ఫీనిక్స్‌లో స్వరాల పండుగ.. వేలాది మందిని కట్టిపడేసిన ఇళయరాజా!
ABN , Publish Date - Sep 06 , 2026 | 09:10 PM
రిజోనాలోని ఫీనిక్స్ నగరం ఒక అరుదైన సంగీత అనుభూతికి వేదికైంది. ఐదు దశాబ్దాలుగా భారతీయ సంగీత ప్రపంచంపై తనదైన ముద్ర వేసిన మాస్ట్రో ఇళయరాజా, ‘రాజా 50’ పేరుతో జరిగిన ప్రత్యక్ష సంగీత కార్యక్రమంలో..
ఇంటర్నెట్ డెస్క్: శంకర నేత్రాలయ సేవలపై అవగాహన కల్పించే లక్ష్యంతో అరిజోనాలోని ఫీనిక్స్ నగరం ఒక అరుదైన సంగీత అనుభూతికి వేదికైంది. ఐదు దశాబ్దాలుగా భారతీయ సంగీత ప్రపంచంపై తనదైన ముద్ర వేసిన మాస్ట్రో ఇళయరాజా, ‘రాజా 50’ పేరుతో జరిగిన ప్రత్యక్ష సంగీత కార్యక్రమంలో దాదాపు మూడు గంటలపాటు ప్రేక్షకులను తన సంగీత ప్రపంచంలో విహరింపజేశారు. ఫీనిక్స్‌లో గతంలో ఎన్నో భారతీయ సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు జరిగినప్పటికీ, ఇంత భారీ స్థాయిలో లైవ్ సింఫనీ సంగీత బృందంతో జరిగిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించింది.

దాదాపు 40 మంది సంగీత కళాకారులతో కూడిన బృందం ఇళయరాజాతో కలిసి వేదికను పంచుకుంది. కీబోర్డ్, డ్రమ్స్‌తో పాటు వివిధ వాయిద్యాలు ఒకదానితో మరొకటి కలుస్తూ పాటకు ఎలా జీవం పోస్తాయో ప్రత్యక్షంగా వినిపించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కొన్ని సందర్భాల్లో ఒక్కో వాయిద్యం సంగీతంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇళయరాజా స్వయంగా వివరించడం ఈ కార్యక్రమాన్ని సాధారణ సంగీత కచేరీకి భిన్నంగా నిలిపింది.
Arizona Financial Theatreలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 4,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. దాదాపు ఐదు వేల మంది సామర్థ్యం ఉన్న ప్రాంగణంలో హౌస్‌ఫుల్‌కు కేవలం 89 టికెట్ల దూరంలోనే కార్యక్రమం నిలిచింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు వివిధ భారతీయ భాషలు, ప్రాంతాలకు చెందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంగీతానికి భాషా సరిహద్దులు లేవని మరోసారి చాటింది.
ఈ కార్యక్రమానికి ఫీనిక్స్‌లోని వివిధ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సంఘాలు, ఇతర భారతీయ సామాజిక సంస్థల ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు, స్పాన్సర్లు, వాలంటీర్లు తమ వంతు సహకారం అందించారు. భాషలు, ప్రాంతాలు వేరైనా ఒక మంచి కార్యక్రమం కోసం అందరూ కలిసి రావడం ఈ విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. నిర్వాహకులతో పాటు వివిధ సంఘాలు, స్పాన్సర్లు, వాలంటీర్లు, శంకర నేత్రాలయ శ్రేయోభిలాషులు, ఫీనిక్స్ భారతీయ సమాజం అందించిన సహకారం ఇందులో భాగమైంది.

ఇంత పెద్ద కార్యక్రమం వెనుక ప్రణాళిక, ప్రచారం, టికెటింగ్, స్పాన్సర్‌షిప్‌లు, కళాకారుల ప్రయాణం, వసతి, వేదిక ఏర్పాట్లు, ప్రేక్షకుల సమన్వయం వంటి ఎన్నో అంశాల్లో సమిష్టి కృషి ఉంది. ఆది మొర్రెడ్డి, అనిల్ భరద్వాజ్, విజయ్ రాజ్, చెన్నా రెడ్డి మద్దూరి, చిత్రప్రియ, సుబ్బు ఉప్పులూరి, జ్ఞాని మారుపాకుల, జెగ్గీ క్రిష్, డా. కార్తిక్ రెడ్డి దొనూర్, లక్ష్మి బొగ్గరపు, ప్రవీణ్ సామల, శరవ్ సుబ్రమణియన్, సచ్చిదానంద ప్రభు, సతీష్ పంచాక్షరం, సతి శివం, శ్యామ్ బైరా, శ్రీజిత్ శ్రీనివాసన్, గుప్తా, శ్రీని సుబ్రమణియన్, వంశీ కృష్ణ ఇరువారం, ధీరజ్ రెడ్డి పోల కార్యక్రమ నిర్వహణలో తమ వంతు బాధ్యతలను నిర్వర్తించారు.

ఇళయరాజా సంగీత ప్రయాణానికి యాభై సంవత్సరాలు అనే సందర్భంలో జరిగిన ఈ కార్యక్రమం తరాలను కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఆయన పాటలను ఆస్వాదిస్తున్న తరం పక్కనే నేటి యువతరం కూడా అదే సంగీతాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించింది. వివిధ వయసులు, భాషలు, ప్రాంతాలకు చెందిన వేలాది మంది సంగీతంతో ఒక్కటయ్యారు.