిన ఆశోక్ కుమార్ బొడ్డపాటి ప్రశంస పత్రాన్ని అందుకున్నారని ఆయన చెప్పారు.

కామేపల్లి శ్రీనివాస రావు సారథ్యంలో చంద్రశేఖర్, కామని వేణు, కామని అంజనీ, రామయ్య, స్వర్ణ ప్రతాప్, బత్తినేని రామలింగయ్య, అన్నబత్తిన సుబ్బారావులతో పాటు గ్రామస్థులు ఈ నిర్మాణంలో సహకరించారని స్వామి చెప్పారు.

Updated Date - Apr 02 , 2026 | 05:35 PM